దోసకాయ చాలామందికి ఇష్టమైన కూరగాయ. దీన్ని నేరుగా తినేసేవారు కొందరైతే.. ఉప్పు కారం చల్లుకుని, కాస్త మసాలా జోడించి స్పైసీగా తినేవారు మరికొందరు. జ్యూస్ చేసుకుని తాగేవారు ఇంకొందరు. చాలామంది ఆరోగ్య స్పృహతో డిటాక్స్ వాటర్ తయారుచేసుకుని తాగుతుంటారు. అందులో తప్పనిసరిగా కీరదోసకాయను చేర్చుతారు. అటు నోటికి రుచిని ఇస్తూ, ఇటు ఆకలి తీరుస్తూ.. మొత్తం మీద బరువు తగ్గడంలో మ్యాజిక్ చేసే కీర దోసకాయను నీటిలో వేసి ఆ తరువాత ఆ నీటిని తాగడం వల్ల చాలా ఉత్తమమైన ఫలితాలు ఉంటాయని డైటీషియన్లు అంటున్నారు. ఇంతకీ ఈ కీర దోసకాయ కథ ఏంటో పూర్తీగా తెలుసుకుంటే..
కీర దోసకాయ కూలింగ్ ఏజెంట్ గా పనిచేస్తుంది. ఇది శరీరాన్ని చాలా బాగా చల్లబరుస్తుంది. శరీరంలో తేమ శాతాన్ని నిలిపి ఉంచుతుంది. అయితే కీర దోసకాయను ముక్కలుగా చేసి దాదాపు లీటరుకు పైగా నీటిలో వేయాలి. ఈ నీరు ఇంకా బాగా రుచిగా ఉండటం కోసం ఇందులో పుదీనా ఆకులు, నిమ్మకాయ ముక్కలు, అల్లం వేసుకోవచ్చు. ఒక జార్ లో ఇవన్నీ వేసి బాగా కలిపి మూత పెట్టి ఉంచాలి. దీన్ని 1-2 గంటల పాటూ అలాగే కదపకుండా ఉంచాలి. ఆ తరువాత ఈ నీటిని తాగవచ్చు.
లాభాలేంటంటే..
చర్మం పొడిబారడం, శరీరంలో మంట, మైకము వంటివి శరీరంలో నీటి కొరత ఏర్పడటం వల్ల సంభవించే సమస్యలు. ఈ దుష్ప్రభావాలను తగ్గించడానికి సాధారణ సమయాల్లో అయినా, వేసవి వేడి సమయంలో అయినా ఈ నీటిని తీసుకోవడం ఉత్తమం. దోసకాయ నీటిలో జోడించే ఇతర పదార్థాల వల్ల ఇది అదనపు రుచితో ఉల్లాసంగా ఉంచుతుంది.
దోసకాయలో కరిగే ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణక్రియలో సహాయపడుతుంది. శరీరం నుండి విషాన్ని బయటకు పంపుతుంది.
కీర దోస నీటిలో ఉండే ఫైబర్లు, ఎంజైమ్ ల కారణంగా చర్మం ఆరోగ్యంగా మారుతుంది. ఇది సెల్యులార్ స్థాయిలో చర్మం పొరలను క్లియర్ చేస్తుంది. చర్మాన్ని మెరుగుపరుస్తుంది.
దోసకాయల్లో కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ఫాస్పరస్, విటమిన్ ఎ, విటమిన్ కె ఉంటాయి. ఇవన్నీ సహజ యాంటీఆక్సిడెంట్లు. కణాలకు ఆక్సీకరణ నష్టం జరగకుండా ఇవి సహాయపడతాయి.
దోసకాయలో చక్కెరలు తక్కువగా ఉంటాయి. ఇది బరువు పెరగడానికి దోహదం చేయదు. పైపెచ్చు వాటిలో ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది ఆకలిని తగ్గిస్తుంది, అతిగా తినడాన్ని నిరోధిస్తుంది.
*రూపశ్రీ.