వైభవ గోదావరి – 9

పశ్చిమ గోదావరి జిల్లా

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో గోదావరి రెండు జిల్లాలలో మాత్రమే ప్రవహిస్తోంది. అవే తూర్పు గోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా. గోదావరికి ఒక ఒడ్డున పశ్చిమ గోదావరి జిల్లాలోని కొవ్వూరయితే మరో ఒడ్డున తూర్పు గోదావరి జిల్లాలోని ప్రధాన పట్టణం, ప్రస్తుతం రాజమండ్రిగా పిలువబడే రాజమహేంద్రవరం. వీటిలో పశ్చిమ గోదావరి జిల్లా గురించి ముందు చెప్పుకుందాము.గోష్పాద క్షేత్రం, కొవ్వూరు పశ్చిమ గోదావరి జిల్లాలో గోదావరి ఒడ్డున ప్రధాన పట్టణం కొవ్వూరు. పూర్వం దీనిని గోష్పాదం, గోవూరు అనేవారు. గౌతమ మహర్షి ఇక్కడ తపస్సు చేసుకుంటూ, అనేక గోవులను పోషిస్తూ వుండేవాడు. . ఆయన గోవుల పాద ముద్రలు ఆ ప్రదేశమంతా వుండేవిట. గోవుల పాద ముద్రలు వున్న ప్రదేశంగనుక గోష్పాదం అయింది. గోవులన్నీ ఇక్కడ వుండేవిగనుక గోవూరు. అదే కాలక్రమేణా కోవూరు, కొవ్వూరు అయింది.

స్ధల పురాణం ప్రకారం ఒకసారి చాలా పెద్ద కరువు వచ్చింది. ప్రజలు తిండి లేక నానా అవస్తలు పడసాగారు. గౌతమ మహర్షి తన తపో శక్తి చేత ప్రతి రోజూ పంటలు పండించి, అందరికీ భోజనం పెట్టేవాడు. దానితో ఆయన కీర్తి అన్ని వైపులా పాకింది. అది సహించలేని తోటి ఋషులు ఒక మాయ ఆవుని సృష్టించి ఆయన పొలాల మీదకి పంపుతారు. గౌతమ మహర్షి తన పంట పొలాలు మేస్తున్న ఆ ఆవుని దర్భతో ఆదిలించాడు. ఆ ఆవు చని పోతుంది. గో హత్యా పాతకం పోవాలంటే దివినుండి గంగను భువికి తీసుకురావాలంటారు. దానికోసం గౌతముడు త్రయంబకేశ్వరుణ్ణి ప్రార్ధిస్తాడు. గౌతముడి ప్రార్ధన మన్నించి శివుడు బ్రహ్మగిరి లో తన జటాజూటంనుంచి గంగ పాయనొకదానిని వదులుతాడు. ఆ గంగ మాయా గోవుని బతికించి గోదావరి అయింది, గౌతమ మహర్షిచేత రప్పించబడిందిగనుక గౌతమి అయింది.

కొవ్వూరులో గోష్పాద క్షేత్రం చెప్పుకోదగిన గొప్ప ఆధ్మాత్మిక కేంద్రం. ఇక్కడ గోదావరీ తీరాన శ్రీ బాలా త్రిపుర సుందరీ సమేత సుందరేశ్వరస్వామి, గౌతమ మహర్షి ప్రతిష్టించిన శ్రీ వరద గోపాల స్వామి వగైరా ఆలయాలున్నాయి.ఇక్కడ గోదావరి వశిష్ట, గౌతమి అని రెండు పాయలుగా చీలి, తిరిగి వాటినుంచి ఐదు పాయలుగా చీలుతుంది. ఈ పాయలు సప్త గోదావరిగా ప్రసిధ్ధి. ఈ సప్త గోదావరులను సప్త ఋషులు ప్రజల మేలుకోరి తమవెంట అనేక జన ప్రదేశాలద్వారా తీసుకెళ్ళి ఏడు చోట్ల సముద్రాలలో కలిపారంటారు. అప్పటి సప్త ఋషుల పేర్ల మీద ఈ పాయలకు కాశ్యపి (తుల్యభాగ), అత్రి, వశిష్ట, కౌశికి, జమదగ్ని, గౌతమి అనే పేర్లు వచ్చాయి. ఇవి కోరంగి, అంతర్వేది, భైరవపాలెం, యానాం వగైరా ప్రదేశాలలో సాగర సంగమం చేస్తాయి.

ఆచంట: పూర్వం ఒడయనంబి అనే శివ భక్తుడు, తన భార్యతో తీర్ధయాత్రలు చేస్తూ, ఈ ప్రాంతానికి వచ్చి కొన్నాళ్ళు వున్నారు. ఒడయనంబి వేళ తప్పకుండా శివ పూజ చేసేవాడు. ఒకసారి ఆయనకి మెలుకువ వచ్చేసరికి శివ పూజకి కాలాతీతం అయింది. సమయంలో శివ పూజ చేయాలనే ఉద్దేశ్యంతో, ఆలయం దాకా వెళ్ళే సమయంలేక శివలింగంకోసం చుట్టూ చూసి, తన భార్య స్తనంలో శివుణ్ణి దర్శించి పూజించాడు. తర్వాత తను తప్పు చేశానని బాధ పడుతుండగా శివుడు ప్రత్యక్షమయి చిత్తశుధ్ధితో చేసిన ఆయన పూజలు తను అంగీకరించానని సెలవిస్తాడు. ఆయనే ఆచంటేశ్వరునిగా వెలిశాడు.

నరసాపురం: మూడు వందల సంవత్సరాల క్రితం నిర్మించబడిన శ్రీ ఆదికేశవ ఎంబర్ మన్నార్ ఆలయం నరసాపురంలో ప్రసిధ్ధి చెందిన దేవాలయం.. ఇది భారతదేశ ప్రసిద్ద వైష్ణవాలయాలలో ఒకటి. ప్రతి సంవత్సరం ఇక్కడ జరిగే ఆదికేశవ స్వామి బ్రహ్మోత్సవాలకు, రామానుజాచార్యుల తిరునక్షత్ర ఉత్సవానికి దేశంలోని వివిధ ప్రాంతాలనుండి చాలామంది వైష్ణవ స్వాములు, భక్తులు వస్తారు.

కొండాలమ్మ దేవాలయము: ఈ ఆలయం గోదావరి వడ్డున పాతరేవు, కొత్తరేవుల మధ్య ఉంది. అమ్మవారి విగ్రహము దొరికిన చోటనే దేవాలయము కట్టించారు. విగ్రహము దాదాపు ఐదు అడుగుల ఎత్తులో అందముగా ఉంటుంది.

కపిల మల్లేశ్వరస్వామి దేవాలయము: ఇది నరసాపురం మెయిన్ రోడ్డు చివర్లో వున్నది. ఈ ఆలయానికి ఎదురుగా మదన గోపాల స్వామి ఆలయం వున్నది.

రాజగోపాలస్వామి ఆలయం: సఖినేటి పల్లె వెళ్ళే దారిలో వున్నది. ఆరంతస్తుల గోపురముఖద్వారముతో, మంచి శిల్పకళ వున్న ఆలయము. ఇవే కాక మదన గోపాల స్వామి మందిరం, లలితాంబ గుడి, కనక దుర్గ గుడి వంటి పలు ఆలయాలున్నాయి. ఇటీవల కాలంలో ఒక జైన మందిరం కూడా నిర్మించబడింది.ఇవి కాకుండా సిద్ధాంతం, తాళ్లపూడి, ఆచంట మండలంలోని పలు ప్రాంతాల్లోనూ గోదావరి ప్రవహిస్తోంది. రేపు తూర్పు గోదావరి జిల్లా చూద్దాము.

పి.యస్.యమ్. లక్ష్మి

(తెలుగులో అత్యధిక యాత్రా వ్యాసాలు వ్రాసిన మహిళ)


More Purana Patralu - Mythological Stories