తెలుగు సంవత్సరాలకి ఆ పేర్లు ఎలా వచ్చాయి?

 

చైత్ర శుద్ధ పాడ్యమి రోజు సృష్టి ప్రారంభమైంది కనుక ఆ రోజు యుగాది అనే క్రమేపీ ఉగాదిగా మారిందని మనకు తెలుసు. మరి తెలుగు సంవత్సరాలకు ఆ పేర్లు ఎలా వచ్చాయి! ఆ పేర్ల వెనుక కారణాలు, అర్థాలు ఏమిటి!

మనిషి నిజమైన ఆయుర్దాయం 120 ఏళ్లని చెబుతూ ఉంటారు. ఒకప్పుడు జనం ఈ పరిపూర్ణమైన ఆయుష్షుని సాధించేవారనీ.... క్రమేపీ ఆ వయసు తగ్గిపోతూ వచ్చిందని నమ్ముతారు. కొందరు ఇప్పటికీ ఈ వయసుని చేరుకోవడాన్ని చూస్తే ఆ నమ్మకంలో నిజం లేకపోలేదనిపిస్తుంది. దీనికి తగినట్లు శాస్త్రవేత్తలు కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటే మున్ముందు మనుషులు 120 ఏళ్లు బతకగలరనీ... కానీ అంతకు మించి బతకడం అసాధ్యమనీ తేల్చేశారు. బైబిల్‌లో (Genesis 6:3) సైతం మనుషులు 120 ఏళ్లు బతికేందుకు మాత్రమే తన అనుమతి ఉందని దేవుడు చెప్పినట్లు కనిపిస్తుంది. ఇదీ 120 ఏళ్లకీ మనిషికీ ఉన్న అనుబంధం.

ఇక హిందూ సంవత్సరాలు 60 ఉండటం గురించి కూడా సహేతుకమైన కారణాలే కనిపిస్తాయి... మనిషి దేనినైనైనా రెండుతో భాగించడం కనిపిస్తుంది. అది మౌలికమైన భాగాహారం. అంతేకాదు రెండుగా భాగించిన వస్తువు కలిసి కదిలితే ఒక వలయం పూర్తవుతుంది. ఉత్తరాయణం- దక్షిణాయనం, శుక్ల పక్షం- కృష్ణ పక్షం, పగలు- రాత్రి... ఇలా కాలం ప్రాథమికంగా రెండు వర్గాలుగా కనిపిస్తుంది. ఈ ద్వంద్వాలతోనే జీవితం ముందుకు నడుస్తుంది. అలా 120 ఏళ్ల మనిషి జీవితాన్ని కూడా రెండు భాగాలుగా చేస్తే 60 ఏళ్లుగా తేలుతుంది. వాటిలో ఒక 60 ఏళ్లు పూర్తయిన తరువాత షష్టిపూర్తి చేసుకునే ఆచారమూ కనిపిస్తుంది. ఇప్పుడు రెండో షష్టిపూర్తి చేసుకునే పరిస్థితులు లేవు కాబట్టి వేయి పున్నములు చూసినవారికి ‘సహస్రపూర్ణ చంద్రోదయం’ పేరుతో ఉత్సవం జరుపుతున్నాము.

మనిషి ఆయుర్దాయంలో 60 సంవత్సరాలకి ఉన్న ప్రాధాన్యత తెలిసిపోయింది. ఆ 60 ఏళ్లలోనూ రకరకాల అనుభవాలు మనిషి పొందుతాడు కాబట్టి... ఒకో సంవత్సరానికీ ఒక లక్షణాన్ని ఆపాదించి ఉంటారు పెద్దలు. ఆ లక్షణాల ఆధారంగానే వాటి పేర్లనీ నిర్ణయించి ఉంటారు. అయితే ఈ సంవత్సరాలకి ఆ పేర్లు రావడానికి కొన్ని గాథలు కూడా ప్రచారంలో కనిపిస్తాయి. శ్రీకృష్ణుని భార్యలలో ఒకరైన సందీపని అనే రాకుమారికి 60 మంది సంతానమనీ... అవే సంవత్సరాది పేర్లుగా మారాయని చెబుతారు. మరో గాథ ప్రకారం విష్ణుమాయ కారణంగా నారదుడు వివాహం చేసుకుని 60 మంది సంతాగాన్ని కన్నాడనీ... వారి పేర్లే సంవత్సరాలకు పెట్టారనీ చెబుతారు.

ఇంతకీ ఆ 60 సంవత్సరాదుల పేర్లూ ఎక్కడ చూసినా కనిపిస్తాయి. కానీ వాటి అర్థాలని వివరించడంలో కాస్త గందరగోళం కనిపిస్తుంది. ఉదాహరణకు తొలి సంవత్సరాది పేరు ‘ప్రభవ’. బహుశా సృష్టి ప్రభవించిన సమయం కాబట్టి... ఈ పేరు వచ్చి ఉండవచ్చు. కానీ ‘యజ్ఞాలు ఎక్కువగా జరిగే కాలం’ అన్న అర్థం తరచూ కనిపిస్తుంది. అలాగే క్రోధన అన్న పేరుకి కోపం కలది అన్న అర్థం ఉంటే ‘జయమును కలిగించేది’ అన్న అర్థం చాలా చోట్ల తటస్థపడుతోంది. ఇలా అంతర్జాలంలో కనిపించే సంవత్సరాది అర్థాలలో కాస్త వైరుధ్యం కనిపిస్తుంది. నిఘంటువులో వాటికి కనిపించే అర్థాలకీ, పండితులు చెప్పే వివరణకీ, అంతర్జాలంలోని అర్థాలకీ పొంతన ఉండకపోవచ్చు. ఇలాంటి అయోమయం ఉన్నప్పుడు... అర్థం ఎలాగున్నా... ప్రతి సంవత్సరమూ మేలు జరగాలని, జీవితంలో సుఖశాంతులలో విలసిల్లాలనీ కోరుకోవడమే!


More Ugadi