మూలల్లో సింహద్వారం ఉండొచ్చా?
(Vastu & Corner Doors)
మూలల్లో సింహద్వారం ఉండకూడదు అనేది మునుపటి నియమం. కానీ మూలల్లో సింహద్వారం ఉండొచ్చు. అసలు అలా ఉండటమే మంచిది. వాస్తులో కాలంతో బాటు నియమాలు మారిపోతాయా అని ఆశ్చర్యపోకండి. కొన్నిసార్లు మారతాయి. అందుకు కారణాలు కూడా ఉంటాయి. ముందే చెప్పుకున్నట్లు వాస్తు శాస్త్రీయమైంది కదా. వెనుకటి కాలంలో పిల్లర్లు లేవు కనుక మూలల్లో ద్వారాలు పెట్టినట్లయితే గోడలు బలహీనంగా ఉండి వాటిని మోయలేకపోయేవి.
పూర్వం పింకుటిళ్ళకు, పూరిళ్ళకు ద్వారాలు దిక్కుల మధ్యభాగంలోనే ఉండేవి. ఆ ఇళ్ళకు ఇప్పుడైనా అలాగే ఉండాలి, మూలల్లో ఉండకూడదు. పూర్వపు నిర్మాణాలను పరిశీలించిన అనుభవ జ్ఞానంతో మూలల్లో ద్వారాలు ఉండకూడదు అనుకుంటారు కొందరు. నిజానికి అలా మూలల్లో ఉంటేనే శ్రేష్టం. మూలలు ఉచ్చస్థానాలు కనుక మూలల్లో ఉండటమే మంచిది.
కాంక్రీట్ పిల్లర్లు వేసి ఇళ్ళు, ఫ్లాట్లు కడుతున్న ఈ రోజుల్లో గోడలమీద బరువు పడదు. పిల్లర్లు వేసి, వాటిమీద స్లాబ్ వేయడంవల్ల గోడలకు బరువు సమస్య ఎంతమాత్రమూ ఉండదు. దాంతో నిరభ్యతరంగా మూలల్లో ద్వారాలు పెట్టుకోవచ్చు.
పిల్లర్లు లేని కాలంలో ఇంటికప్పు, తలుపులు, కిటికీల భారం అంతా గోడలమీద పడేది. అందుకే గోడలను చాలా మందంగా, బలంగా నిర్మించేవారు. గోడలకు అదనపు బరువు చేరకుండా గోడలకు మధ్యలో ద్వారాలు పెట్టేవారు. ఇంటి గోడలకు మరింత బలాన్ని చేకూర్చడానికి మధ్యలో L ఆకారంలో ఉన్న గోడలు కట్టేవారు. ఇవి ఇంటి కప్పును బలంగా మోయగలవు.
ఇళ్ళు బలంగా ఉంటేనే కదా, అందులో సుఖంగా, సౌఖ్యంగా ఉండగల్గుతాం. ఇదివరలో ద్వారాలు మూలల్లో ఉంటే మంచిది అని తెలిసినా, గోడకు అదనపు బరువు పడుతుందనే భయంతో మధ్యలో పెట్టేవారు. ఇప్పుడు నిర్మాణాల శైలిలో ఎన్నో మార్పులు వచ్చి ఎంతో మెరుగుపడింది కనుక ఈ అభివృద్ధిని ఉపయోగించుకోవడం తెలివైన పని. సాధ్యమైనంతవరకూ మూలల్లో ద్వారాలు ఏర్పాటు చేసుకోవచ్చు. కుదరకపోతే, దిక్కుల మధ్య కూడా ద్వారాలు పెట్టుకోవచ్చు.