ధనవంతులను చేసే ధన ఆకర్షణ మార్గాలు.. !

డబ్బు నేటి ప్రపంచంలో తప్పనిసరిగా ఉండాలి. డబ్బు లేని జీవితం చాలా దుర్భరంగా ఉంటుంది. మెరుగైన జీవితం కావాలంటే డబ్బు కూడా మెరుగ్గా ఉండాలి. అందుకే చాలా మంది ధనవంతులు కావాలని అనుకుంటారు. కష్టపడి పనిచేస్తారు, ధనం ఆర్జిస్తారు, పొదుపు కూడా చేస్తారు. అయినా సరే ధనవంతులు కాలేకపోతారు. దీనికి జ్యోతిష్య శాస్త్రంలో పరిష్కారం చెబుతున్నారు జ్యోతిష్య పండితులు. జ్యోతిష్యం ప్రకారం ధనాన్ని ఆర్జించడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. ఆ మార్గాలు అనుసరిస్తే ధన ఆకర్షణ పెరిగి ధనవంతులు అవుతారని చెబుతున్నారు. ఇంతకీ ధన ఆకర్షణను పెంచే ఆ మార్గాలు ఏంటో తెలుసుకుంటే..
ధనం ఆకర్షించే మార్గాలు..
జ్యోతిష్యం ప్రకారం ధనాన్ని ఆకర్షించడానికి మెరుగైన మార్గం మంచి పనులు చేయడం. ఇలా చేయడం వల్ల ధన ఆకర్షణ పెరిగి ధనవంతులు అయ్యే యోగ్యం పెరుగుతుందట.
సహాయం..
కష్టాలలో, ఇబ్బందులలో ఉన్నవారికి, నిస్సహాయులకు సహాయం చేయడం వల్ల ధన ఆకర్షణ పెరుగుతుందట. సంపాదించే ధనంలో కొంత భాగాన్ని ఇలా అవసరైన వారికి సహాయం చేయడం వల్ల సంపద పెరగడమే కాకుండా జీవితంలో సానుకూల మార్పులు కూడా వస్తాయట.
పాకెట్ లో డబ్బు..
నేడు డిజిటల్ పేమెంట్స్ వచ్చేశాక చాలామంది దగ్గర డబ్బు కరువైంది. ఎప్పుడు ఎలా డబ్బు వస్తోందో.. ఎలా పోతోందో కూడా అర్థం కానట్టు తయారైంది. అయితే వీలైనంత వరకు పాకెట్ లో లేదా పర్సులో డబ్బు ఉంచుకోవడం వల్ల ధన ఆకర్షణ పెరుగుతుందట.
బియ్యం లో..
చాలామంది మహిళలు బియ్యం బస్తా లేదా డబ్బాలలో డబ్బులు ఉంచుతుంటారు. పాత కాలంలో పెద్ద వాళ్లు ఇలా చేసేవారు. అయితే ఇలా చేయడం వల్ల సంపద శక్తి పెరుగుతుందట.
దేవుడి దగ్గర..
ఇంట్లో దేవుడి గది తప్పక ఉంటుంది. అయితే దేవుడి దగ్గర కొంత డబ్బు ఉంచడం లేదా దేవుడి దగ్గర ఒక హుండీ లాంటిది ఉంచి అందులో డబ్బు వేస్తూ ఉండటం చేయాలి. ఇది కూడా ధనాన్ని ఆకర్షిస్తుంది.
మట్టి హుండీ..
జ్యోతిష్యుల అభిప్రాయం ప్రకారం నైఋతి దిశలో మట్టి హుండీ ఉంచి అందులో అప్పుడప్పుడు నాణేలు వేస్తుండాలి. ఇది సంపదను ఆకర్షిస్తుందట. అలాగే ఆర్థిక బలాన్ని కూడా పెంచుతుందట.
అర్ఘ్యం..
ప్రతిరోజూ ఉదయం స్నానం చేసిన తర్వాత సూర్యుడికి అర్ఘ్యం సమర్పించాలి. దీని వల్ల కూడా ధన ఆకర్షమ పెరుగుతుందట.
గమనిక.. పైన పేర్కొన్న పరిహారాలు జ్యోతిష్య పండితులు పేర్కొన్న అంశాల ఆధారంగా రూపొందించబడినవి.
*రూపశ్రీ.


