పితృపక్షాలలో ఈ వస్తువులు కొంటే పితృదోషం వస్తుందట.!

ప్రస్తుతం పితృపక్షాలు సాగుతున్నాయి. భాద్రపద పౌర్ణమి నుండి అమావాస్య వరకు గల కాలాన్ని పక్షాలు అంటారు. ఈ పక్షాలలో కేవలం పితృకార్యాలకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చారు. ఈ పక్షాలలో ఏ శుభకార్యాలు చేయరు.. అలాగే ఎలాంటి వ్రతాలు, కొత్త పనులు మొదలుపెట్టకూడదు అనే నిబంధన ఉంది. అయితే ఇవన్నీ చేయకపోవడం మాత్రమే కాకుండా.. ఈ పక్షాల కాలంలో కొన్ని వస్తువులు కొనకూడదు అనే నిబంధన కూడా ఉంది. ఒకవేళ ఆ వస్తువులు కొంటే.. దాని వల్ల పితృదోషం తగులుతుందని పండితులు చెబుతున్నారు. ఇంతకీ ఈ పక్షాలలో కొనకూడని వస్తువులు ఏమిటి? ఎందువల్ల? తెలుసుకుంటే..
పితృదోషం అంటే ఏంటి?
జ్యోతిషశాస్త్రం ప్రకారం,పూర్వీకుల ఆత్మలు సంతోషంగా లేనప్పుడు అది వారి వారసుల జీవితాల్లో ఇబ్బందులను, అడ్డంకులను కలిగిస్తుంది. ఈ పరిస్థితిని పితృ దోషం అంటారు. పితృ పక్ష సమయంలో పూర్వీకులు భూమిపైకి వచ్చి వారి కుటుంబాలను ఆశీర్వదిస్తారని నమ్ముతారు. ఈ సమయంలో వారు తమ మధ్య ఉంటారని భావించి గౌరవించి, భక్తితో ఉండాలి. ఒకవేళ అలా జరగని పక్షంలో.. మరణించిన పెద్దవారి ఆత్మలు బాధపడతాయి. అలాగే కోపంగా మారతాయి. అందుకే ఈ పక్షాల కాలంలో చేసే పనులు చాలా ముఖ్యం.
పితృపక్ష సమయంలో కొన్ని పనులు అస్సలు చేయకూడదు..
పితృ పక్ష సమయంలో కొత్త బట్టలు, బూట్లు లేదా చెప్పులు కొనడం అశుభంగా భావిస్తారు. అలాగే వివాహాలు, నిశ్చితార్థాలు లేదా ఇతర శుభ కార్యక్రమాలు నిర్వహించడం నిషేధించబడింది.
పక్షాల కాలంలో మాంసం, చేపలు, గుడ్డు, ఉల్లిపాయలు, వెల్లుల్లి వంటి తామసిక ఆహారాన్ని తీసుకోకూడదు. ఈ సమయంలో బంగారం, వెండి కొనడం కూడా అశుభకరమని భావిస్తారు.
వీలైనంత ఎక్కువగా సంప్రదాయాలను, పద్దతులను పాటించడం, బ్రహ్మచర్యాన్ని పాటించడం చేయాలి. అలాగే ఇతరుల పట్ల అగౌరవంగా ప్రవర్తించకూడదు. పెద్దలను గౌరవించాలి. పితృదేవతలకు సంబంధించిన మంత్రాలు, ధ్యానం వంటివి చేయాలి.
*రూపశ్రీ.



