మూఢులు ఎవరు?

మూఢులు అంటే తెలిసీ తెలియని వారు. వారికి తెలియదు., ఒకరు చెబితే వినరు. తమ మూర్ఖత్వమే తమది. ఒక అధ్యక్షుడు ఉంటాడు. అక్కడ కొందరుంటారు వాళ్లలో కొంత మంది మూఢులు “ఈయన నాకు తెలుసులేరా.... ఈయన అధ్యక్షుడు ఏంటి..... మనలాంటి వాడే..... వాడి కన్నా నాకే ఎక్కువ తెలుసు..... అసలు వీడికేం తెలుసని అధ్యక్ష స్థానంలో కూర్చోపెట్టారు" అని విమర్శిస్తుంటారు. (ఉదా: శిశుపాలుడు) అలాగే పరమాత్మ ఈ అనంత విశ్వానికి అధ్యక్షుడు. ఆయన కూడా ధర్మరక్షణ కొరకు మానవునిగా అవతరిస్తుంటాడు. అటువంటి అవతారమే కృష్ణావతారము. కాని కొంత మంది మూఢులు రాముని కృష్ణుని మానవులుగానే పరిగణిస్తారు. సామాన్యుడిగా అనుకుంటారు. ఆ అవతారంలో ఆచరించిన పనులను హేళన చేస్తుంటారు. ఇంత మంది భార్యలు ఉన్న వాడిని అస్ఖలిత బ్రహ్మచారి అని ఎలా అంటారు అని సందేహాలు. “అమ్మో గోపికలతో రాసలీలలు, వాళ్ల బట్టలు ఎత్తుకుపోవడం, వెన్నలు దొంగిలించడం. పైగా భగవద్గీత చెప్పాడంట.” అని అంటుంటారు. ఇవన్నీ వారి మూఢత్వానికి చిహ్నాలు.


కృష్ణుడిలో ఉన్న ఒక్క లక్షణం సహనం. శిశుపాలుడు ఎన్ని తిట్టినా ఒక్క మాట కూడా అనలేదు. కాని మనం ఎవడైనా ఒక రాజకీయ నాయకుడి అవినీతి గురించి ప్రస్తావిస్తే నేను అవినీతి పరుడిని కాను అని నిరూపించుకోక పోగా, "నేను ఒక్కడినేనా దొరికింది. వాడు అంత తిన్నాడు వీడు అంత తిన్నాడు నేను తింటే తప్పా అంటూ ఎదురు దాడికి దిగుతాడు. కాని కృష్ణుడు అటువంటి పని చేయలేదు. ఓర్పుతో అన్నీ సహించాడు. సత్రాజిత్తు శ్యమంతక మణి గురించి అపవాదు వేసినా ఆ అపవాదు పోగొట్టుకోడానికి ప్రయత్నం చేసాడే తప్ప ఎదురు దాడికి దిగలేదు. తనను స్తుతించినప్పుడు పొంగి పోలేదు. నిందించినపుడు కుంగిపోలేదు. అంతే కాకుండా, యుద్ధసమయంలో, ఇంక కొద్దిసేపట్లో యుద్ధం మొదలు కాబోతోంది అనే సమయంలో, అర్జునుడికి గీతాబోధ చేసిన తత్వవేత్త కృష్ణుడు. ఇది ఒక సాధారణమానవుడు చేయలేని పని. అదీ కృష్ణతత్వము. అదీ పరమాత్మ లక్షణం.


అలాగే రాముడు కూడా. ముందురోజు తెల్లవారి నీకు యువరాజ్య పట్టాభిషేకం అని ప్రకటించిన దశరథుడు, తెల్లవారగానే అడవులకు పొమ్మన్నాడు. ఈ ద్వంద్వాలను చిరునవ్వుతో స్వీకరించాడు రాముడు. కట్టుకున్న భార్యను ఎవరో అపహరించారు అని తెలిసినా కుంగి పోలేదు రాముడు. తాత్కాలికంగా దుఃఖపడినా, భార్యకొరకు తన ప్రయత్నం తాను చేసాడు. ఇవి ఒక మానవుడికి రాకూడని కష్టాలు. కాని వాటిని చిరునవ్వుతో భరించాడు రాముడు. ప్రజాభిప్రాయానికి తలవంచి కట్టుకున్న భార్యను కూడా వదిలేసాడు రాముడు. అదీ రాముని వ్యక్తిత్వం. రాముడు, కృష్ణుడు మానవ రూపాలలో ఉన్న దేవతామూర్తులు. వారి మాదిరి లక్షణం అలవరచుకోవాలే గానీ, రాముని కృష్ణుని సామాన్యమానవులు వాళ్లు ఏం చేసారు అని విమర్శించడం మూఢుల లక్షణం.


ఇంకా కొంత మంది మూఢులు ఉన్నారు. వారు రాముడు, కృష్ణుడే దేవుళ్లు అనుకుంటారు. మరి కొంత మంది శివుడు ఒక్కడే దేవుడు అంటాడు. వారందరూ పరమాత్మ స్వరూపాలే, ఆ పరమాత్మ ఇన్ని రూపాలుగా తనను తాను ప్రకటించుకుంటున్నాడు అని తెలుసుకోలేరు. పైగా వారి మధ్య భేదభావం పెంచుకుంటారు. అందుకే "మమ భూతమహేశ్వరమ్ అజానన్త:" అని అన్నాడు వ్యాసుడు. ఈ సకల చరాచర భూతకోటికి మహేశ్వరుడు పరమాత్మ అని తెలుసుకోలేరు. వీరు కూడా మూఢులే. అంతతో ఆగకుండా అవమానిస్తుంటారు. ఈయన కూడా మనలాంటి మానవుడే అనే చులకన భావంతో ఉంటారు. వీరంతా మూఢులు అని నిర్ద్వందంగా చెప్పాడు వ్యాసుడు.

◆వెంకటేష్ పువ్వాడ.


More Aacharalu