
సాధారణంగా ఏదైనా అనారోగ్యం వల్ల డాక్టర్ చెకప్ చేయించుకున్నప్పుడు చాలామంది కిడ్నీ టెస్ట్ కూడా చేయించుకుంటారు. ఈ సందర్భంలో కొందరిలో క్రియేటినిన్ స్థాయిలు ఎక్కువగా ఉన్నట్టు బయటపడుతుంటుంది. క్రియేటినిన్ అనేది ఎక్కువగా ఉండటం వల్ల శరీరంలో విషపదార్థాలు ఎక్కువగా పేరుకుపోవడానికి దారి తీస్తుందని వైద్యులు చెబుతున్నారు. అసలు కియేటినిన్ అంటే ఏంటి? ఇది ఎక్కువ స్థాయిలో ఉంటే కిడ్నీలు ఎందుకు డేంజర్ లో పడతాయి. దీన్ని తగ్గించుకోవడానికి ఏం చేయాలి? తెలుసుకుంటే..
క్రియాటినిన్ అంటే..
క్రియాటినిన్ అనేది కండరాలలో ఉత్పత్తి అయ్యే వ్యర్థ పదార్థం. ఈ క్రియాటినిన్ ను మూత్రపిండాలు సులువుగానే ఫిల్టర్ చేస్తాయి. అయితే దీనికి కూడా ఒక పరిమితి ఉంది. ఈ పరిమితికి మించి క్రియాటినిన్ అనేది ఉత్పత్తి అయితే మూత్రపిండాల పనితీరు మీద ప్రబావం చూపిస్తుంది. మూత్రపిండాలు సరిగా పనిచేయకపోవడం వల్ల మూత్రపిండాలలో విష పదార్థాలు పేరుకుపోయి మూత్రపిండాల మీద ఒత్తిడి పెరుగుతుంది.
క్రియాటినిన్ ఎలా పెరుగుతుంది?
మానవ శరీరంలో క్రియేటిన్ అనే సమ్మేళనం విచ్చిన్నం కావడం ద్వారా క్రియేటినిన్ ఉత్పత్తి అవుతుంది. ఇది కండరాలకు శక్తిని అందించడంలో సహాయపడుతుంది. సాధారణంగా ఉన్నప్పుడు మూత్రపిండాలు దీన్ని సులువుగా ఫిల్డర్ చేసి, శరీరంలో ద్రవాల సమతుల్యతను కాపాడతాయి. అయితే గాయం, ఇన్పెక్షన్, మధుమేహం, అదిక రక్తపోటు, మందుల దుష్ప్రభావాల వల్ల మూత్రపిండాలు ప్రభావితం అయినప్పుడు రక్తంలో క్రియేటినిన్ స్థాయిలు పెరుగుతాయి. కొన్నిసార్లు శరీరం డీహైడ్రేషన్ కు లోను కాపడం, అధికంగా ప్రోటీన్ తీసుకోవడం, కఠినమైన వ్యాయామాలు చేయడం లేదా కొన్ని మందులు.. మొదలైనవి క్రియేటినిన్ ను పెంచుతాయి.
క్రియేటినిన్ స్థాయి..
సాధారణంగా క్రియేటినిన్ స్థాయి 0.6-1.3m/dl వరకు ఉంటుంది. ఇది మగవారిలో కొంచెం ఎక్కువ ఉంటుంది. స్త్రీలలో కండర ద్రవ్యరాశిని బట్టి కొంచెం తక్కువగా ఉంటుంది.
క్రియేటినిన్ పెరిగితే కనిపించే లక్షణాలు..
రక్తంలో క్రియేటినిన్ పెరిగితే ఎప్పుడూ అలసటగా ఉండటం, కాళ్లలో వాపు, ఊపిరి ఆడకపోవడం, మూత్ర విసర్జనలో మార్పులు, తలనొప్పి, కంటి చూపు మసకబారటం, నడుము దిగువ భాగంలో నొప్పి మొదలైన లక్షణాలు శరీరంలో క్రియేటినిన్ స్థాయిలు పెరిగాయనడానికి సంకేతాలు. మూత్రపిండాల మీద ఒత్తిడి పెరిగితే ఈ లక్షణాలన్నీ కనిపిస్తాయి. క్రియేటినిన్ స్థాయిలను మొదట్లోనే గుర్తించగలిగితే కిడ్నీల ఆరోగ్యం కాపాడుకోవడానికి వీలవుతుంది.
క్రియేటినిన్ ఎప్పుడు ప్రమాదకరంగా మారుతుంది..
శరీరంలో క్రియేటినిన్ స్థాయిలను ముందుగానే గుర్తించి, వైద్యం తీసుకోగలిగితే మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. కానీ క్రియేటినిన్ ను గుర్తించకుండా అలాగే ఎక్కువ రోజులు కొనసాగితే దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి, మూత్రపిండాల వైఫల్యం, గుండె సమస్యలు, ఎలక్ట్రోలైట్ అసమతుల్యత వంటి తీవ్రమైన ప్రమాదాలు ఏర్పడే అవకాశం ఉంటుంది.
క్రియేటినిన్ పెరకకూడదంటే ఏం చేయాలి?
క్రియేటినిన్ పెరగకూడన్నా, క్రియేటినిన్ ను మూత్రపిండాలు సమర్థవంతంగా ఫిల్టర్ చేయాలన్నా నీరు పుష్కలంగా తాగాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అంతేకాదు.. ప్రోటీన్, ఉప్పు నియంత్రణలో తీసుకోవాలని, మధుమేహం, రక్తపోటు సమస్యలు ఉంటే వాటిని జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవాలని కూడా వైద్యులు చెబుతున్నారు. అదే విధంగా వైద్యుల సలహా లేకుండా మందులు, ముఖ్యంగా మూత్రపిండాలను ప్రభావితం చేసే మందులు అస్సలు వాడకూడదు.
*రూపశ్రీ.
గమనిక:
ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...




