చలికాలం రాగానే మనసంతా ఏదో తెలియని వేదనతో నిండిపోతోందా! ఏ పని చేయాలన్నా చిరాకుగా ఉంటోందా? సాధారణంగా ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు ‘ఆ ఏముందిలే చలికాలం కదా, ఈ కాస్త బద్ధకం సహజమే!’ అనుకుంటూ ఉంటాము. కానీ లక్షణాల తీవ్రత మరీ ఎక్కువగా ఉన్నప్పుడు అది కాలంతో పాటుగా వచ్చే డిప్రెషన్కి సూచన కావచ్చునంటున్నారు వైద్యులు.

లక్షణాలు

పైన చెప్పుకున్నట్లుగా తెలియని వేదన, చిరాకుతో పాటుగా చలికాలంలో ఈ కింది లక్షణాలు కూడా కనిపిస్తే మనకు Seasonal affective disorder (SAD) అనే వ్యాధి ఉందని అనుమానించాల్సి ఉంటుంది.

- ఎంతసేపు నిద్రపోయి లేచినా ఇంకా నిస్సత్తువగా, మత్తు వదలనట్లుగా ఉండటం.
- చిన్న విషయాలకే ఆందోళన చెందుతూ తరచూ ఉద్వేగానికి లోనవ్వడం.
- ఆకలిలో మార్పులు వచ్చి పిండిపదార్థాలు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకునేందుకు మొగ్గుచూపడం. తద్వారా    బరువు పెరగడం.
-ఇతరులతో కలవడానికి, బయట తిరగడానికీ ఇష్టపడకపోవడం. ఏక్కడన్నా తిరస్కారానికి గురైనప్పుడు భరించలేకపోవడం.
- ఏ పని మీదా ఏకాగ్రత లేకపోవడం. మూడీగా, చిరాకుగా ఉండటం.

కారణాలు

SAD ఎందుకు వస్తుందన్నదానికి శాస్త్రవేత్తలు స్పష్టమైన కారణాలు చెప్పలేకపోతున్నారు. అయితే కొన్ని కారణాలను మాత్రం ఊహించగలుగుతున్నారు. అవి...

- చలికాలంలో తగ్గిపోయే సూర్యకాంతి మన జీవగడియారం మీద ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఇదే తాత్కాలిక  డిప్రెషన్కు దారితీస్తుంది.
- సూర్యకాంతి తగ్గుదల వల్ల మన మెదడులోని ‘సెరొటోనిన్’ అనే రసాయనంలో తగ్గుదల ఏర్పడుతుంది. దీని వలన కూడా  డిప్రెషన్ ఏర్పడే అవకాశం ఉంది.
- తక్కువ సూర్యకాంతిలో ‘మెలటోనిన్’ అనే రసాయనం ఉత్పత్తి ఎక్కువగా జరుగుతుంది. ఈ అసమతుల్యత కూడా  డిప్రెషన్కు దారి తీస్తుంది. 

అవకాశం

అప్పటికే డిప్రెషన్ ఉన్నవారికి, అది చలికాలంలో మరింతగా ముదిరే ప్రమాదం ఉంది. వంశపారంపర్యంగా ఈ వ్యాధి ఉన్నవారిలో కూడా SAD ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక చలిప్రదేశాలలో నివసించేవారికి ఈ వ్యాధి సోకే సంభావ్యత ఎక్కువ. ఉదాహరణకు అమెరికాలోని అలాస్కా అనే చలి ప్రదేశంలో దాదాపు పదిశాతంమందిలో ఈ వ్యాధి లక్షణాలు కనిపిస్తున్నాయని తేలింది.

చికిత్స

వరుసగా రెండుమూడేళ్లపాటు ప్రతి చలికాలంలోనూ ఈ వ్యాధి లక్షణాలు కనిపించినప్పుడు ఒకసారి వైద్యుని సంప్రదించడం మంచిది. అప్పుడు ఆయన ఈ లక్షణాలు SADకు చెందినవా లేకపోతే Bipolar Disorder వంటి ఇతర వ్యాధులను సూచిస్తున్నాయా అన్న అంచనాకు వస్తారు. గదిలో కృత్రిమ కాంతులను ఏర్పాటు చేసే లైట్ థెరపీ ద్వారా, యాంటీ డిప్రెసంట్స్ వంటి మందుల ద్వారా వైద్యులు ఈ వ్యాధికి చికిత్సను అందిస్తారు. తరచూ వ్యాయామం చేయడం, ఉదయం వేళల్లో సూర్యకాంతిలో తిరగడం, ఆప్తులతో ఎక్కువసేపు గడపడం, ధ్యానం చేయడం వంటి చర్యలతో కూడా SAD నుంచి ఉపశమనం పొందవచ్చు.


SADని అశ్రద్ధ చేస్తూ ‘చలికాలంలో ఇలాంటి సహజమేలే’ అని బలవంతంగా సర్దుకుపోయేందుకు ప్రయత్నిస్తే అది మన ఉద్యోగాల మీద తీవ్రమైన ప్రభావం చూపవచ్చు. మత్తుపదార్థాలకు అలవాటు పడటం, ఆత్మహత్యకి ప్రేరేపించే ఆలోచనలు ఏర్పడటం వంటి ప్రమాదాలు కూడా SADతో పాటుగా పొంచిఉంటాయి. అందుకే చలికాలంలో చర్మం గురించి, జలుబూజ్వరాల గురించే కాదు... మెదడు గురించి కూడా కాస్త జాగ్రత్త వహించాలి.

 

- నిర్జర.