వేసవి కాలం వెళ్ళిపోయి చలికాలం వైపు అడుగులు వేస్తున్న సమయంలో మార్కెట్లోకి విరివిగా వచ్చే పండ్లలో సీతాఫలం ఒకటి. పైకి బొడిపెల్లా ఉంటూ, లోపల  గుజ్జుతో ఎంతో తియ్యగా ఉండే ఈ పండును చాలామంది ఇష్టంగా తింటారు. రుచిలోనే కాదు, ఆరోగ్య ప్రయోజనాల్లోనూ సీతాఫలం ఎంతో ముందుంటుంది. మరి ఈ సీజన్లో దొరికే సీతాఫలాలను ఎవరు తినాలి? రోజుకు ఎన్ని తినాలి? దీనివల్ల  శరీరానికి కలిగే లాభాలు ఏమిటో ఇప్పుడు వివరంగా తెలుసుకుంటే..

సీతాఫలం ఎవరు తినాలి?

చిన్న పిల్లల నుంచి ముసలివాళ్ల వరకు అందరూ సీతాఫలాలు తినవచ్చు. ముఖ్యంగా ఎల్లప్పుడూ నీరసంగా ఉండేవాళ్లకు, త్వరగా అలసిపోయే వాళ్లకు ఇవి చాలా మంచివి. బరువు పెరగాలనుకునే వాళ్లకు, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వాళ్లకు ఈ పండు చక్కటి ఆహారం. అయితే షుగర్ వ్యాధి ఉన్నవాళ్లు మాత్రం డాక్టర్ సలహా మేరకు తక్కువ మోతాదులో తీసుకోవడం మంచిది.

రోజుకు ఎన్ని తినాలి?

ఏదైనా సరే అతిగా తింటే నష్టమే కలుగుతుంది. సీతాఫలాలు తియ్యగా, కేలరీలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి రోజుకు ఒకటి లేదా రెండు పండ్లు తింటే సరిపోతుంది. అంతకంటే ఎక్కువ తింటే బరువు పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే జీర్ణ సమస్యలు ఉన్నవాళ్లు మితంగా తినడం చాలా ముఖ్యం.

సీతాఫలాల వల్ల కలిగే బెనిఫిట్స్..

శక్తిని ఇస్తుంది..

రోజంతా పని చేసి అలసిపోయిన వాళ్లకు సీతాఫలం తింటే తక్షణ శక్తి వస్తుంది. ఇందులో ఉండే సహజమైన చక్కెరలు శరీరానికి కావాల్సిన ఎనర్జీని అందిస్తాయి.

గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది..

ఈ పండులో పొటాషియం, మెగ్నీషియం సమృద్ధిగా ఉంటాయి. ఇవి రక్తపోటును అదుపులో ఉంచడానికి సహాయపడతాయి. గుండె జబ్బులు రాకుండా కాపాడుకోవడానికి ఇవి తోడ్పడతాయి.

జీర్ణ శక్తి మెరుగుపడుతుంది..

సీతాఫలాలలో పీచు పదార్థం ఎక్కువశాతంలో ఉంటుంది. ఇది కడుపును శుభ్రం చేయడానికి, మలబద్ధకం సమస్యను తగ్గించడానికి ఎంతో సహాయపడుతుంది. జీర్ణవ్యవస్థ సాఫీగా పనిచేసేలా చేస్తుంది.

రోగ నిరోధక శక్తి పెరుగుతుంది..

ఈ పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచి, సీజనల్ వ్యాధులు, జలుబు, దగ్గు వంటివి రాకుండా రక్షణ ఇస్తుంది.

చర్మం, జుట్టు అందంగా ఉంటాయి..

విటమిన్ ఎ, యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం వల్ల సీతాఫలాలు చర్మానికి మంచి మెరుపును ఇస్తాయి. జుట్టు రాలే సమస్యను తగ్గించి, కుదుళ్లను బలంగా ఉంచడంలో సహాయపడతాయి.

ఎముకలు బలపడతాయి..

కాల్షియం, మెగ్నీషియం ఉండటం వల్ల ఎముకలు దృఢంగా మారుతాయి. కీళ్ల నొప్పులతో బాధపడే వాళ్లకు సీతాఫలం మంచి ఆహారం.

మొత్తానికి సీతాఫలం కేవలం రుచికరమైన పండు మాత్రమే కాదు, ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే దివ్యౌషధం. ఈ సీజన్లో దొరికే ఈ అద్భుతమైన పండును అస్సలు మిస్ కాగండి.

                                                                                                                                           * రూపశ్రీ.