ఉత్తరఫల్గుని 2, 3, 4 పాదములు, హస్త, చిత్ర 1, 2 పాదములు (టొ, పా, పి, పూ, ష, ణ, ఢ, పె, పో)

ఆదాయం : 14, వ్యయం : 2 - రాజపూజ్యం : 6, అవమానం : 6

వీరికి ఈ సంత్సరము చైత్ర శుక్లపక్షమునందు, తిరిగి కార్తిక మార్గశిరములయందు షష్ఠశని కావున అనుకూలమయిన కాలము. తలచిన కార్యములు చాలావరకు నెరవేరును. శుభకార్యానుకూలతయుండును. ధనధాన్య వృద్ధి కలుగును. గృహనిర్మాణ ప్రయత్నములు ఫలిస్తాయి. మిగిలిన సమయములలో సప్తమ శని కావున స్వజన విరోధము, చోరాగ్ని బాధలు, ఆరోగ్యలోపములు, అకాల భోజనములు కలుగును. ప్రారంభమున భాగ్యగురువు, కార్తిక మార్గశిరముల యందు ఏకాదశగురువు అయినందున చాలావరకు పరిస్థితులు అనుకూలించును. గౌరవమర్యాదలు, కీర్తిప్రతిష్ఠలు కలుగును. మిగిలిన సమయమంతయు దశమ గురువు అయినందున వృత్తి ఉద్యోగ వ్యాపారాదులయందు తరుచుగ చిక్కులు, ఆస్తిని కోల్పోవుట, సంతతిపీడ, గౌరవభంగం కలుగవచ్చును. సంవత్సరారంభం నుండి, వైశాఖ బహుళం వరకు జన్మకేతువు, సప్తమరాహువు అయినందున వృథావ్యయము, వృథావైరములు, తరచుగ ఇబ్బందులు, ఆరోగ్యలోపములు కలుగును. పిదప షష్ఠరాహువు, వ్యయకేతువు అగుటచే సకల కార్యములయందు జయము, ధైర్యము, శత్రుజయము, గో భూ లాభము కలుగును. ఆదాయమునకు మించి వ్యయమగుటచే కొన్ని కార్యములయందు విఘ్నములు కలుగును. ప్రారంభమున రెండు మాసములయందు, కార్తిక మార్గశిరములయందు కుజానుకూలతచే భూ గృహ సంపాదన ప్రయత్నములు కలసివస్తాయి. మిగిలిన సమయములో కొంత జాగ్రత్త అవసరము.

ఉత్తరఫల్గుని వారికి, సంవత్సర ప్రారంభము నుండి ఆషాఢ బహుళం వరకు జన్మతారయందు కేతువు సంచరించును. హస్త వారికి, వైశాఖ బహుళం నుండి భాద్రపద బహుళం వరకు, తిరిగి మాఘ బహుళం నుండి శనివేధ కలదు. చిత్ర వారికి, ఆషాఢ బహుళం నుండి సంవత్సరాంతం వరకు నైధనతారయందు కేతువు సంచరించును. సంవత్సరారంభము నుండి వైశాఖ శుక్లం వరకు, తిరిగి భాద్రపద బహుళం నుండి మాఘ శుక్లం వరకు శనివేధ, సంవత్సరారంభం నుండి కార్తిక బహుళం వరకు రాహువేధ కలదు. మొత్తము మీద వీరు ఈ సంవత్సరము శని, గురువు, కుజులకు శాంతి చేయవలయును. అశ్వత్థనారాయణ సేవ, గురుసేవ, సుందరకాండ పారాయణము వలన మంచి జరుగును.


More Rasi Phalalu 2025 - 2026