టమోటా భారతీయ వంటల్లో తప్పనిసరిగా.. ఎక్కువగా వాడే కూరగాయ. దీన్ని కూరగాయ అంటుంటాం కానీ టమోటా పండుగానే పిలవబడుతుంది. ఉల్లిపాయ తర్వాత వంటల్లో లేకపోతే అస్సలు బాగోదు అనుకునే కూరగాయ టమోటానే.. అయితే టమోటాను వంటల్లో వాడటం కాకుండా జ్యూస్ చేసుకుని తాగితే చాలా మంచిదని, అది కూడా సమ్మర్ లో అయితే దీనివల్ల బోలెడు ప్రయోజనాలుంటాయని అంటున్నారు ఆహార నిపుణులు.. టమోటా జ్యూస్ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఓ లుక్కేస్తే..
సాధారణంగా కూరల్లో మాత్రమే వాడే టమోటా ఇప్పటికే కెచప్ రూపంలో చాలా విరివిగా వినియోగించబడుతోంది. కొందరికి దీని కెచప్ లేకపోతే అస్సలు గడవదంటే అతిశయోక్తి కాదు. కానీ ఇది నిజమే.. టమోటా సూప్, టమోటా కెచప్, టమోటా ఉరగాయ.. ఇలా చెప్పుకుంటూ పోతే టమోటా పాత్ర చాలానే ఉంది. టమోటా జ్యూస్ చేసుకుని తాగితే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలుంటాయి.
టమోటా లో విటమిన్-సి అధికంగా ఉంటుంది. శరీరం ఐరన్ గ్రహించడంలో ఇది సహాయపడుతుంది. ఇక ఇందులో ఉండే విటమిన్-కె పునరుత్పత్తి ఆరోగ్యాన్ని బలంగా ఉంచుతుంది. టమోటాలు ఆహారంలో భాగంగా తీసుకున్నా, టమోటా జ్యూస్ తాగుతున్నా పిల్లలు పుట్టడంలో కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి.
టమోటాలలో లైకోపీన్, బీటా కెరోటిన్, గామా కెరోటిన్ మొదలైనవి ఉంటాయి. గుండె సంబంధ సమస్యలను తగ్గించడంలో ఇవి చాలా బాగా సహాయపడతాయి. వేసవిలో టమోటా జ్యూస్ తాగుతుంటే గుండె ఆరోగ్యం పదిలంగా ఉంటుంది.
శరీరానికి అవసరమైన ఎలక్ట్రోలైట్ లలో సోడియం ఒకటి. ఈ సోడియం కండరాల మరమ్మత్తులకు, సెల్ కమ్యూనికేషన్ కు చాలా అవసరం. టమటాలలో ఈ సోడియం ఉండటం మూలానా టమోటా జ్యూస్ తీసుకుంటే కండరాలు, సెల్ కమ్యూనికేషన్ ఆరోగ్యంగా ఉంటాయి.
ఇప్పట్లో చాలామందిని వేధిస్తున్న సమస్య అధిక బరువు. బరువు తగ్గాలని అనుకునేవారు టమోటా రసాన్ని తీసుకుంటే శరీరంలో కొవ్వు కరిగించి బరువు తగ్గడానికి దోహదం చేస్తుంది.
కొందరు పోషకాహారం తీసుకున్నా శరీరంలో తగినంత శక్తి లేక ఇబ్బంది పడుతుంటారు. అయితే తీసుకునే పోషకాలను శరీరం సరిగా గ్రహించలేకపోవడం వల్ల ఈ సమస్య ఏర్పడుతుంది. కానీ ఖాళీ కడుపుతో టమోటా జ్యూస్ తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాల శోషణ పెరుగుతుంది.
టమోటా జ్యూస్ కేవలం ఆరోగ్య ప్రయోజనాలనే కాదు.. శరీరాన్ని డిటాక్స్ చేసే మంచి డిటాక్స్ డ్రింక్ గా కూడా పనిచేస్తుంది. శరీరంలో విషాలు తొలగించడంలో సహాయపడుతుంది. రోజూ టమోటా జ్యూస్ తీసుకుంటే శరీరం శుద్ది అవుతుంది.
టమోటాలలో జీర్ణ ఎంజైమ్ లు, ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల జీర్ణవ్యవస్థకు మంచి టానిక్ లాగా పనిచేస్తుంది. కడుపుకు సంబంధించిన సమస్యలు, జీర్ణ ఇబ్బందులు ఉన్నవారు టమోటా జ్యూస్ తీసుకుంటే చక్కని ఉపశమనం ఉంటుంది.
*రూపశ్రీ.