డ్రై ఫ్రూట్స్ అందరికీ ఇష్టమైనవి. ఖరీదు ఎక్కువని కొందరు వీటిని దూరం పెడతారు కానీ పండుగలు, శుభకార్యాలప్పుడు వంటల్లో డ్రై ప్రూట్స్ తప్పక ఉండాల్సిందే. డ్రై ఫ్రూట్స్ లో ఎండు ద్రాక్షకు చాలా ప్రత్యేకత ఉంది. ఎండుద్రాక్షను నీటిలో వేసి రాత్రంతా నానబెట్టి మరుసటిరోజు ఉదయాన్నే నానిన ఎండు ద్రాక్షలు తిని ఆ నీటిని తాగడం వల్ల  చాలా ప్రయోజనాలు కలుగుతాయని, మరీ ముఖ్యంగా వేసవి కాలంలో ఎండుద్రాక్షనీరు తాగడం మంచిదని అంటున్నారు వైద్యులు, ఆహార నిపుణులు. అసలు ఎండు ద్రాక్ష నీరు వేసవి కాలంలో తాగితే కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుంటే..

ఎండుద్రాక్షలో ప్రోటీన్, ఫైబర్, ఇనుము, పొటాషియం, రాగి, విటమిన్ B6 మరియు మాంగనీస్ వంటి అనేక ముఖ్యమైన పోషకాలు ఉన్నాయి.ఎండుద్రాక్ష నీటిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు ఆరోగ్యంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి.  టైప్ 2 డయాబెటిస్,  అల్జీమర్స్ వ్యాధి వంటి దీర్ఘకాలిక వ్యాధులను నివారిస్తాయి. ఎండుద్రాక్ష తినడం వల్ల రక్తంలో యాంటీఆక్సిడెంట్ స్థాయిలు పెరుగుతాయని,  మెదడు పనితీరు మెరుగుపడుతుందని నమ్ముతారు.


ఎండుద్రాక్ష నీరు ఐరన్  లోపం వల్ల కలిగే  రక్తహీనత వంటి పరిస్థితులను నివారిస్తుంది.  అలసట, శ్వాస ఆడకపోవడం, చర్మం సున్నితంగా మారడం, బలహీనత వంటి లక్షణాలు రక్తహీనత ఉన్నవారిలో ఉంటాయి.


ఎసిడిటీ సమస్య ఉన్నవారు ఎండుద్రాక్ష నీరు త్రాగడం మంచిది.  ఎందుకంటే ఇది కడుపులోని యాసిడ్‌ను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది.  ఇది పేగు పనితీరును మెరుగుపరచడంలో,  పేగులోని బ్యాక్టీరియాను నియంత్రించడంలో సహాయపడుతుంది. అందుకే ఎండుద్రాక్ష నీరు  పొట్ట ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.


ఎండుద్రాక్ష నీరు రక్త ప్రసరణను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇది జుట్టు మూలాలను బలపరుస్తుంది.  జుట్టు రాలడం సమస్యను నివారిస్తుంది. అందువల్ల జుట్టు రాలే సమస్యతో బాధపడే వారికి ఇది మేలు చేస్తుంది.

                                            *రూపశ్రీ.