.webp)
మన శరీరంలో కిడ్నీలు అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తాయి. ఇవి రక్తాన్ని నిరంతరం శుద్ధి చేస్తూ, శరీరంలోని వ్యర్థాలను, అదనపు నీటిని మూత్రం ద్వారా బయటకు పంపిస్తాయి. అయితే, జీవనశైలిలో మార్పులు , వివిధ ఆరోగ్య సమస్యల కారణంగా కిడ్నీలు బలహీనపడే ప్రమాదం ఉంది. కిడ్నీలు దెబ్బతినడం మొదలైనప్పుడు మన శరీరం కొన్ని హెచ్చరిక సంకేతాలను ఇస్తుంది. ముఖ్యంగా, మూత్ర విసర్జనలో వచ్చే మార్పులు కిడ్నీ సమస్యలకు తొలి సంకేతాలుగా భావించవచ్చు. వీటిని ముందుగానే గుర్తించడం ద్వారా పెద్ద ముప్పు నుంచి బయటపడవచ్చు.
మూత్రంలో నురుగు..
సాధారణంగా కిడ్నీల పనితీరు మందగించినప్పుడు మూత్రం రంగు, పరిమాణం , దాని స్వభావంలో స్పష్టమైన మార్పులు కనిపిస్తాయి. కొందరిలో మూత్రం చేసే సమయంలో విపరీతంగా , ఎక్కువసేపు నిలిచి ఉండే తెల్లటి నురగ వస్తుంటుంది. ఇలా తరచూ జరగడం మూత్రంలో ప్రొటీన్ బయటకు పోతున్నదనేదానికి ముఖ్య సంకేతం. ఆరోగ్యవంతమైన కిడ్నీలు శరీరానికి అవసరమైన ప్రొటీన్‌ను ఉంచుకుని వ్యర్థాలను మాత్రమే బయటకు పంపిస్తాయి. కానీ కిడ్నీ ఫిల్టర్లు దెబ్బతిన్నప్పుడు ప్రొటీన్ మూత్రం ద్వారా కారిపోతుంది.
మూత్రం రంగు..
మూత్రం రంగులో వచ్చే మార్పులను కూడా తేలికగా తీసుకోకూడదు. సాధారణంగా మూత్రం లేత పసుపు రంగులో ఉంటుంది. కానీ ఎటువంటి కారణం లేకుండా మూత్రం ముదురు పసుపు రంగులో, గోధుమ రంగులో లేదా తేయాకు రంగులో పడుతుంటే అప్రమత్తం కావాలి. కొన్ని సందర్భాల్లో మూత్రం గులాబీ రంగులో లేదా ఎరుపు రంగులో రావడం కూడా జరుగుతుంది. దీనిని వైద్య పరిభాషలో హెమటూరియా అంటారు. కిడ్నీలో రాళ్లు ఏర్పడటం, ఇన్ఫెక్షన్లు తలెత్తడం లేదా వాపు కారణంగా ఇలా జరగవచ్చు. నొప్పులు లేకపోయినా మూత్రంలో రంగు మారడం లేదా రక్తం పడటం జరిగితే వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవడం చాలా అవసరం.

మూత్రవిసర్జన వేళలు..
మూత్ర విసర్జన చేసే వేళల్లో వచ్చే తేడాలు కూడా కిడ్నీ సమస్యలను సూచిస్తాయి. పగటిపూట లేదా రాత్రి సమయంలో సాధారణం కంటే చాలా ఎక్కువసార్లు మూత్ర విసర్జనకు వెళ్లాల్సి రావడం కిడ్నీల సామర్థ్యం తగ్గడానికి ఒక కారణం కావచ్చు. కిడ్నీలు మూత్రాన్ని సరిగ్గా ఫిల్టర్ చేయలేకపోవడం వల్ల ఈ సమస్య ఎదురవుతుంది. దీనికి తోడు డయాబెటిస్ లేదా ప్రోస్టేట్ సమస్యలు కూడా కారణం కావొచ్చు. మరోవైపు, అకస్మాత్తుగా మూత్రం వచ్చే పరిమాణం చాలా తగ్గిపోవడం లేదా పూర్తిగా ఆగిపోవడం జరిగితే అది చాలా ప్రమాదకరమైన పరిస్థితికి సంకేతం.
ఇది కూడా చదవండి కిడ్నీ, లివర్ సమస్యలకు ముందే శరీరం ఇచ్చే సంకేతాలు ఇవే!
వాసన..
మూత్రం నుండి తీవ్రమైన లేదా సాధారణం కాని ఘాటైన వాసన రావడం కూడా కొన్నిసార్లు శరీరంలో నీటిశాతం తగ్గడం వల్ల లేదా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వల్ల కావచ్చు. ఈ లక్షణాలతో పాటు పొత్తి కడుపులో నొప్పి, జ్వరం లేదా మంట వంటి సమస్యలు ఉంటే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి.
మరికొన్ని సిగ్నల్స్..
మూత్రంలో కనిపించే ఈ మార్పులతో పాటు శరీరం ఇతర సంకేతాలను కూడా ఇస్తుంది. ముఖం మరియు పాదాలు ఉబ్బడం, ఒంట్లో తీవ్రమైన నీరసం నిరంతరం వేధించడం, ఆకలి మందగించడం, వికారంగా అనిపించడం, చర్మంపై విపరీతమైన దురద పుట్టడం , కండరాలు పట్టేయడం వంటి లక్షణాలు కనిపిస్తే కిడ్నీలు సరిగా పనిచేయడం లేదని అర్థం చేసుకోవాలి. శరీరంలో వ్యర్థాలు పేరుకుపోవడం వల్లే ఇవన్నీ జరుగుతాయి.
అధిక రక్తపోటు, మధుమేహం దీర్ఘకాలికంగా నియంత్రణలో లేకపోవడం, కిడ్నీలో రాళ్లు, పదే పదే వచ్చే మూత్ర సంబంధిత ఇన్ఫెక్షన్లు , వైద్యుల సలహా లేకుండా విచ్చలవిడిగా పెయిన్‌కిల్లర్స్ వంటి మందులను వాడటం వల్ల కిడ్నీలు తీవ్రంగా దెబ్బతింటాయి. కాబట్టి ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవడం, తగినంత నీరు తాగుతూ ఉండటం , ఏ చిన్న అనారోగ్య లక్షణం కనిపించినా వెంటనే వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకోవడం ద్వారా కిడ్నీల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
*రూపశ్రీ.
మీకు నచ్చవచ్చు ఈ ఐదు ఆరోగ్య సూత్రాలు పాటిస్తే చాలు.. జీవితం మారిపోతుంది..
మోకాళ్ల నొప్పులతో ఇబ్బందా..ఈ 5 వ్యాయామాలు మిస్ అవ్వకండి .!




