మృగశిర 3,4 పాదములు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదములు (కా, కి, కు, ఖం, ఙ, ఛ, కే, కో, హ)
ఆదాయం : 14 వ్యయం : 2 - రాజపూజ్యం : 4, అవమానం : 3
వీరికి ఈ సంవత్సరము, శని భాగ్య రాజ్య రాశులలో సంచరించును కావున అనుకూలుడు కాదు. శుభకార్య విఘ్నము, మనోవ్యాకులత, ఉద్యోగ వ్యాపార వ్యవసాయములందు నష్టము ఎక్కువగానుండును. శ్రమ అధికము, ఫలితము స్వల్పము రీతిగనుండును. గురువు కార్తీక, మార్గశిరములయందు అనుకూలముగ ఉండినందున, ధనసంపాదన, సుఖము, కీర్తి ప్రతిష్ఠలు పొందుట కలుగును. సమాజంలో వీరిమాటకు విలువయుండును. మిగిలిన సమయమంతయు, వ్యయ జన్మరాశులయందు సంచరించుటచే, ధనవ్యయము, స్థానచలనము కలుగును. పరిస్థితులు శ్రమకరముగ నుండగలవు. శుభమూలక ధనవ్యయము, రాజానుకూలత లేకపోవుట, కీర్తిహాని కలుగును. ఆస్తిసంబంధ విచారము, వ్యాజ్యములు కలుగవచ్చును. వైశాఖ బహుళం వరకు చతుర్థకేతువు, దశమరాహువు, పిమ్మట తృతీయ కేతువు, భాగ్యరాహువు అగుటచే శుభాశుభ మిశ్రమముగనుండును. వాతరోగములు, చిత్తచాంచల్యము, పశునష్టము, ధనధాన్యనష్టము, మధ్య మధ్య కొంత లాభము, జయము, ప్రోత్సాహము కలుగును. ఆషాఢ, కార్తికములందు కొంత కార్యానుకూలతయుండును. శ్రావణ, భాద్రపద, మాఘ మాసములయందు జాగ్రత్త అవసరము.
మృగశిర వారికి, ఆషాఢ బహుళం నుండి సంవత్సరాంతం వరకు నైధనతారయందు కేతువు సంచరించును. ఆర్ద్ర వారికి, మార్గశిర శుక్లం నుండి జన్మతారయందు రాహువు, ఆషాఢ బహుళం నుండి నైధనతారయందు కేతువు సంచరించుదురు. పునర్వసు వారికి, సంవత్సరారంభమున, తిరిగి భాద్రపద బహుళం నుండి మాఘ పూర్వార్ధం వరకు జన్మతారయందు శని, సంవత్సరారంభము నుండి కార్తిక బహుళం వరకు జన్మతారయందు రాహువు సంచరించుదురు. మొత్తము మీద వీరు ఈ సంవత్సరము నవగ్రహ శాంతియొనర్చిన మేలు. ఆదిత్య హృదయ పారాయణము, హనుమత్పూజా ప్రదక్షిణములు, గురుసేవయొనర్చిన మేలు జరుగును.
