పిల్లల ఏడుపుని ఎప్పుడైనా శ్రద్ధగా గమనించారా! ‘ఆ... అందులో గమనించేటందుకు ఏముటుంది? అన్ని ఏడుపులూ ఒకే రకంగా ఏడుస్తాయి కదా!’ అంటారా. పిల్లల మాతృభాషను బట్టి వారి ఏడుపు కూడా మారుతూ ఉంటుందని జర్మనీకి చెందిన ఒక పరిశోధకురాలు తేల్చిచెప్పేశారు. ఇంతకీ ఆ పరిశోధన ఏమిటో, అందులో తేలిన విషయం ఏమిటో, దాని వల్ల మనకి ఉపయోగం ఏమిటో మీరే చూడండి...

 

టోనల్‌ లాంగ్వేజ్

అన్ని భాషలూ ఉచ్ఛారణ మీదే ఆధారపడి ఉంటాయన్న విషయం మనకు తెలిసందే! అయితే కొన్ని భాషలలో, ఆ ఉచ్ఛారణలోని చిన్న చిన్న మార్పులను బట్టి అర్థాలు మారిపోతూ ఉంటాయి. ఉదాహరణకు చైనీయులు పలికే మాండరిన్‌ భాషలో ఒకే పదాన్ని నాలుగు రకాలుగా పలికితే, నాలుగు అర్థాలు వస్తాయి. ఇక ఆఫ్రికాలో వినిపించే లామ్‌సో అనే భాషలో అయితే ఒక పదాన్ని ఎనిమిదిరకాలుగా పలికి ఎనిమిది అర్థాలను తీయవచ్చు. ఇలా స్వరంలో మార్పుని బట్టి వేర్వేరు అర్థాలను కలిగించే భాషను ‘టోనల్‌ లాంగ్వేజ్’ అంటారు. మన దేశంలో పంజాబీ భాష మాత్రమే ఈ విభాగం కిందకు వస్తుంది.

 

భాషని బట్టి ఏడుపు!

ఇంతకీ ఈ భాషకూ, పిల్లల ఏడుపుకూ మధ్య సంబంధ ఏమన్నా ఉంటుందా? అని జర్మనీలోని ఉర్జ్‌బర్గ్ విశ్వవిద్యాలయానికి చెందిన కేథ్‌లీన్‌ అనే ప్రొఫెసరుగారికి అనుమానం కలిగింది. అనుకున్నదే తడవుగా చైనాకు చెందిన ఓ 55 మంది పిల్లలనీ, లామ్‌సోని మాట్లాడే ప్రాంతంలో ఓ 21 మంది పిల్లలనీ ఆమె పరిశీలించారు. ఆశ్చర్యంగా మాండరిన్‌ వంటి టోనల్‌ లాంగ్వేజ్ మాతృభాషగా కలిగిన పిల్లల ఏడుపు కూడా అలాగే రాగయుక్తంగా ఉంటుందని ఈ పరిశోధనలో తేలింది. అలాకాకుండా సాఫీగా సాగిపోయే జర్మనీ వంటి మాతృభాషలు కలిగిన పిల్లలు సౌమ్యంగా ఏడుస్తున్నారట

 

ఎందుకలా!

పిల్లలు తమ తల్లి కడుపులో ఉన్న ఆరో నెల నుంచే, ఆమె మాట్లాడుతున్న భాషను గుర్తిస్తారని చెబుతున్నారు కేథ్‌లీన్‌. ఆమె మాట్లాడే భాషకు అనుగుణంగానే తాము కూడా శబ్దాలు చేసేందుకు ప్రయత్నిస్తారనీ... అందువల్ల, తల్లి మాతృభాష పిల్లల ఏడుపులో ప్రతిధ్వనిస్తుందనీ అంటున్నారు. అత్యాధునిక వసతులు ఉన్న చైనాలో అయినా, ఆధునికతకు అల్లంత దూరాన ఉండే ఆఫ్రికాలో అయినా... ఈ నియమం వర్తిస్తుందని రుజువు చేస్తున్నారు.

 

ఉపయోగం

ఇంకా ఈ ప్రపంచంలోకి రాకుండానే పిల్లల మెద,డు తమ మాతృభాషను నేర్చుకునేలా రూపుదిద్దుకుంటోందని ఈ పరిశోధనతో తేలిపోతోంది. దీనిని బట్టి పిల్లలకు మొదట మాతృభాష నేర్పించిన తరువాతే ఇతర భాషల జోలికి పోవాలని స్పష్టమవుతోంది. పైగా ఇలా పిల్ల ఏడుపుని, భాషకు అనుగుణంగా పరిశీలించండం వల్ల... వారి మానసిక ఎదుగుదల సవ్యంగా ఉందా లేదా అన్నది గమనించవచ్చన్నది పరిశోధకులు అభిప్రాయం. మరీ ముఖ్యంగా మున్ముందు సదరు పిల్లల్లో భాషని నేర్చుకోవడంలో ఏవన్నా సమస్యలు ఏర్పడతాయేమో అన్నది ముందుగానే పసిగట్టవచ్చునన్నది కేథ్‌లీన్‌ ఆలోచన. మంచిదే!

(తెలుగుభాషా దినోత్సవం సందర్భంగా)

 

- నిర్జర.