శరీరంలో వివిధ భాగాలను అనుసంధానం చేస్తూ కీళ్లు ఉంటాయి. కొన్నేళ్ళ క్రితం వరకు ఓ వయసు దాటిన తరువాత మాత్రమే కీళ్ల నొప్పుల సమస్య ఉండేది. కానీ ఇప్పుడు నిండా ముప్పై ఏళ్లు కూడా లేనివారు కీళ్ల నొప్పులు అంటూ ఉంటారు. జీవనశైలి మారడం నుండి ఆహారం కలుషితం కావడం వరకూ ప్రతి ఒక్కటీ కీళ్లమీద ప్రభావం చూపిస్తుంది. ప్రతి సంవత్సరం అక్టోబర్ 12వ  తేదీని ప్రపంచ ఆర్థరైటిస్ డే గా జరుపుకుంటారు. ఈరోజున కీళ్ల ఆరోగ్యం, కీళ్ల అరుగుదల, కీళ్లు దృఢంగా ఉండాలంటే తీసుకోవలసిన  జాగ్రత్తలు మొదలైన విషయాల మీద చర్చిస్తారు. కీళ్ల వ్యాధుల మీద  అవగాహన కల్పిస్తారు.

ఉదయం నిద్ర లేవగానే కీళ్లలో నొప్పి, వాపు, నడవడంలో ఇబ్బంది, కీళ్లు బిగుసుకుపోవడం కీళ్ల జబ్బులలో  ప్రధాన లక్షణాలు. 50 కంటే ఎక్కువ రకాల ఆర్థరైటిస్ వ్యాధులు ఉన్న కారణంగా  ఆర్థరైటిస్ కు ఖచ్చితమైన కారణాలను కనుక్కోవడం ద్వారా మాత్రమే దాని పరిష్కారం గురించి ఆలోచించవచ్చు.  కీళ్లనొప్పులు నయం చేయలేని వ్యాధి అన్నది నిజమే కానీ  జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకుంటే అది మరింత తీవ్రం కాకుండా నిరోధించవచ్చు. జీవనశైలిలో కేవలం నాలుగు అలవాట్లను మార్చుకోవడం వల్ల కీళ్లనొప్పులను చాలావరకు తగ్గించుకోవచ్చు.  అవేంటో తెలుసుకుంటే..

ఎక్కువసేపు కూర్చోవడం మానేయాలి..

కార్పొరేట్ సంస్కృతి కారణాన  పనివేళలు బాగా పెరిగిపోవడంతో ఎక్కువ గంటలు సిస్టమ్ ముందు ఉండాల్సి వస్తోంది. అటువంటి పరిస్థితిలో, సర్వైకల్ స్పాండిలైటిస్,  కీళ్ల దృఢత్వం  సమస్యలు ముందుగానే దాడి చేస్తున్నాయి.  పనులు ఆపుకోవడం సాధ్యం కాదు, కానీ పని మధ్యలో కాస్త చిన్న విరామాలు తీసుకుంటూ ఉండాలి. 40నిమిముషాలకు ఒకసారి అయినా సీట్ నుండి లేచి పది అడుగులు వేస్తుండాలి.   రోజులో  30 నుండి 40 నిమిషాల ఏరోబిక్ వ్యాయామాన్ని భాగం చేసుకోవాలి . ఇందుకోసం  సైక్లింగ్ , స్విమ్మింగ్ , బ్రిస్క్ వాక్  మొదలైనవి ఫాలో కావచ్చు. వ్యాయామం రక్త ప్రసరణను పెంచడమే కాకుండా కీళ్లకు కూడా మంచిది.  కండరాల బలాన్ని పెంచుతుంది. ఆంకైలోజింగ్ స్పాండిలైటిస్‌తో బాధపడుతున్న  రోగులలో  వ్యాయామం,  యోగా ఉపశమనాన్ని అందిస్తాయి.

ధూమపానం మానేయాలి..

ఆర్థరైటిస్ వేగాన్ని 5 రెట్లు పెంచడానికి ధూమపానం ఒక  కారణం. ధూమపానం ఆర్థరైటిస్‌ను మరింత తీవ్రతరం చేస్తుందని వైద్య పరిశోధనలలో కూడా నిరూపించబడింది.  ఇది శరీరానికి వ్యతిరేకంగా పనిచేసే ప్రతిరోధకాలను సృష్టిస్తుంది.  దీని కారణంగా, గుండె సంబంధిత జబ్బులు కూడా పెరుగుతాయి. ఆర్థరైటిస్ రోగులు ధూమపానం మానేసి మరింత ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలి.

చక్కెర వద్దు.. పండ్లు ముద్దు..

 కీళ్లనొప్పులు తీవ్రంగా మారకుండా ఉండాలంటే ఎలాంటి డైట్ ఎంచుకోవాలో తెలుసుకోవాలి.   ఆర్థరైటిస్‌లో ఆహారం చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.   ఆహారం ద్వారా దీన్ని పూర్తిగా నియంత్రించలేనప్పటికీ, ఇది చాలా వరకు తీవ్రం కాకుండా చేయవచ్చు. ప్రతిరోజు యాంటీఆక్సిడెంట్  అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. అందులో పండ్లు మరియు కూరగాయలు ఎక్కువ పరిమాణంలో ఉండాలి. యాంటీ ఆక్సిడెంట్లు అత్యధికంగా ఉండే దానిమ్మ వంటి కొన్ని పండ్లను  రెగ్యులర్ డైట్‌లో భాగం చేసుకోవాలి. అదేవిధంగా పసుపు, దాల్చినచెక్క ,  మెంతి గింజలు కూడా కీళ్ళనొప్పులు తగ్గించడంలో సహాయపడతాయి. వీటిని తీసుకోవాలి.  

కానీ రెడ్ మీట్, సీ ఫుడ్, శీతల పానీయాలు, ప్యాక్డ్ ఫుడ్,  ప్రాసెస్ చేసిన ఆహారాలను ఖచ్చితంగా నివారించాలి. తద్వారా కీళ్ళనొప్పులు ఎక్కువ కావు.

బరువు పెరగకండి..

భారతదేశంలో  క్రమంగా  స్థూలకాయుల సంఖ్య పెరుగుతోంది.  అందుకే మధుమేహం కేసులు కూడా పెరుగుతున్నాయి. మీ BMI 24 లేదా అంతకంటే ఎక్కువ ఉంటే శరీరంలో బ్రౌన్ ఫ్యాట్ అధికంగా ఉందని, ఇది సైటోకిన్‌లను ఉత్పత్తి చేస్తుందని సూచిస్తుంది.  దీని ఫలితంగా ఆర్థరైటిస్‌కు దారితీస్తుంది. అధిక బరువు ఉన్న రోగులకు ఆర్థరైటిస్‌ను నియంత్రించడానికి ఎక్కువ మందులు అవసరమని అధ్యయనాలు చెబుతున్నాయి. ఊబకాయం ఉన్న రోగిలో CRP స్థాయి 20 వరకు  ఉంటే అది సాధారణం. దీని కారణంగా, గత కొన్ని సంవత్సరాలుగా మోకాలి మార్పిడి  కేసులు కూడా పెరిగాయి.

పై నాలుగు అంశాలలో జాగ్రత్తలు తీసుకుంటే కీళ్ళనొప్పులను నియంత్రణలో ఉంచడం సాధ్యమే..

                                              *నిశ్శబ్ద.