కృత్తిక 2,3,4 పాదములు, రోహిణి, మృగశిర 1,2 పాదములు (ఈ, ఊ, ఏ, ఓ, వా, వీ, వూ, వే, వో)
ఆదాయం : 11, వ్యయం : 5 - రాజపూజ్యం : 1, అవమానం : 3
వీరికి ఈ సంవత్సర ప్రారంభమున మరియు కార్తిక మార్గశిరములయందు దశమశనియగుటచే ఉద్యోగ విఘ్నము, పాపకార్యాసక్తి, వ్యవసాయమందు నష్టము కలుగును. అయితే చైత్ర బహుళం నుండి మిగిలిన సమయమంతయు ఏకాదశిశని యగుటచే సర్వము అనుకూలించును. సకల కార్యములయందు లాభము, జయము, ప్రోత్సాహము కలుగును. ఆరోగ్యము, ద్రవ్యలాభము, భార్యాపుత్రాది స్వజనులలో మోదము కలుగును. గురువు వైశాఖ బహుళం వరకు జన్మరాశియందు, కార్తిక మార్గశిరములందు తృతీయమందు సంచరించుటచే ఆయా సమయములందు కొన్ని ఇబ్బందులు తాత్కాలికముగ కలిగిననూ, మిగిలిన సమయమంతా ద్వితీయ గురువు అగుటచే ధనసంపాదన, కీర్తిప్రతిష్ఠలు పొందుట జరుగును. వీరి మాటలను అందరూ గౌరవింతురు. శుభమూలక ధనవ్యయము, సంతోషము కలుగును. సంవత్సరారంభము నుండి, వైశాఖ బహుళం వరకు ఏకాదశ రాహువు, పంచమ కేతువు అగుటచే లాభము, జయము, ప్రోత్సాహము కలుగును. పిమ్మట సంవత్సరమంతయు దశమరాహువు, చతుర్థకేతువు అయినందున శుభాశుభ మిశ్రమముగనుండును. చిత్తచాంచల్యము, వాతరోగములు, ప్రయాణాదులయందు ఇబ్బందులు ఉండును. చైత్ర, వైశాఖ, ఆశ్వయుజములందు కుజానుకూలత వలన భూ గృహ సంపాదన కలుగును.
కృత్తిక వారికి, సంవత్సరారంభము నుండి ఆషాఢ బహుళం వరకు జన్మతారయందు కేతువు సంచరించును. మృగశిర వారికి, ఆషాఢ బహుళం నుండి సంవత్సరాంతం వరకు నైధనతారయందు కేతువు సంచరించును. మొత్తము మీద వీరు, రాహుకేతువులకు శాంతియొనర్చిన మేలు. ఆషాఢ పుష్యమాసముల యందు కుజునికి శాంతియొనర్చిన మేలు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి పూజ, సప్తశతి పారాయణము, హనుమత్పూజా ప్రదక్షిణములు శ్రేయోదాయకములు.
