వాతావరణం మారితే అది ఆరోగ్యంపై ప్రభావం చూపడానికి ఎక్కువ సమయం పట్టదు.  వర్షాకాలం ప్రారంభమైన నేపధ్యంలో  దగ్గు,  జలుబు చాలా ఎక్కువగా  వస్తుంటాయి. ఈ సీజనల్ సమస్యలు సాధారణంగా రెండు మూడు రోజులలో తగ్గిపోతాయి. కానీ రోగనిరోధక శక్తి తక్కువ ఉన్నవారికి ఇవి అంత సులువుగా తగ్గవు.  వీటిని తగ్గించడానికి ఇంట్లోనే కొన్ని చిట్కాలను ప్రయత్నించవచ్చు.  ఇవి చాలా వేగంగా దగ్గు, జలుబు నుండి రిలీఫ్ ఇస్తాయి.  అవేంటో తెలుసుకుంటే..


తేనె..

 
జలుబు, దగ్గు వంటి సమస్యలు వచ్చినప్పుడు  ఉదయం, సాయంత్రం తేనెను వెచ్చ చేసి తింటే సమస్య నుంచి బయటపడవచ్చు. తేనెలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి, ఇది జలుబు,  దగ్గుకు దివ్యౌషధంగా పనిచేస్తుంది. తేనెను కొద్దిగా వేడి చేసి తీసుకోవాలి. అయితే  ఒక సంవత్సరం కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు తేనె ఇవ్వకూడదు.

వెల్లుల్లి..


యాంటీవైరల్, యాంటీ బ్యాక్టీరియల్,  యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉండే వెల్లుల్లిని తీసుకోవడం వల్ల దగ్గు, జలుబు తగ్గుతాయి. వెల్లుల్లిని పచ్చిగా లేదా తేలికగా కాల్చి తింటే  రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో ప్రభావవంతంగా ఉంటుంది. ఇది దగ్గు, జలుబు నుండి త్వరగా ఉపశమనం కలిగిస్తుంది.

పసుపు..


పసుపులో ఔషధ గుణాలు సమృద్ధిగా ఉంటాయి.  సీజనల్ సమస్యల నుండి ఉపశమనం అందించడంలో సహాయపడుతుంది. పసుపులో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీవైరల్,  యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. పసుపు నీటిని తయారు చేసి త్రాగవచ్చు లేదా పసుపు టీ లేదా పసుపు పాలు తాగడం వల్ల కూడా ఉపశమనం పొందవచ్చు.

తులసి..


తులసి ఆకులను వివిధ రకాలుగా ఆహారంలో చేర్చుకోవచ్చు. తులసి ఆకులతో చేసిన టీ తాగడం వల్ల దగ్గు,  జలుబు నుండి త్వరగా ఉపశమనం లభిస్తుంది. ఈ ఆకుల్లో యాంటీమైక్రోబయల్ గుణాలు ఉన్నాయి. ఇవి దగ్గును నివారించడంలో ప్రభావవంతంగా ఉంటాయి.

ఉప్పు నీరు..


ఉప్పు నీరు గొంతును శుభ్రపరచడంలో..   దగ్గు,  జలుబు నుండి ఉపశమనాన్ని అందించడంలో ప్రభావవంతంగా ఉంటాయి . ఉప్పునీరు గొంతులో పేరుకుపోయిన శ్లేష్మాన్ని తొలగిస్తుంది.  ఈ నీటిని తాగాల్సిన అవసరం లేదు ఈ నీటితో పుక్కిలిస్తే సరిపోతుంది. ఉప్పు నీళ్లతో పుక్కిలిస్తే గొంతు క్లియర్ అవుతుంది. ఒక గ్లాసు వేడి నీటిలో ఒక చెంచా ఉప్పు వేసి ఆ నీటితో పుక్కిలించాలి.


                                            *రూపశ్రీ.