రుక్మిణీ కృష్ణుల కళ్యాణం వెనుక నడిచిన కథ ఇదే!

విదర్భ దేశాన్ని భీష్మకుడు అనే రాజు. పరిపాలిస్తుండేవారు. ఆయనకు రుక్మి, రుక్మధరుడు, రుక్మబాహుడు, రుక్మకేశుడు, రుక్మనేత్రుడు అనే ఐదుగురు కుమారులూ, రుక్మిణి అనే ఒక కూతురూ వున్నారు. వారందరికీ రుక్మిణి చెల్లెలు. ఆమె శ్రీమహాలక్ష్మి అంశతో పుట్టింది. మహా గుణవంతురాలనీ, సౌందర్యరాశి అనీ ప్రసిద్ధి పొందింది.

భీష్మకుని ఇంటికి ఎప్పుడూ అనేకమంది అతిథులు వస్తుండేవారు. వారు యాదవ శ్రేష్ఠుడైన శ్రీకృష్ణుని లీలలనూ గుణగణాలనూ కథలు కథలుగా చెబుతుండేవారు. అవన్నీ వినడంవల్ల రుక్మిణికి బాల్యంలోనే శ్రీకృష్ణుని మీద అభిమానం ఏర్పడింది. పెద్దయ్యేసరికి అది ప్రేమగా మారింది. మాధవుడికే తాను భార్య కావాలని రుక్మిణి గట్టిగా నిర్ణయించుకుంది.

రుక్మిణీదేవి అందచందాలను గురించీ, గుణగణాలను గురించి శ్రీకృష్ణుడు కూడా విన్నాడు. ఆమెనెలాగైనా వివాహం చేసుకోవాలని ఆయనా పట్టుదలగా వున్నాడు.

అయితే పెద్ద అన్నగారైన రుక్మి మాత్రం తన చెల్లెలు రుక్మిణిని చేది దేశపు రాజైన శిశుపాలుడికి యిచ్చి వివాహం చెయ్యాలని నిశ్చయించాడు. అన్నగారి నిర్ణయం రుక్మిణీదేవికి దుఃఖం కలిగించింది. వెంటనే తనకుఆప్తుడైన పురోహితుడు అగ్నిద్యోతనుడ్ని పిలిచి శ్రీకృష్ణుడికి తన ప్రేమను తెలియచెయ్యమని ప్రార్థించింది. ఆయనకు రకరకాల బహుమానాలూ, కానుకలూ ఇచ్చి ద్వారావతికి పంపింది.

ద్వారావతి చేరుకున్న అగ్నిద్యోతనుడు కృష్ణుడ్ని కలుసుకుని రుక్మిణి పక్షాన ఆమె చెప్పమన్నవన్నీ చెప్పాడు. మాధవదేవుని మీద రుక్మిణికి గల ప్రేమానురాగాలను పూసగుచ్చినట్లు నివేదించాడు. రుక్మిణి నిర్ణయాన్ని గురించి కూడా చెప్పాడు. 'కృష్ణా! నువ్వు అతిలోక సుందరుడవు. లీలామానుష స్వరూపుడవైన నిన్ను శ్రీదేవి తనకు తానై వరించింది. అదే నీ త్రిజగన్మోహనత్వానికి నిదర్శనం. అందుకే రుక్మిణి నీ చరణదాసి అయింది. అంతఃపురంలో వుండే తాను నిన్ను చేరుకునే ఉపాయం కూడా ఆ కన్యే చెప్పింది' అని రుక్మిణి పంపిన సందేశాన్ని అగ్నిద్యోతనుడు శ్రీకృష్ణుడికి అందచేశాడు.

'స్వామీ! నువ్వు వచ్చి శిశుపాల, జరాసంధులను ఓడించి నన్ను నీ దాన్నిగా చేసుకో. చతురంగ బలాలతో రా. అయితే నా బంధువులకు చేటు వాటిల్లకుండా వుండేందుకు ఒక ఉపాయం చెబుతాను. రేపు వివాహమనగా ముందురోజు వధువు స్వయంగా వెళ్ళి కులదేవత అయిన 'సర్వ మంగళ'ను కొలవటం మా ఆచారం. మా కులదేవతను సేవించేందుకు నన్ను మావాళ్ళు నగరం వెలుపలికి తీసుకువెడతారు. అక్కడికి నువ్వు వచ్చి నన్ను చేపట్టు మాధవా' అని నల్లనయ్యను వేడుకుంది రుక్మిణి.

కృష్ణుడికి పరిస్థితి అర్థమైంది. వెంటనే రథసారథి దారుకుడికి కబురంపాడు. బలరాముడ్నీ, మరి కొందరు యాదవ ప్రముఖుల్నీ తోడు తీసుకొని, శైబ్య, సుగ్రీవ, మేఘ పుష్ప, బలాహక అనే నాలుగు గుర్రాలున్న రథమెక్కి ఒకే ఒక రాత్రిలో విదర్భ రాజధాని కుండినపురం చేరుకున్నాడు.

అప్పటికే వరుడు శిశుపాలుడు రథగజహయాదులతో, చతురంగ బలాలతో, బంధుమిత్రులతో కుండినపురం చేరుకున్నాడు. జరాసంధ, దంతవక్త్ర, సాల్వ, విడూరథ, పౌండ్రకాదులు కూడా శిశుపాలుని పక్షాన తమతమ సేనలతో విడిదికి తరలి వెళ్ళారు. కుండిన నగరమంతా ఆ సమయంలో ఇసుకవేస్తే రాలకుండా వుంది.

రుక్మిణికి మనస్సు మనస్సులో లేదు. అంతవరకూ స్వామి నుంచి జవాబుగా తనకు ఏమీ చేరకపోవడంతో రుక్మిణి కలవరపడింది. 'యాదవచంద్రుడు ఏమనుకున్నాడో! సందేశం పట్టుకువెళ్ళిన అగ్నిద్యోతనుడు అసలు స్వామిని చేరాడో లేదో! మధ్యదారిలో మార్గాయాసానికి గురి కాలేదు కదా' అని పరిపరి విధాల కలత చెందింది.

అంతలోనే అగ్నిద్యోతనుడు వచ్చాడు. కుండిననగరానికి బలరామకృష్ణులు వచ్చారనీ, కృష్ణుడు ఆమెను రాక్షస వివాహం చేసుకుంటాడనీ చల్లని కబురు. చెప్పాడు. రుక్మిణి మనసు కుదుట పడింది. అగ్నిద్యోతనుడికి కృతజ్ఞతలు చెప్పుకుంది. సుముహూర్తం సమీపించింది. గౌరీదేవిని పూజించేందుకు రుక్మిణిని నగరం వెలుపలి సర్వమంగళ ఆలయానికి తీసుకువెళ్ళారు. అక్కడ ఆలయంలో వున్న ఆది దంపతులకు ఆమె పూజలు చేసింది. 'శ్రీహరిని భర్తగా పొందే అదృష్టం కలుగచేయి తల్లీ' అని గౌరిదేవికి మొక్కుకుంది.

శ్రీకృష్ణుడ్ని మనసులో నిలుపుకుని ఆలయంనుంచి బయటకు వచ్చింది. ద్వార సమీపంలో శ్రీకృష్ణుడి దివ్యరథం కనిపించింది. దాన్ని చూసి ఆమె ఆనందంతో, సిగ్గుతో తల వంచుకుని, మెల్లగా అటు అడుగులు వేసింది. శ్రీకృష్ణుడు రథం దిగివచ్చి తనకు నలువంకలా వున్న రాజులెవ్వరినీ లక్ష్యపెట్టకుండా ముందుకు వెళ్ళి రుక్మిణీదేవి చెయ్యి పట్టుకుని ఆమెను దగ్గరకు తీసుకున్నాడు. రథంలో ఎక్కించుకున్నాడు. విజయశంఖాన్ని పూరించి రథాన్ని ద్వారకానగరంవైపు పరుగు తీయించాడు.

జరాసంధుడు అది చూశాడు. అతనికి అమితమైన ఆగ్రహం కలిగింది. జరాసంధుడూ, అతని స్నేహితులూ సైన్యాలను తరలించుకుని యాదవవీరులను తరుముకుంటూ వెళ్ళారు. ఇరుపక్షాలకూ మధ్య ఘోర యుద్ధం జరిగింది. కృష్ణుడు శరవర్షం కురిపించాడు. జరాసంధుడి రథాలను కూల్చాడు. మత్తగజాలను సంహరించాడు. గుర్రాలను వధించాడు. సైనికులను హతమార్చాడు. అదంతా తెలిసిన రుక్మి తన చెల్లెలిని కృష్ణుడు అపహరించుకుపోవటం సహించలేక ఒక అక్షౌహిణి బలంతో యాదవుల మీదికి ఉరికాడు. అప్పుడు కృష్ణుడు రుక్మి కోదండాన్ని ఖండించాడు. రథాన్ని కూల్చాడు. అతడ్ని తీవ్రంగా గాయపరిచాడు. నిరాయుధుడై నేలపై నిలిచిన రుక్మికి సంభవించబోయే ఆపదను రుక్మిణి అర్థం చేసుకుంది. హడలిపోయింది. శ్రీకృష్ణుని పాదాల మీద పడి తన అన్నకు ప్రాణభిక్ష ప్రసాదించమని వేడుకుంది.

శ్రీకృష్ణుడు. రుక్మిణి ప్రార్థన మన్నించి రుక్మిని సంహరించకుండా వదిలేసాడు. అతడ్ని బంధించి అతని తలకట్టు సగం తీసి మీసాలు కొంతవరకు కోసి విడిచిపెట్టాడు. రుక్మి తనకు జరిగిన పరాభవానికి అమితంగా విచారపడి, శ్రీకృష్ణుని గెలిచిగానీ కుండిన నగరంలో ప్రవేశించనని ప్రతిజ్ఞ చేసి, అప్పటి నుంచి భోజకటంలో వుండిపోయాడు. ద్వారకలో రుక్మిణీకృష్ణుల వివాహం వైభవంగా జరిగింది. ఇలా రుక్మిణీ, కృష్ణుల కళ్యాణం జరిగింది.

                                     *నిశ్శబ్ద.


More Purana Patralu - Mythological Stories