సుందోపసుందుల కథ

 

అప్పటివరకూ సఖ్యంగా ఉన్న మిత్రులు కానీ, అన్నదమ్ములు కానీ కొట్లాటకు దిగితే... వారిని ‘సుందోపసుందుల్లాగా కొట్టుకుంటున్నారు’ అని పెద్దలు అనడం వింటూనే ఉంటాము. ఈ సుందోపసుందుల ఉపమానం వెనుక ఉన్న కథ మాత్రం సరదాగానే ఉంటుంది. ఆ సరదా వెనుక ఒక ధర్మసూక్ష్మమూ ఉంది.

పూర్వం హిరణ్యకశిపుని వంశాన నికుంభుడు అనే రాక్షసరాజు ఉండేవాడు. అతనికి సుందుడు, ఉపసుందుడు అని ఇద్దరు కొడుకులు. వీరిరువురూ ఎంత అన్యోన్యంగా ఉండేవారంటే... లోకం వారిద్దరినీ కలిపి ‘సుందోపసుందులు’ అని ఒకే పేరుతో వ్యవహరించేది. ఒకే కంచం, ఒకే మంచం అన్నట్లుగానే వీరి అన్యోన్యత సాగేది. అలాగే వీరిద్దరి మనసులో ఒకే కోరిక మొదలైంది. ఈ ప్రపంచాన్నంతా తమ గుప్పిట్లోకి తీసుకోవాలన్నదే ఆ కోరిక! అందుకోసం వారు వింధ్యాచలానికి వెళ్లి ఘోర తపస్సుని మొదలుపెట్టారు. వారి తపస్సును భగ్నం చేయడానికి ఇంద్రాది దేవతలు ఎన్నో ప్రయత్నాలు చేశారు. వరదలతో ముంచెత్తినా, రత్నాలను ఆశపెట్టినా, అప్సరసలు అలరించినా... సుందోపసుందుల తపస్సు ఆగలేదు. చివరికి వారి కోరికలను మన్నించేందుకు బ్రహ్మ ప్రత్యక్షం కాక తప్పలేదు.

 

బ్రహ్మను చూసిన సుందోపసుందులు ముకుళిత హస్తాలతో ఆయనను ప్రార్థించారు. ఏం వరం కావాలో కోరుకోమన్నాడు బ్రహ్మ! ‘మాకు ఏ రూపం కావాలంటే ఆ రూపంలోకి మారిపోవాలి. ఏ మాయ చేయాలంటే ఆ మాయను చేయగలగాలి. కానీ చావు మాత్రం అన్యుల చేతుల్లో ఉండకూడదు’ అని టకటకా వరాలను కోరుకున్నారు సుందోపసుందులు. వారి వరాలకి బ్రహ్మ తథాస్తు చెప్పడంతో సుందోపసుందుల తపస్సు ఆగింది కానీ, లోకులకు మాత్రం కష్టాలు మొదలయ్యాయి. అసలే రాక్షసులు, ఆపై గొప్ప వరాలను పొందారు... ఇక వారి ఆగడాలకి అడ్డూఅదుపూ లేకుండా పోయింది.

సుందోపసుందుల ధాటికి ముల్లోకాలు ఉక్కిరిబిక్కిరి అయ్యాయి. వారి అకృత్యాలకు దేవతలు, మానవులు, రుషులు, కింపురుషులు హడలిపోయారు. యజ్ఞయాగాలు స్తంభించిపోయాయి. జీవితాలు అస్తవ్యస్తమైనాయి. ఇక దిక్కుతోచని ముల్లోకాల వాసులంతా మళ్లీ బ్రహ్మ చెంతకు చేరారు. ‘అన్యులు (ఇతరులు) చేతుల్లో వారికి మరణం ఉండదని వరమిచ్చిన మాట నిజమే! అంటే వారిలో వారు కొట్టుకు చచ్చే అవకాశం ఉందనేగా’ అన్నాడు బ్రహ్మ చిరునవ్వుతో. మరి అంతటి అన్యోన్యంగా మెసిలే సోదరుల మధ్య ముసలం పుట్టించేదెలా! అందుకోసం ముల్లోకాలలోనూ ఉన్న అందమైన రూపాల నుంచి నువ్వు గింజలంతటి పరిమాణాలతో తిలోత్తమ అనే అప్సరసను సృష్టించాడు (తిల అంటే నువ్వులు).

 

బ్రహ్మ కళ్ల ఎదుట నిలిచిన తిలోత్తమ, ఆయన ఆజ్ఞ ఏమిటా అన్నట్లు వినయంగా నిల్చొంది. ఆమెకు సుందోపసుందుల గురించి చెప్పి, తన అందంతో వారిరువురి మధ్యా వైరాన్ని సృష్టించమన్నాడు బ్రహ్మదేవుడు. సరేనంటూ సుందోపసుందులు ఉండే ప్రాంతాన్ని చేరింది తిలోత్తమ. తమ కళ్ల ముందు తిలోత్తమ కనిపించగానే సుందోపసుందులకు మతులు పోయాయి. ఆమె నాదంటే నాదని ఆశపడ్డారు. ‘మీ ఇద్దరిలో ఎవరు బలవంతులో మీరే తేల్చుకోండి,’ అంటూ వారిని మరింతగా ఉసిగొల్పింది తిలోత్తమ. ఇంకేం! ముష్టిఘాతాలతో, గదాయుద్ధాలతో ఒకరి మీద ఒకరు కలియబడ్డారు సుందోపసుందులు. ఇద్దరూ సరిసమానులే. ఇద్దరూ అపరపరాక్రమవంతులే. ఇద్దరూ వరసంపన్నులే! అందుకని ఇద్దరికీ ఓటమే మిగిలింది. ఇద్దరికీ చావే దక్కింది.

మోహం అనే బలహీనత ఎంతటి అన్యోన్య బంధాన్నైనా దెబ్బతీస్తాయన్నది సుందోపసుందుల కథ చెబుతోంది. ఆ మోహానికి కారణం స్త్రీ కావచ్చు, ధనం కావచ్చు, అధికారం కావచ్చు. అందుకే ప్రపంచంలో ఎక్కువ శాతం నేరాలకు కారణం మోహమే! బహుశా అందుకేనేమో మోహానికి పర్యాయపదాలలో అజ్ఞానాన్ని కూడా చేర్చారు.

- నిర్జర.

 


More Purana Patralu - Mythological Stories