విరిగిపోయిన దేవుని విగ్రహాలు ఇంట్లో పెట్టుకోవచ్చా!


భగవంతుడిని చేరుకోవడానికి భారతీయ సనాతన ధర్మం చాలా మార్గాలు పేర్కొంది. వాటిలో భక్తి మార్గం ప్రధానమైనది. ఈ భక్తి మార్గంలో కూడా విగ్రహారాధన, పూజలు,  వ్రతాలు చాలా ముఖ్యమైనవి.  ప్రతిహిందువు ఇంట్లో దేవతల విగ్రహాలు,  చిత్ర పటాలు ఖచ్చితంగా ఉంటాయి.  అయితే ఏదో ఒక సందర్భంలో, ఎప్పుడో ఒకప్పుడు విగ్రహాలు విరిగిపోవడం జరుగుతూ ఉంటాయి. అలా విరిగిపోయిన విగ్రహాలను  ఇంట్లో ఉంచుకోవచ్చా అనే విషయంలో చాలా మంది చాలా రకాలుగా చెబుతుంటారు. దీని గురించి పండితుల మాట ఏంటో తెలుసుకుంటే..

దేవుడి విగ్రహాలు ఇంట్లో పూజలు అందుకుంటూ ఉంటాయి. నమ్మకాల ప్రకారం పెద్దల కాలంలో  ఎప్పుడైనా ఏ దేవతా విగ్రహం అయినా విరిగిపోతే ఆ విగ్రహాన్ని గంగలో కలిపేవారు లేదా వదిలిపెట్టే వారు.  ఇలా గంగలో వేయడం సరైనదేనా అని చాలా మంది సందేహపడుతుంటారు.

 కొందరు పండితుల ప్రకారం ఇంట్లో దేవుడి విగ్రహాలు భగవంతుడికి మూల రూపాలు.  సాధారణంగా ఇంట్లో పసిపిల్లలను భగవంతుడి స్వరూపంగా భావిస్తుంటారు. అలాంటప్పుడు ఆ భగవంతుడు కూడా పసిబిడ్డ లాంటి వాడే.. ఆయన్ను లాలించాలి,  పూజించాలి,  వేడుకోవాలి,  బుజ్జగించాలి.. ఇంతటి అనుబంధం కలిగి ఉండాల్సిన భగవంతుడి విగ్రహాలు విరిగిపోతే నదిలో వదిలిపెట్టడం సరికాదని అంటున్నారు.  బిడ్డలకు కాలు లేదా చెయ్యి విరిగితే తల్లి ఆ బిడ్డలను వదిలిపెట్టదు కదా.. అలాంటప్పుడు భగవంతుడిని ఎందుకు వదిలిపెట్టాలి అని అంటున్నారు.

భగవంతుడి విగ్రహాలు విరిగిపోతే..విరిగిన ప్రాంతంలో పసుపును లేపనంగా చేసి రాయాలని అంటున్నారు. ఇది కూడా భగవంతుడికి సేవతో సమానం అని అంటున్నారు. ఇలా చేయడం వల్ల భగవంతుడికి భక్తుడిపై అనుగ్రహం కలుగుతుందని అంటున్నారు.

విరిగిన విగ్రహాలను గంగలో నిమజ్జనం చేయడం వల్ల ఎలాంటి ఫలితం ఉండదట.  ముఖ్యంగా ఎలాంటి పుణ్యం చేకూరదట. అదే  విగిరిన విగ్రహాన్ని మునుపటిలా భక్తితో పూజిస్తూ ఉంటే.. అది భక్తులను భగవంతుడిని ఆరాధించేందుకు మరింత ఉన్నతమైన దశలోకి తీసుకెళ్తుందని అంటున్నారు.


భగవంతుడి ఆరాధన మానడానికి విరిగిన విగ్రహాలు, చెరిగిన చిత్రపటాలు సాకుగా ఉండకూడదని పండితులు అంటున్నారు.  భగవంతుడిని నిర్మలమైన భక్తితో పూజిస్తే ఆయన కరుణ ఎప్పుడూ అందరిపై నిలిచి ఉంటుందని చెబుతున్నారు.  

                                 *రూపశ్రీ.


More Aacharalu