ఇంద్రజిత్ రథాన్ని నేలకూల్చినవాడు!

రావణుడి మనుషులకు చిక్కకుండా పైకి ఎగిరిన అంగదుడు రావణుడి మేడను ఒక్క తన్ను తన్నగానే ఆ మేడ ఊగి కదిలిపోయింది. అంగదుడు అక్కడి నుండి వెళ్లిపోగానే  రావణుడు వెంటనే ద్వారాలన్నీ మూయించేసాడు. 

"యుద్ధం ప్రారంభం అవుతుంది అందరూ సిద్ధంకండి" అన్నాడు. తూర్పు దిక్కుకి సర్వసైన్యాధికారి అయిన ప్రహస్తుడిని వెళ్ళమని ఆజ్ఞ ఇచ్చాడు, దక్షిణ దిక్కుకి మహోదర, మహోపార్శులని నియమించాడు, పశ్చిన దిక్కుకి ఇంద్రజిత్ ని పెట్టాడు, ఉత్తర దిక్కుకి శుక సారణులని పెట్టి, నేను మీతో యుద్ధానికి వస్తాను అన్నాడు. అక్కడే ఉండి ఎవ్వరికీ కనిపించకుండా ఇదంతా చూసిన విభీషణుడి గూఢచారులు  వెనక్కి వెళ్ళి విభీషణుడితో, రాముడితో విషయమంతా చెప్పారు.

అప్పుడు రాముడు "తూర్పు దిక్కున ఉన్న ప్రహస్తుడిని మన సర్వసైన్యాధికారి అయిన నీలుడు ఎదుర్కొంటాడు. దక్షిణ దిక్కున ఉన్న మహోదర, మహోపార్శులని యువరాజైన అంగదుడు ఎదుర్కొంటాడు. పశ్చిమ దిక్కున ఉన్న ఇంద్రజిత్ ని హనుమంతుడు ఎదుర్కొంటాడు. ఉత్తర దిక్కున ఉన్న శుక సారణులకి నాయకత్వం వహించి రావణుడు ఉన్నాడు కాబట్టి లక్ష్మణుడితో కలిసి నేనే వెళ్ళి రావణుడిని ఎదుర్కొంటాను. నాలుగు దిక్కులా యుద్ధం ప్రారంభం అవుతోంది, బయలుదేరండి" అన్నాడు. 

అలా లంకలో రామ, రావణ యుద్ధం ప్రారంభం అయింది. 

వాసరులందరూ ఆ యుద్ధంలో ప్రాసాదాలని తిరగ తోసేసారు. పర్వత శిఖరాలని తీసుకొనివచ్చి విసిరేశారు, చెట్లతో కొట్టారు. కనపడ్డ ప్రతి రాక్షసుడిని చంపేశారు. రాక్షసులు నాలుగు ద్వారాలనీ మూసి ఉంచడం వల్ల బయట ఉన్నవాళ్లు బయట ఉన్నవాళ్ళతో యుద్ధం చేస్తున్నారు.

వానరములకు రాక్షసులకు యుద్ధం జరగబోయేముందు రాముడు అందరితో ఒక మాట చెప్పాడు. "యుద్ధం చేస్తున్న రాక్షసులు కామరుపాన్ని పొందగలరు, అలాగే వానరములలో కూడా కొంతమంది కామరూపాన్ని పొందే శక్తులు కలిగిఉన్నారు. ఎట్టి పరిస్థితులలోను మీరు మాత్రం కామ రూపాన్ని తీసుకోకండి. ఏడుగురము మాత్రమే నర రూపంలో ఉండి యుద్ధం చేస్తాము. విభీషణుడు, ఆయన నలుగురు మంత్రులు నర రూపంలో ఉంటారు, నేను, లక్ష్మణుడు ఉంటాము. మిగిలినవారందరూ వానర రూపంలోనే ఉండండి" అని చెప్పాడు. 

ఆరోజు జరిగిన యుద్ధంలో వానరములు విశేషమైన బలాధిక్యతను ప్రదర్శించి అద్భుతమైన యుద్ధాన్ని చేశారు. ఆ సమయంలో రాక్షసులు విచిత్రమైన ఆయుధాలు, శూలాలు, త్రిశూలాలు, కత్తులు, బరిసెలు వంటి ఆయుధములను పట్టుకొచ్చి కనపడ్డ వానరాన్ని కొట్టి చంపి తినేస్తున్నారు. ఆ వానరములలో ఉన్న భల్లూకములు కనపడ్డ రాక్షసుడిని గట్టిగా కౌగలించుకుని మరీ తింటున్నాయి. ఆ యుద్ధ సమయంలో ఎక్కడ చూసినా పట్టుకో, తన్ను, గుద్దు, నరుకు అనే కేకలే వినపడుతున్నాయి. ఆ రాత్రంతా మహా భయంకరమైన యుద్ధం జరిగింది. శిరస్సులు బంతులు ఎగిరినట్టు ఆకాశంలోకి ఎగిరాయి. ఎక్కడ చూసినా చీలిపోయిన వక్షస్థలాలు, తెగిపోయిన పాదములు, చేతులు ఉన్నాయి. ఆ ప్రాంతమంతా నెత్తుటితో బురదయ్యి యుద్ధం చేస్తుంటే పాదములు జారిపోతున్నాయి. 

ఏనుగుల తొండాలు, పాదములు, గుర్రాల పాదములు మొదలైన జంతువుల శరీర భాగాలు ఆ యుద్ధ భూమిలో పడి ఉన్నాయి. అటువంటి సమయంలో ఇంద్రజిత్ యుద్ధానికి వచ్చాడు. రథంలో వస్తున్న ఇంద్రజిత్ ని చూడగానే అంగదుడికి అపారమైన ఉత్సాహం వచ్చింది. అప్పుడాయన ఒక పెద్ద పర్వత శిఖరాన్ని పట్టుకొచ్చి ఇంద్రజిత్ రథం మీదకు విసిరేశాడు. ఆ దెబ్బకి ఇంద్రజిత్ రథం బోల్తా పడిపోయింది. ఎప్పుడైతే ఎవ్వరూ ఊహించని విధంగా అంగదుడు ఆ ఇంద్రజిత్  రథాన్ని, గుర్రాలని, ఛత్రాన్ని విరిగిపోయేటట్టు కొట్టాడో, ఆ సంఘటనని చూసి దేవతలు, రామ లక్ష్మణులు కూడా ఆశ్చర్యపోయారు. ఇంద్రజిత్ జీవితంలో అప్పటిదాకా ఆయన రథాన్ని కొట్టినవాడు లేడు. అందుకే అందరూ అంత ఆశ్చర్యపోయారు.

                                      ◆నిశ్శబ్ద.


More Purana Patralu - Mythological Stories