వైభవ గోదావరి - 12
శ్రీ జగన్మోహినీ కేశవస్వామి ఆలయం, ర్యాలి
మీకు ఉద్యోగంలో ట్రాన్స్ఫర్ కావాలనుకుంటున్నారా? ఎన్నాళ్ళనుంచో ఎదురుచూస్తున్న స్ధాన చలనం ఎంతకీ రావటం లేదా? అయితే మీరు తప్పకుండా దర్శించుకోవాల్సిన క్షేత్రం ర్యాలీ. ర్యాలీ వెళ్ళొచ్చినవాళ్ళకి బదిలీ తొందరలో తప్పకుండా వస్తుందని భక్తుల నమ్మకం. తూర్పు గోదావరి జిల్లాలో రావులపాలెం దగ్గర అందమైన ప్రకృతి సౌందర్యాన్ని కూడా ఆస్వాదించాలంటే వెలుతురుండగా వెళ్ళండి. మేము ర్యాలీ వెళ్ళేసరికి చీకటిపడటంవల్ల దోవలో ప్రకృతి అందాలు చూడలేకపోయాం.
శ్రీ మహావిష్ణువు ముందువైపు పురుషరూపంలోనూ వెనుకనుంచి చూస్తే స్త్రీ రూపంలోనూ దర్శనమిచ్చే అపురూపమయిన ఆలయం ఇది. విష్ణుదేవుడు ఈ రూపంలో పూజలందుకోవటం బహుశా ఇంకెక్కడా లేదేమో. ఆలయం చిన్నదేకానీ, జగన్మోహినీ కేశవస్వామి శిల్పం మాత్రం అద్భుతం. భోళా శంకరుడు వరాలివ్వటం, శ్రీ మహావిష్ణువు ఆ వరాలవల్ల వచ్చే ఉత్పాతాలనుంచి అందరినీ కాపాడటం .. మనం చదువుకున్న కధలే కదండీ. అలాంటి అవతారమే మోహినీ రూపం. ఈ మోహినీ భస్మాసురుల కధ అందరికీ తెలిసి వుండవచ్చుగానీ, మోహినీ శంకరుల కధ తెలుసా? అదే ర్యాలి ఆవిర్భావానికి కారణం అంటారు కొందరు. మోహినిని చూసిన శంకరుడు మాయామోహంలోపడి ఆవిడని వెంబడించాడు. శంకరుణ్ణి తప్పించుకుంటూ మోహిని ఈ ప్రదేశానికి వచ్చినప్పుడు ఆవిడ తలలోనుంచి ఒక పువ్వు ఇక్కడరాలి పడిందిట. దానిని వాసన చూసిన శివుడుకి మాయ వీడిపోయ ఎదురుగా విష్ణు భగవానుడు కనబడ్డాడు. మోహిని తలలోంచి పువ్వు రాలి పడ్డదిగనుక ఆ స్ధలం పేరు రాలి, క్రమంగా ర్యాలి అయిందంటారు. ఆ కధకి నిదర్శనంగానే శ్రీ మహావిష్ణు విగ్రహం ముందునుంచి పురుష రూపం, వెనుకనుంచి మోహినీ రూపంతో వున్నదంటారు.
ఇంకో కద ప్రకారం, 11 వ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని చోళరాజులు పరిపాలిస్తూండేవాళ్ళు. అప్పుడు ఇక్కడంతా దట్టమైన అరణ్యాలు వుండేవి. చోళ రాజులలో ఒకరైన రాజా విక్రమదేవుడు ఒకసారి ఈ ప్రాంతానికి వేటకు వచ్చాడు. కొంతసేపు వేటాడిన తర్వాత అలసిన రాజు ఒక చెట్టుకింద పడుకుని నిద్రపోయాడు. ఆ నిద్రలో మహావిష్ణువు ఆయన కలలో కనబడి, తన విగ్రహం ఆ ప్రాంతాల్లో వుందని దానిని తీసి ఆలయ నిర్మాణం చేసి పూజలు జరిపించమని చెప్పాడు. ఆ విగ్రహాన్ని కనుగొనటానికి ఒక చెక్క రధాన్ని ఆ ప్రాంతంలో లాగుకుని వెళ్తుంటే ఆ రధశీల ఎక్కడ రాలి పడిపోతుందో అక్కడ తవ్విస్తే విగ్రహం కనబడుతుందని చెప్పాడు. విక్రమదేవుడు భగవత అదేశాన్ని పాటించి ఈ ప్రాంతంలో విగ్రహాన్ని కనుగొని ఆలయాన్ని కట్టించాడు. ఇక్కడ రధ శీల రాలి పడిపోయిందిగనుక రాలి, ర్యాలి అన్న పేరు వచ్చింది. ఏ ఆలయంలోనైనా గర్భ గుడిలో మనం సాధారణంగా విగ్రహానికి వెనుక పక్కకి వెళ్ళం. ఇక్కడ కూడా అదే అలవాటుగా ముందునుంచి దణ్ణం పెట్టుకుని వచ్చేయకండి. విగ్రహం వెనుకపక్కకి వెళ్ళి పద్మినీజాతి స్త్రీని వెనుకవైపునుంచి చూస్తే ఎలా వుంటుందో చూడండి. ఐదు అడుగుల ఎత్తైన సాలిగ్రామ శిల ఇది. విగ్రహం ముందునుంచీ చూస్తే కేశవస్వామి, వెనుక మోహినీ రూపం. మకరతోరణంమీద దశావతారాలు, నారద, తుంబురులు, ఆదిశేషు, పొన్నచెట్టు, గోవర్ధనగిరి, మహర్షులు, అన్నీ ఆవిగ్రహం చుట్టూ వున్నాయి. ఆ విగ్రహంయొక్క గోళ్ళు కూడా చాలా సజీవంగా కనిపిస్తాయి. వెనుకవైపునుంచి చూస్తే పద్మినీజాతి స్త్రీ అలంకరణ. శిల్పం మొత్తం ప్రతి అణువూ అద్భుతంగా, అన్ని అలంకరణలూ స్పష్టంగా తెలిసేటట్లు మలచబడ్డది.
ఇక్కడ ఇంకొక విశేషం....విగ్రహం పాదాల దగ్గరవున్న చిన్న గుంటనుంచి నీరు ఎంత తీసినా వస్తూంటుంది. ఈ నీరు భక్తుల తలలమీద జల్లుతూ వుంటారు. స్వయంభూనో, శిల్పి చాతుర్యమో, ఏదయినాగానీ ఆ దేవదేవుని అవతారమూర్తిని చూసి అద్భుతమని చేతులు జోడించవలసినదే.ఈ క్షేత్రంలోని ఇంకొక విశిష్టత విష్ణ్వాలయం ఎదురుగావున్న ఈశ్వరాలయం ఇక్కడ ఈశ్వరుడు శ్రీ ఉమా కమండలేశ్వరస్వామి. పూర్వం ఇక్కడ త్రిమూర్తులలో ఒకరైన బ్రహ్మదేవుడు తపస్సు చేశాడుట. ఆ సమయంలో ఆయన తన కమండలంపై ఉమతో కూడిన ఈశ్వరుని ప్రతిష్టించాడుట. అందుకే ఈ ఆలయం ఉమా కమండలేశ్వరాలయంగా ప్రసిధ్ధికెక్కింది.ఇక్కడ ఇంకొక విశేషం తర్వాత తెలిసింది. ఇది చదివిన తర్వాత వెళ్ళినవాళ్ళు గమనించండి. ఈశ్వరుడుకి అభిషేకం చేసిన నీరు బయటకిగానీ కిందకిగానీ పోవటానికి మార్గంలేదుట. మోహినీమూర్తినిచూసి మోహించిన శివుని శరీర వేడికి పైన అభిషేకం చేసిన గంగ హరించుకుపోతుందంటారు.
తూర్పు గోదావరి జిల్లాలో కోనసీమకి ముఖద్వారం అని చెప్పదగ్గ రావులపాలెంకి 6 కి. మీ. ల దూరంలో ఆత్రేయపురం మండలంలో వున్న ఈ గ్రామానికి రాజమండ్రినుండి బస్సులున్నాయి. రావులపాలెంనుంచి ఆటోలోకూడా వెళ్ళవచ్చు. ఆత్రేయపురం అంటే మీకు నోరూరటంలేదా!? అటు పక్కగా వెళ్ళేవాళ్ళందరూ తప్పకుండా దర్శించుకునే పురం ఆత్రేయపురం. ఇక్కడ స్వామి పూతరేకుల మహా స్వామి. ఉపాలయాలుగా వివిధ రుచుల పూత రేకులు, అంటే బెల్లంవి, పంచదారవి, డ్రై ఫ్రూట్స్ వి .. ఎన్నో ఎవర్ని చూసి ఎవర్ని చూడకుండా వదులుతారు. ప్రతి ఒక్కళ్ళూ మీకు వరమిచ్చే దేవతేనాయే అంటే మీకిష్టమైనవేగా! అందుకే మీకేంకావాలో చూసుకోండి. రేపు యానాంమీదుగా వెళ్ళి మురమళ్ళ వీరభద్రస్వామి దర్శనం చేసుకుందాం.
పి.యస్.యమ్. లక్ష్మి
(తెలుగులో అత్యధిక యాత్రా వ్యాసాలు వ్రాసిన మహిళ)