ఇలాంటి రోజు చాలా అరుదు.. శనిదోషం ఉన్నవారు ఇవి తప్పక చేయాలి..!

ప్రతి వ్యక్తి జీవితంలో ఏదో ఒక దశలో శని దోషం అనే మాట తరచుగా వింటూనే ఉంటారు. హిందూ జ్యోతిష్యం ప్రకారం గ్రహాల ప్రభావం మనిషి మీద చాలా ఉంటుంది. అయితే అన్ని గ్రహాలలోకి శని గ్రహం ప్రబావం మనిషి మీద అధికంగా ఉంటుంది. ఇది వ్యక్తి కర్మ ఫలాలను అనుభవించేలా చేసే దశ. చాలామంది శని దశలు అయిన ఏలినాటి శని, శని అంతర్దశ, శని మహాదశ వంటి వాటిలో ఉన్నప్పుడు చాలా కష్టాలు, ఇబ్బందులు, బాధలు ఎదుర్కుంటూ ఉంటారు. అలాంటి వారు శనివారం, శని త్రయోదశి వంటి తిథులలో ప్రత్యేక పరిహారాలు చేస్తుంటారు. అయితే డిసెంబర్ 27వ తేదీ ఉత్తరాభాద్ర నక్షత్రం వచ్చింది. పైగా శనివారం రోజు ఈ నక్షత్రం రావడంతో ఈ రోజుకు ప్రాముఖ్యత కూడా పెరిగింది. డిసెంబర్ 27వ తేదీ శనివారం రోజు కొన్ని పనులు చేయడం వల్ల శని దేవుడి అనుగ్రహం కలిగి శని దోషాలు తగ్గుతాయని, జీవితంలో ఎన్నో అడ్డంకులు తొలగిపోతాయని అంటున్నారు. ఇంతకీ ఈరోజు చేయాల్సిన పనులేంటో తెలుసుకుంటే..
ఉత్తరాభాద్ర నక్షత్రం..
ఉత్తరాభాద్ర నక్షత్రాన్ని శనిదేవుడితో ముడిపడిన నక్షత్రంగా చెబుతారు. డిసెంబర్ 27వ తేదీ ఉదయం 9గంటల నుండి ఉత్తరాభాద్ర నక్షత్రం వస్తుంది. ఈ రోజున చేసే పరిహారాలు శని దోషం ఉన్న వ్యక్తులకు చాలా గొప్ప ఫలితాన్ని ఇస్తాయని పురాణ పండితులు, జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
పరిహారాలు..
ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడేవారు శనివారం రోజు సాయంత్రం దేవాలయానికి వెళ్లి ఒక రూపాయి నాణెం మీద ఒక చుక్క ఆవనూనె వేసి ఆ నాణేన్ని శనిదేవుడి ముందు ఉంచి, స్వామికి సమర్పించాలి. ఆర్థిక సమస్యలు గట్టెక్కించమని, ఆర్థిక ఎదుగుదలకు సహాయపడమని స్వామిని వేడుకోవాలి. ఇలా చేయడం వల్ల శనిదేవుడి ఆశీర్వాదం లభించి ఆర్థిక సమస్యల నుండి విముక్తి లభిస్తుందని అంటున్నారు.
ప్రత్యర్థులు లేదా శత్రువులు ఇబ్బంది కలిగిస్తుంటే శనివారం నాడు బొగ్గుతో వారి పేరును ఒక రాయిపై రాసి, ప్రవహించే నీటిలో వేయాలట. అలా చేయడం వల్ల ప్రతికూల ప్రభావాలు తగ్గుతాయని, జీవితానికి శాంతి కలుగుతుందని చెబుతున్నారు. అలాగే - శనివారం నాడు 11 సార్లు శని మంత్రాన్ని జపించడం వల్ల పిల్లల ఉన్నత విద్య లేదా విదేశీ ప్రయాణాలకు అడ్డంకులు తొలగిపోతాయట. క్రమం తప్పకుండా అంకితభావంతో జపించడం అడ్డంకులను తగ్గిస్తుందట.
కొత్త వ్యాపారం ప్రారంభించడంలో ఉన్న ఇబ్బందులను అధిగమించడానికి, శనివారం స్నానం చేసిన తర్వాత వేపచెట్టును పూజించాలి. ఇది వ్యాపారంలో స్థిరత్వాన్ని, విజయాన్ని తెస్తుందని నమ్ముతారు. ఏ పనులు తలపెట్టినా విజయం చేకూరాలంటే తప్పకుండా శనివారం వేప చెట్టును సందర్శించి, చెట్టుకు నీరు పోయాలి.
పూర్వీకుల ఆస్తి లేదా స్థిరాస్తికి సంబంధించిన సమస్యల పరిష్కారం కోసం శనివారం పిండి దీపం తయారు చేసి, ఆవ నూనెతో నింపి, శని దేవుని ముందు వెలిగించాలి. ఈ పరిహారం వివాదాలను పరిష్కరించడంలో సహాయకరంగా పరిగణించబడుతుంది. అలాగే ఉన్నతాధికారులతో సంబంధం దెబ్బతింటుంటే, శనివారం ఒక ఇనుప వస్తువును కొని ఇంటికి తీసుకురావాలి. ఇంట్లో పశ్చిమ దిశలో దాన్ని సురక్షితంగా ఉంచండి. ఇది సంబంధాలలో సామరస్యాన్ని తెస్తుంది.
కోర్టు కేసుల్లో న్యాయం లబించాలంటే శనివారం నల్ల నువ్వులను వేప చెట్టు మూలంలో పాతిపెట్టాలి. ఈ పరిహారం దీర్ఘకాలిక కేసులలో సానుకూల ఫలితాలను ఇస్తుందని నమ్ముతారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పెండింగ్‌లో ఉన్న విషయాలను పరిష్కరించడానికి శనివారం శని స్తోత్రాన్ని పఠించాలని చెబుతున్నారు. పారాయణం చేసేటప్పుడు పశ్చిమం వైపు ముఖం ఉండేట్టుగా కూర్చుని పారాయణ చేయాలి. ఇది పనిని వేగవంతం చేస్తుంది.
వైవాహిక సమస్యలను తగ్గించడానికి శనివారం నాడు కాటుకను ఎవ్వరూ తిరగని ప్రదేశంలో మట్టిలో పాతిపెట్టడం చాలా మంచిది. ఎంతో ఇబ్బందులు పడి చేసిన పనుల వల్ల ఫలితాలను లేకుంటే శనివారం నాడు నల్లని నువ్వులను ప్రవహించే నీటిలో వేసి శని దేవుడిని ప్రార్థించాలి. ఇది కష్టానికి సరైన ఫలితాలను ఇస్తుందని, జీవిత కష్టాలను తగ్గిస్తుందని నమ్ముతారు.
*రూపశ్రీ.


