.webp)
ఆహారమే ఆరోగ్యానికి ఔషదంగా పనిచేస్తుంది. భారతీయ ఆయుర్వేదం చాలా వరకు ఆరోగ్య సమస్యలకు ఆహారాన్నే ఔషదంగా సూచిస్తుంది. బోలెడు రకాల వంటకాలు, దేశ విదేశీ రుచులు ఎప్పుడు కావాలంటే అప్పుడు లభించే నేటికాలంలో ఆహారం దగ్గర కంట్రోల్ లో ఉండటం కాసింత కష్టమైన పనే.. కానీ ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకునేవారు, డైటింగ్ చేస్తున్నవారు.. బయట ఫంక్షన్లు, పార్టీలు, శుభకార్యాలు, ఫ్రెండ్స్ తో లంచ్, డిన్నర్ వంటివి చేసేవారు ఆహారం దగ్గర కంట్రోల్ ఉండలేకపోతున్నాం అని బాధపడుతూ ఉంటారు. అలా బాధపడక్కర్లేకుండా బయట తినేటప్పుడు అతిగా తినడాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో తెలుసుకుంటే..
హెల్తీ ఫుడ్స్..
వేయించిన, క్రిస్పీ లేదా క్రీమీ వంటకాలకు బదులుగా గ్రిల్ చేసిన, బేక్ చేసిన, ఆవిరి మీద ఉడికించిన లేదా ఉడికించిన వంటకాలను ఎంచుకోవాలి. వంట చేసిన విధానం మీద ఆ వంటలో ఉండే కేలరీలు డిసైడ్ అవుతాయి. గ్రిల్ చేసిన లేదా ఆవిరి మీద ఉడికించిన ఆహారాలకు తక్కువ నూనె అవసరం అవుతుంది. వేయించిన లేదా క్రీమీ ఆహారాలలో ఎక్కువ ఫ్యాట్ ఉంటుంది. అందుకే రెస్టారెంట్లలో వేయించిన ఆహారాల కంటే గ్రిల్ చేసిన లేదా కాల్చిన, స్టీమ్ చేసిన ఆహారాన్ని ఎంచుకోవడం మేలు.
డ్రింక్స్ వద్దు..
రెస్టారెంట్‌లో భోజనం చేసేటప్పుడు అతిగా తినకుండా ఉండటానికి డ్రింక్స్ కు బదులుగా నీటిని మాత్రమే తీసుకోవాలి. బయట భోజనం చేసేటప్పుడు కూల్ డ్రింక్స్ లేదా జ్యూస్‌లు ఆర్డర్ చేయడం చాలా కామన్. కానీ ఇవి కేలరీలు పెరగడానికి కారణం అవుతాయి. అందుకే కూల్ డ్రింక్స్, జ్యూస్ ల కంటే నీరు మాత్రమే తీసుకోవడం మేలు.
హెల్తీ ఛాయిస్..
రెస్టారెంట్లలో ఫ్రైస్ లేదా చిప్స్ కు బదులుగా కూరగాయలు లేదా సలాడ్ ఎంచుకోవాలి. చాలా వంటకాలు అధిక కేలరీల కలిగిన సైడ్ డిష్ లతో కాంబినేషన్ గా ఉంటాయి. ఇలాంటి వాటిని హెల్తీ ఛాయిస్ గా మార్చుకోవాలి.
ప్రోటీన్ ఫుడ్..
బయటకు వెళ్లి ఆహారం తీసుకున్నా.. ఆ ఆహారం ప్రధానంగా ప్రోటీన్ ఆహారమై ఉండేలా చూసుకోవాలి. దీని కోసం చికెన్, టర్కీ లేదా చేప వంటి ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాలను ఎంచుకోవచ్చు. ఈ ఆహారాలు కడుపు నింపడమే కాకుండా ఎక్కువసేపు శక్తిని, హెల్తీ ఫ్యాట్స్ ను కూడా అందిస్తాయి.
పోర్షన్..
చాలావరకు రెస్టారెంట్లలో ఆర్డర్ చేసే ఆహారం పెద్ద మొత్తంలో ఉంటుంది. బిర్యానీ, మండీ.. లాంటి వాటి జోలికి వెళ్లకుండా ప్లేట్ మీల్స్ టైప్ లో ఆహారాన్ని ఆర్డర్ చేసుకుని సింపుల్ గా తక్కువగా తినడం మంచిది. ఒకవేళ పెద్ద మొత్తంలో ఆహారం ఆర్డర్ చేయాల్సి వచ్చినా సొంతంగా వడ్డించుకోకుండా ఎవరితోనైనా ఆహారాన్ని వడ్డించమనాలి. దీని వల్ల ఎక్కువ ప్లేట్ లో పెట్టుకోకుండా ఉంటారు. ఆహారం లిమిట్ లోనే ఉంటుంది.
నెమ్మది..
బయట తినేటప్పుడు నెమ్మదిగా తినడం చాలా ఇంపార్టెంట్. ఏవో పనులు ఉన్నాయనో లేదా అందరూ వేగంగా తింటున్నారనో ఆహారాన్ని సరిగా నమలకుండా వేగంగా తింటే జీర్ణ సంబంధ సమస్యలు వస్తాయి. నిదానంగా తింటే ఆహారం కూడా ఎక్కువగా కాకుండా సరిపడినంత తినవచ్చు. ఆహారం ఎంత బాగా నమిలితే అంత బాగా కడుపు నిండిన ఫీల్ ఉంటుంది.
*రూపశ్రీ.
గమనిక:
ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...




