వ్యాఘ్రపాద మహర్షి

 


హైందవ సంస్కృతిని సుసంపన్నం చేసిన మహామహ రుషులెందరో! తరచి చూసిన కొద్దీ వారిలో ఒకొక్కరికదీ ఒకో కథ. వాటిలో ఒకటి వ్యాఘ్రపాద మహర్షి గాథ...

 

వ్యాఘ్రపాదుడు ‘మధ్యందిన’ అనే మహర్షి కుమారుడు. శివభక్త తత్పరుడు. చిదంబరంలోని ఒక శివలింగాన్ని అర్చిస్తూ, శివుని గురించి తపస్సు చేసుకుంటూ కాలాన్ని గడిపేవాడు. అయితే కాలం గడుస్తున్న కొద్దీ వ్యాఘ్రపాదుని ఒక చింత తొలవసాగింది. శివుని అర్చన కోసం తాను సమీపంలోని తిల్లై అనే అడవి నుంచి రకరకాల పుష్పాలను తెస్తున్నాడు సరే! కానీ ఆ పూలను తాను కోయకముందే, శివునికి అర్పించకముందే... తేనెటీగలు వాటిని ఆఘ్రాణిస్తున్నాయి కదా! వాటిలోని సారాన్ని పీల్చేసుకుంటున్నాయి కదా! అలా నిస్సారమైన పుష్పాలను తాను స్వామివారికి అర్పించడం ఏమిటన్న ఆలోచన వ్యాఘ్రపాదుని మనసుని తొలవసాగింది.

 

తన సమస్యకు ఉపాయాన్ని తీర్చమంటూ ఆ పరమశివునే ప్రార్థించాడు వ్యాఘ్రపాదుడు. నిజానికి తన మూర్తి ముందు ప్రేమతో ఏ పుష్పాన్ని ఉంచినా, ఆఖరికి బిల్వపత్రంతో తనను అర్చించినా శివునికి అభ్యంతరం లేదు. కానీ స్వచ్ఛమైన పూలనే తన చెంత ఉంచాలనుకునే వ్యాఘ్రపాదుని కోరికను ఆయన తీర్చదలుచుకున్నాడు. అందుకని అతను మూలమూలలా ఉండే స్వచ్ఛమైన పూలను సేకరించేందుకు అనువుగా పులి (వ్యాఘ్రము) పాదాలను అనుగ్రహించాడు. అందుకనే ఆయనకు వ్యాఘ్రపాదుడు అన్న పేరు స్థిరపడిపోయింది. అమలినమైన పూలు ఎంతటి ఎత్తులో ఉన్నా, ఏ పొదలా దాగున్నా... కాళ్లకు ముళ్లు గుచ్చుకోకుండా నేర్పుగా వాటిని కోసేందుకు వ్యాఘ్రపాదాలు ఉపయోగపడసాగాయి.

 

 

ఇదే చిదంబరంలో శివుడు తాండవాన్ని ప్రదర్శించాడని పురాణాలు చెబుతున్నాయి. ఆ అద్భుత ఘట్టానికి వ్యాఘ్రపాదుడు కూడా ఒక సాక్షిగా నిలిచాడట. అందుకే ప్రాచీన చిత్రాలలో పతంజలి రుషితో కలిసి నటరాజ స్వామిని కొలుస్తున్న వ్యాఘ్రపాదుని రూపం కనిపిస్తుంది. వ్యాఘ్రపాదునికి సంబంధించి ఇంతకంటే ప్రముఖమైన కథలు లేకపోయినప్పటికీ, ధార్మిక సాహిత్యంలో ఆయన పేరు అడపాదడపా కనిపిస్తూనే ఉంటుంది. ‘వ్యాఘ్రపాద స్మృతి’ పేరుతో అనేక వైదిక కర్మల గురించిన సంకలనం కూడా ప్రచారంలో ఉంది. వ్యాఘ్రపాదునికి ఇద్దరు కుమారులు- దౌమ్యుడు, ఉపమన్యుడు. ఇద్దరూ పరమశివభక్తులే! అసాధారణ దక్షత కలిగినవారే! అందుకే దౌమ్యుడు తరువాతకాలంలో పాండవులకు కులగురువుగా నిలిచాడు. ఉపమన్యుడేమో, సంతానాన్ని అనుగ్రహించగల ఓ వ్రతాన్ని... సాక్షాత్తూ ఆ శ్రీకృష్ణునికే ఉపదేశించాడు.

 

-నిర్జర.


More Purana Patralu - Mythological Stories