డిటాక్స్ డ్రింక్స్ ఈ మధ్యకాలంలో చాలా వైరల్ అయ్యాయి.  శరీరాన్ని శుద్ది చేయడంలో డిటాక్స్ డ్రింక్స్ చాలా బాగా పనిచేస్తాయని చెబుతారు.  ఈ డిటాక్స్ డ్రింక్స్ లో ఎన్నెన్నో పానీయాలు పరిచయం చేస్తూనే ఉన్నారు. బీట్రూట్ క్యారెట్ జ్యూస్ లేదా షాట్ నుండి.. కాకరకాయ,  నిమ్మరసం,  ఉసిరి వంటి ఎన్నో పదార్థాలతో డిటాక్స్ డ్రింక్స్ అందుబాటులోకి వచ్చాయి. ఇవి కాలేయాన్ని శుద్ది చేస్తాయని,  శరీరంలో టాక్సిన్లు తొలగిస్తాయని చెబుతారు.  కానీ దీని గురించి వైద్యులు చెబుతున్న విషయం వేరే ఉంది.  మానవ శరీరం ఫ్లష్ చేయాల్సిన,  మూసుకుపోయిన పైపు లాంటిది కాదని, స్వీయ-నియంత్రణ జీవరసాయన వ్యవస్థ ఈ శరీరానికి స్వతహాగా ఉన్న లక్షణం అని అంటున్నారు. డిటాక్స్ డ్రింక్స్ ను గుడ్డిగా తీసుకునే ముందు వైద్యులు ఏం చెప్తున్నారో తెలుసుకోవడం చాలా ముఖ్యం అంటున్నారు.

డీటాక్స్ పానీయాలు అవసరమా?


శరీర భాగాలు 24 గంటలూ  పని చేస్తుంటాయి.  కాబట్టి  ఎలాంటి డిటాక్స్ జ్యూస్ లు  అవసరం లేదని వైద్యులు అంటున్నారు.

కాలేయం..

ఇది మందులు, ఆల్కహాల్, హార్మోన్లు,  జీవక్రియ వ్యర్థాలను శరీరం విసర్జించగల రూపంలోకి విచ్ఛిన్నం చేస్తుంది.

మూత్రపిండాలు..

మూత్రపిండాలు రోజుకు సుమారు 150-180 లీటర్ల రక్తాన్ని ఫిల్టర్ చేస్తాయి. అవి యూరియా, క్రియాటినిన్,  అదనపు ఉప్పు వంటి టాక్సిన్లను నిరంతరం తొలగిస్తాయి.


ఈ అవయవాలు సరిగ్గా పనిచేస్తుంటే ఎలాంటి డీటాక్స్ జ్యూస్ అవసరం లేదని,  అవి సరిగ్గా పనిచేయకపోతే,  ఏ డిటాక్స్ జ్యూస్ కూడా వాటిని సరిచేయలేదని వైద్యులు చెబుతున్నారు.


డిటాక్స్ జ్యూస్ లు హాని కలిగిస్తాయా?

మూత్రపిండాల వ్యాధి..

దుంపలు, టమోటాలలో పొటాషియం అధికంగా ఉంటుంది. అధిక పొటాషియం స్థాయిలు హృదయ స్పందనలకు క్రమరహితంగా మారి, ప్రమాదకరంగా మారేందుకు కారణమవుతాయి.


రాళ్లు..

బీట్‌రూట్,  పాలకూర రసంలో అధిక మొత్తంలో ఆక్సలేట్ ఉంటుంది. ఇది రాళ్ల సమస్యను మరింత తీవ్రతరం చేస్తుంది .


డయాబెటిస్..

జ్యూస్ రూపంలో  తీసుకోవడం వల్ల పండ్లు,  కూరగాయల నుండి ఫైబర్ తొలగిపోతుంది. దీనివల్ల రక్తంలో చక్కెర వేగంగా పెరుగుతుంది .


కాలేయ వ్యాధి..

కూరగాయల రసం ప్యాటీ లివర్  లేదా ఫైబ్రోసిస్‌ను నయం చేస్తుందని చాలామంది అనుకుంటారు. కానీ దీనికి  ఎటువంటి ఆధారాలు లేవు.


హైపోనాట్రేమియా..

ద్రవాలు మాత్రమే తీసుకునే ఆహారం శరీరంలో సోడియం స్థాయిలను తగ్గిస్తుంది.

సైన్స్ ఏం చెబుతోందంటే..

డీటాక్స్ జ్యూస్‌లు బరువు తగ్గడానికి లేదా అవయవాలను శుభ్రపరచడానికి సహాయపడతాయని నిరూపించడానికి ఎటువంటి క్లినికల్ ఆధారాలు లేవు. డీటాక్సిఫికేషన్ ప్రక్రియ వల్ల కాకుండా, ప్రాసెస్ చేసిన ఆహారాలను తగ్గించడం, తక్కువ కేలరీలు తీసుకోవడం,  హైడ్రేటెడ్‌గా ఉండటం వల్ల మంచి ఆరోగ్యం లభిస్తుంది.

శరీరం శుభ్రంగా ఉండాలంటే ఇవి చేయాలి..

శరీరానికి ఫైబర్ అందేలా పండ్లు,  కూరగాయలను పూర్తిగా తినాలి.

పుష్కలంగా నీరు త్రాగాలి,  మద్యపానం మానుకోవాలి.


క్రమం తప్పకుండా వ్యాయామం,  మంచి నిద్ర పొందాలి.

డయాబెటిస్, బిపి, కొలెస్ట్రాల్ లను అదుపులో ఉంచుకోవాలి.

                                     *రూపశ్రీ.