ఉగాది పచ్చడి గురించి బోలెడు శ్లోకాలు
వేపపూతతో చేసిన పచ్చడి తినందే... ఉగాది పండుగని అసంపూర్ణంగా భావిస్తారు పెద్దలు. జీవితంలోని సుఖదుఖాలని ఎదుర్కోవాలనే సూచనగానూ, రాబోయే అనారోగ్యాలని ఎదుర్కొనే ఔషధంగానూ ఉగాదిని భావిస్తారు. అలాంటి ఉగాది పచ్చడిలో ఏమేం ఉండాలి, ఏ సమయంలో తినాలి, తినేటప్పుడు ఏమనని మననం చేసుకోవాలి అన్న వివరాలు బోలెడు శ్లోకాల రూపంలో నిక్షిప్తమై ఉన్నాయి. వాటిలో కొన్ని...
ఎప్పుడు తినాలి! వేటితో చేసుకోవాలి!
యద్వర్షాదౌ నింబకుసుమం
శర్కరామ్ల ఘృతైర్యుతమ్
భక్షితం పూర్వయామేస్యా
త్తద్వర్షం సౌఖ్యదాయకమ్
ఉగాది రోజున తొలిజామునే నింబకుసుమం (వేపపువ్వు), శర్కర (తీపి), ఆమ్లం (పులుపు), ఘృతం (నెయ్యి)... తో చేసిన ఉగాది పచ్చడిని కనుక తింటే ఆ సంవత్సరమంతా సౌఖ్యంగా ఉంటుంది.
తినేటప్పుడు చెప్పుకోవలసిన శ్లోకం
త్వామష్ఠ శోక నరాభీష్ట
మధుమాస సముద్భవ
నిబామి శోక సంతప్తాం
మమ శోకం సదా కురు
‘వసంతంలో చిగురించే ఓ అశోకమా! నా జీవితంలోని శోకాలను కూడా నివారించి సదా సుఖసంతోషాలతో ఉండేట్లు చేయి’ అని పై శ్లోకంలోని అర్థం. ఒకప్పుడు ఉగాది పచ్చడిలో అశోకవృక్షపు చిగుళ్లు కూడా కలిపేవారు. ఔషధపరంగా అశోకానికి గొప్ప ప్రాధాన్యత ఉంది. అందుకే జీవితంలోని శోకాన్ని సైతం ఇది నివారించగలదని ఆ పేరు (అ-శోకము) పెట్టి ఉంటారు. ఉగాది పచ్చడి తినేటప్పుడు కూడా అందుకు తగిన శ్లోకాన్నే చెప్పుకొనేవారు. వేపకి సైతం సర్వరోగనివారిణి అన్న పేరు ఉంది కాబట్టి... వేపని కూడా అశోకంగానే పిల్చుకోవచ్చు. అలా ఉగాది పచ్చడిలో మార్పు వచ్చినా ఆనాటి శ్లోకాన్నే చెప్పుకోవడంలో అనర్థమేమీ లేదు.
తింటే ఏంటట!
శతాయుష్యం వజ్రదేహం దదాత్యర్థం సుఖానిచ
సర్వారిష్టవినాశంచ నింబకందళ భక్షణమ్॥
వేపపూతతో కూడిన ఉగాది పచ్చడిని తినడం వల్ల దేహం వజ్రసదృమవుతుంది. సర్వారిష్టాలూ తొలగిపోతాయి. అలా నిండు నూరేళ్లు సుఖంగా జీవిస్తారనీ ఈ శ్లోకం అంతరార్థం.
- నిర్జర.