కృష్ణుడుని అర్జునుడు అడిగిన ప్రశ్నలు ఏమిటి?


భగవద్గీతలో కృష్ణుడు ఏడవ అధ్యాయంగా జ్ఞాన విజ్ఞాన యోగం చెబుతాడు. ఈ యోగంలో ఎన్నో శ్లోకాలు చెబుతూ ఎన్నో విషయాలు వివరంగా అర్జునుడితో చెబుతాడు. అయితే కృష్ణుడు కొన్ని శ్లోకాలలో వాడిన కొన్ని పదాలు అర్థం కాక అర్జునుడు అయోమయం అవుతాడు. అంతేకాకుండా కొన్ని విషయాలు అర్జునుడిని చాలా గందరగోళంలో పడేస్తాయి. వాటన్నిటినీ మనసులోనే దాచుకోలేక అర్జునుడు కృష్ణుడితో ఇలా అడుగుతాడు. 

1.బ్రహ్మ ఎవరు
 2. అధ్యాత్మం ఎవరు? 
3. కర్మ అంటే ఏమిటి 
4. అధిభూతము అంటే ఏమిటి?
5. అధిదైవమ్ అంటే ఏమిటి? 
6. అధియజ్ఞము అంటే ఏమిటి?
7. వీటిని గురించి ఎలా తెలుసుకోవాలి? 
8. అంత్యకాలంలో నీ మీద మనసు నిలిపిన మానవులు చేత నీవు ఎలా తెలుసుకోబడతాడవు? 

అని గబగబా అడిగేసాడు అర్జునుడు. ఈ ప్రశ్నలకు ఒకటి ఒకటిగా సమాధానాలు చెప్పాడు పరమాత్మ.

గురువు అయిన కృష్ణుడు చెప్పిన మాటలు అర్థంకాక అర్జునుడు వాటి గురించి వివరాల కోసం ఇలా అడిగాడు.

కృష్ణా! కాస్త ఆగవయ్యా! నీ పాటికి నీవు చెప్పుకుంటూ పోతుంటే నాకు అర్థం కావాలి కదా! ఇప్పుడు ఏవేవో నాకు అర్థం కాని మాటలు చెప్పావు. వాటి అర్థం ఏమిటో కాస్త వివరించు. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాను అని అన్నాడు అర్జుడు.

అప్పుడు కృష్ణుడు అర్జునుడితో నీకు అర్థం కానివి ఏంటి?? వాటిని గురించి వివరంగా అడుగు అని అన్నాడు.

(ఇక్కడ ఒక విషయం గమనించవచ్చు. కృష్ణుడు ఎన్నో శ్లోకాలు చెప్పినా వాటిలో అర్జునుడికి అర్థం కాకపోయినా, అర్జునుడు తనకు అర్థం కాని వాటిని కృష్ణుడితో అడిగినా, కృష్ణుడు మళ్లీ అర్జునుడితో నీకు అర్థం కాని విషయాలు వివరంగా అడుగు అంటున్నాడు. అర్జునుడు గొప్పవాడు. ఆయన మరీ నిరక్షరాస్యుడు కాదు. ఆయనకు నాకు ఇది అర్థం కాలేదు అని షార్ట్ గా అడిగాడు. కానీ సాధారణ మనుషులు కృష్ణుడు చెప్పే తత్వాన్ని అంత సులభంగా అర్థం చేసుకోలేరు.  మనకు అంత తేలికగా ఏవీ అర్థం కావు. అందుకే వివరంగా అడుగు అర్జునా అని అన్నాడు కృష్ణుడు. అంటే కృష్ణుడి ఉద్దేశ్యంలో ఈ విషయాలు కేవలం అర్జుడికి మాత్రమే భోధించేవి కాదని మొత్తం అందరూ తెలుసుకోవాల్సినవని అర్థం)

అప్పుడు అర్జునుడు ఇలా అడిగాడు.

"కిం తద్రహ్మ” అంటే ఆ బ్రహ్మ ఎవరు?

"అధ్యాత్మం కిం" అంటే అధ్యాత్మ అంటే ఏమిటి? నేను ఈపదం ఎప్పుడూ వినలేదు. “కిం కర్మ” అంటే కర్మ అంటే ఏమిటి? సాధారణ కర్మ అంటే ఏమిటో నాకు తెలుసు కానీ ఇప్పుడు ఈ సందర్భంలో నీవు ఆ పదం ఎందుకు వాడావో నాకు తెలిసేటట్టు చెప్పు. "అధిభూతం చ కిం ప్రోక్తం" అంటే అధిభూతం అని మీరు దేనిని అంటున్నారు. అదేమిటో వివరంగా చెప్పు.

ఇంకా "అధిదైవం కి ముచ్యతే" అంటే ఏది అధిదైవం అని చెప్పబడుతూ ఉంది. "అధియజ్ఞః కథం కోత్ర దేహేస్మిన్" అంటే ఈ అధియజ్ఞుడు ఎవరు? ఈ దేహంలో ఆ అధియజ్ఞుడు అనే వాడు ఎక్కడ ఉంటాడు? ఈ అధియజ్ఞుని గురించి ఎలా తెలుసుకోవాలి?

 "ప్రయాణకాలే చ కథం జ్ఞేయోని” అంటే ఇంతకు ముందు శ్లోకంలో మానవుని అంత్యకాలంలో పరమాత్మను గురించి స్మరణ చేయాలి అన్నావు. అది ఎలాగ? అసలేవాడు చస్తుంటే, చుట్టు భార్యా పిల్లలు, బంధువులుచేరి ఏడుస్తుంటే, గొంతులోనుండి గుర గుర శబ్దం వస్తుంటే, మాటకూడా సరిగా రాకపోతే, అటువంటి వాడు పరమాత్మ గురించి ఎలా తెలుసుకోగలడు. అప్పుడు వాడి మనసు నీ యందు ఎలా నియమించబడుతుంది. మనోనిగ్రహం కలవారు మరణ సమయంలో పరమాత్మ గురించి ఎలా తెలుసుకోగలరు?

కృష్ణా! ఈ ప్రశ్నలకన్నిటికీ, ఏ ఒక్కటీ మిగల్చకుండా సమాధానం చెప్పు అని అడిగాడు. అర్జునుడు. ఇవీ అర్జునుడి ప్రశ్నలు.

  ◆వెంకటేష్ పువ్వాడ.


More Aacharalu