మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదము (యే, యొ, బా, బి, బూ, ధ, భ, ఢ, బె)
ఆదాయం : 5, వ్యయం: 5 - రాజపూజ్యం : 1, అవమానం : 5
వీరికి ఈ సంవత్సరము, ప్రారంభమున, కార్తిక, మార్గశిరములయందు తృతీయశని కావున చాలావరకు అనుకూలుడు. ఋణవిముక్తి, భూ గృహ సంపాదన, ఉద్యోగప్రాప్తి కలుగును. స్వబుద్ధితో యత్నించిన కార్యములు సిద్ధించును. భ్రాతృవర్గములో గల పేచీలు పరిష్కరించబడును. మిగిలిన సమయమంతా అర్ధాష్టమశనియగుటచే విశేషించి శ్రమకరమగు కాలము. అనేక సమస్యలు వచ్చును. జాగ్రత్త అవసరము. కళత్రపీడ, ఆస్తిని కోల్పోవుట, శారీరక మానసిక శ్రమ, స్వస్థానహాని, వాతబాధలు కలుగును. చైత్ర వైశాఖములందు షష్ఠగురువు, కార్తిక మార్గశిరములయందు అష్టమగురువు అగుటచే శత్రు జాతి బాధలు, వ్యాజ్యములు, చోర రోగబాధలు అధికముగనుండగలవు. మిగిలిన సమయమంతయు సప్తమ గరువు అగుటచే అనుకూలమయిన కాలము. ఆరోగ్యము చేకూరును. రాజదర్శనము, ఇష్టకార్యసిద్ధి, గౌరవమర్యాదలు, కీర్తిప్రతిష్ఠలు కలుగును. చైత్ర వైశాఖములందు చతుర్దరాహువు, దశమకేతువు అయినందున, వృత్తి ఉద్యోగ వ్యాపారాదులయందు చిక్కులు, ఆస్తిని కోల్పోవుట, గృహమునందు అశాంతి కలుగును. మాతృవర్గములో పేచీలు, ప్రయాణాదులయందు విఘ్నములు కలుగును. పిదప తృతీయ రాహువు, భాగ్యకేతువు అగుటచే తలచిన కార్యములు నెరవేరును. భ్రాతృద్వేషము, మర్యాదాహాని ఒకప్పుడు కలుగవచ్చును. సంవత్సరమంతయు
కుజుడు అనుకూలుడు కాదు.
మూలా నక్షత్రము వారికి, సంవత్సరారంభము నుండి వైశాఖ పూర్వార్ధం వరకు, తిరిగి భాద్రపద బహుళం నుండి మాఘ పూర్వార్ధం వరకు నైధనతారయందు శని, సంవత్సరారంభము నుండి కార్తిక బహుళం వరకు నైధనతారయందు రాహువు సంచరించుదురు. పూర్వాషాఢ వారికి, వైశాఖ బహుళం నుండి భాద్రపద బహుళం వరకు, తిరిగి మాఘ బహుళం నుండి సంవత్సరాంతం వరకు నైధనతారయందు శని, ఆషాఢబహుళం నుండి సంవత్సరాంతం వరకు జన్మతారయందు కేతువు సంచరించుదురు. ఉత్తరాషాఢ వారికి, సంవత్సరారంభం నుండి ఆషాఢ బహుళం వరకు జన్మతారయందు కేతువు సంచరించును. మొత్తము మీద వీరు ఈ సంవత్సరము శని, గురు, కుజులకు ప్రత్యేకశాంతి యొనర్చవలయును. సంవత్సరమంతయు సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారి పూజ, ప్రతినెల తమ | జన్మనక్షత్రము నాడు, మాసశివరాత్రియందు పరమేశ్వర ప్రీతిగ మహన్యాస పూర్వక రుద్రాభిషేకము చేసిన మంచిది.
