బగళాముఖీ అమ్మవారు ఎలా వెలిశారో తెలుసా!

భారతదేశంలో చాలా గొప్ప దేవాలయాలు ఉన్నాయి. ప్రాచీన ఆలయాల నిర్మాణం వెనుక అద్భుతమైన కథలు కూడా ఉన్నాయి. దేవీదేవతల ఆలయ నిర్మాణాలు అద్బుతమైనవి అయితే వాటి నిర్మాణానికి దారి తీసిన సంఘటనలు మరింత అద్భుతంగా ఉంటాయి. అలాంటి వాటిలో బగళాముఖి ఆలయం ఒకటి. 

చందవోలు ప్రాంతాన్ని పాలించిన చోళరాజులలో ఒకరు శివాలయాన్ని నిర్మించాలని సంకల్పించి బండ్ల నిండుగా రాళ్ళు తెప్పించాడు. అయితే ఆ బండ్లు ఊరి బయటనే నిలచిపోయాయి. ఎంత ప్రయత్నించినా ఎడ్లు ముందుకు కదల లేదు. కొందరు దైవజ్ఞులు ఆ రాజుతో గ్రామానికి రక్షగా ఉన్న అద్భుత శక్తి మాహాత్మ్యమిదని చెప్పారు. అప్పుడు అక్కడ తవ్వించగా జగన్మాత విగ్రహం బయటపడింది. ముందు అమ్మవారిగుడి కట్టించి, ఆ పైనే రాజు శివాలయం నిర్మించాడు. అమ్మ వారి విగ్రహాన్ని వెలికి తీసేందుకు తవ్విన కందకంలో నీరు ఊరింది. రాజు దానినొక బావిగా వెడల్పు చేసి, కట్ట కట్టించాడు. బండ్లు నిలచిపోగా దొరకిన అమ్మవారు కనుక 'బండ్లమ్మ' అని అమ్మవారిని పిలుస్తున్నారు. ఆ బావిని కూడా 'బండ్లమ్మ' బావి' అంటున్నారు.

ఈ విధంగా బయటపడి పూజలందుకొనే బండ్లమ్మ విగ్రహం దశమహావిద్యలలో ఒకటైన 'బగళాముఖి' అని అంటారు. బగళాముఖి ఆలయాలు తెలుగునాట అరుద ఈ విగ్రహం విశిష్టత ఏమిటంటే, అమ్మవారు తమ ఎడమ భుజంపై శివలింగాన్ని ధరించి ఉండడం. 3 ఇలా అమ్మవారి విగ్రహగతంగా శివలింగం ఉండటం ఎంతో అరుదు.

శ్రీవిద్యోపాసకులైన శ్రీ చందవోలు రాఘవ నారాయణ శాస్త్రిగారికి బండ్లమ్మ కలలో కనిపించి, తన దేవళానికి ప్రాకారం కట్టించమని కోరిందట. ఆయన పూనికపై భక్తులంతా కలసి ప్రాకారాదులను నిర్మించారు. శాస్త్రిగారు తమ భౌతిక కాయాన్ని విడిచినప్పుడు దహన సమయంలో ఒక విలేఖరి ఫోటో తీయగా చితా ధూమంలో పంచరంగుల్లో సర్వాభరణ  భూషిత అయిన అమ్మవారు సాక్షాత్కరించడం కనిపిస్తుంది.  ఆ ఛాయా చిత్రాన్ని ఆంధ్రప్రభ దినపత్రిక అప్పట్లో ప్రచురించింది. అది చలనం రేపింది.

2002 నవంబర్ 11న ముఖ మండప నిర్మాణానికి పునాదులు తుండగా ఏనాడో ఏ మహారాజులో అమ్మవారి కోసం చేయించిన అమూల్య ప్రాచీన సువర్ణాభరణాలు దొరికాయి. వాటిని అమ్మవారి విగ్రహానికి అలంకరించగా అవి సరిగ్గా సరిపోవడం ఒక అద్భుతం. ఈ ఆలయం బాపట్ల - రేపల్లె రహదారిలో బాపట్లకు 17కిమీ దూరంలో ఉంది. 

                                 ◆నిశ్శబ్ద.


More Purana Patralu - Mythological Stories