అశ్వగంధ ఆయుర్వేదంలో ముఖ్యమైన మూలిక. ఇది ఒత్తిడిని తగ్గించడంలో, రోగనిరోధక శక్తిని పెంచడంలో,  శారీరక శక్తిని పెంచడంలో ప్రభావవంతంగా ఉంటుంది. దాని వేర్లు గుర్రపు వాసన రావడం వల్ల దీనికి అశ్వగంధ అనే పేరు వచ్చిందట. భారతదేశం, మధ్యప్రాచ్యం,  ఆఫ్రికాలో కనిపించే ఈ  మొక్క శతాబ్దాలుగా ఆయుర్వేద వైద్యంలో భాగంగా ఉంది. పురాతన ఔషధమైన అశ్వగంధ శరీరానికి, మనస్సుకు కూడా గొప్ప వరంగా చెప్పవచ్చు.  అయితే అశ్వగంధ కొందరు వ్యక్తులకు చాలా డేంజర్ అని, దీని వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయని అంటున్నారు. అవేంటో తెలుసుకుంటే..

అశ్వగంధ  ప్రయోజనాలు..

అశ్వగంధను తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అశ్వగంధ అనేది ఒక అడాప్టోజెన్. ఇది ఒత్తిడి హార్మోన్ (కార్టిసాల్) ను నియంత్రిస్తుంది. మానసిక ప్రశాంతతను అందిస్తుంది,  నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది. ఇది రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. ఇది జలుబు,  సీజనల్ వ్యాధులతో పోరాడటానికి సహాయపడుతుంది. ఇది కండరాల బలం, ఓర్పు,  శక్తిని పెంచుతుంది.  ఇది వ్యాయామం చేసేవారికి ముఖ్యంగా ప్రయోజనకరంగా ఉంటుంది.

అశ్వగంధ మధుమేహ రోగులకు,  ఆరోగ్యవంతులకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది రక్తంలో గ్లూకోజ్‌ను నియంత్రించడంలో సహాయపడుతుంది,  ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుంది. అశ్వగంధ జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది.  ఎముకలను బలోపేతం చేయడంలో కూడా సహాయపడుతుంది. అశ్వగంధ పొడిని అల్లం,  తులసితో టీలో కలిపి తాగడం వల్ల జలుబు,  దగ్గు నుండి ఉపశమనం లభిస్తుంది. గొంతు నొప్పి,  జ్వరం నుండి కూడా ఉపశమనం లభిస్తుంది.

ఎలా తీసుకోవాలి?

అశ్వగంధను తీసుకునే పద్ధతి ఆయుర్వేదంలో కూడా ప్రస్తావించబడింది. అశ్వగంధ  పొడిని వేడి పాలలో కలిపి తేనె లేదా బెల్లం తో తీసుకోవచ్చు.  అలాగే  అశ్వగంధ, అల్లం,  తులసి వేసి 5 నిమిషాలు మరిగించి టీగా కూడా తీసుకోవచ్చు.

ఒత్తిడి, బలహీనత,  బలహీనమైన రోగనిరోధక శక్తితో బాధపడేవారికి అశ్వగంధ ఒక వరం.  అయితే ఆరోగ్య నిపుణులు  దీనిని జాగ్రత్తగా తీసుకోవాలని సలహా ఇస్తున్నారు. గర్భిణీ స్త్రీలు,  పాలిచ్చే మహిళలు వైద్యుడిని సంప్రదించకుండా అశ్వగంధ వాడటం మంచిది కాదు.  ఇది థైరాయిడ్ హార్మోన్లను ప్రభావితం చేస్తుంది.

హైపర్ థైరాయిడ్ రోగులు కూడా జాగ్రత్తగా ఉండాలి. అశ్వగంధ నిద్రను పెంచుతుంది. ఇది మందుల ప్రభావాన్ని పెంచుతుంది. కాబట్టి నిద్ర మాత్రలు తీసుకునేవారు ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాలి. అధిక మొత్తంలో దీనిని తీసుకోవడం వల్ల కడుపులో చికాకు లేదా విరేచనాలు సంభవించవచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.

                                          *రూపశ్రీ.

గమనిక:
ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...