ఉగాదిలో వేపపూత పులకరింత!


ఉగాది తెలుగువారికీ, కన్నడిగులకూ చాలా ముఖ్యమైన పండుగ. దీనినే సంవత్సరాది పండుగ అని కూడా అంటారు. ప్రతి సంవత్సరం చైత్ర శుక్ల పాడ్యమి రోజున ఈ పండుగను జరుపుకుంటారు. అన్ని పండుగలలో ఇదే మొదటి పండుగ.

'నూతన సంవత్సర కీర్తనాద్యారంభం ప్రతి గృహ ధ్వజారోహణం నింబపత్రాశనం వత్సరాది శ్రవణం నవరాత్రారంభః' అంటే ఈ రోజున ప్రతి ఇంటికి తోరణాలు కట్టి, వేపపూతతో చేసిన పచ్చడిని భుజించి, సంవత్సర ఫలశ్రవణం చేస్తారు. ఉగాది నుండి శ్రీరామనవమి వరకు శ్రీరామ నవరాత్రోత్సవాలను జరుపుతారు.

ఉగాది ఋతు సంబంధమైన పండుగ. ప్రకృతి ఆరాధనకు పేరు మోసిన పండుగ. మన పెద్దలు ఋతుసంబంధమైన ఆ యా పండుగల కార్యకలాపాల్లో ఆ యా ఋతువుల్లో లభ్యమయ్యే ప్రకృతి పదార్థాలకు ప్రవేశం కలిగించి, ప్రయోజనం కల్పించారు. ఉగాది పర్వదినం నాడు నింబ కుసుమ (వేప పూత) భక్షణవిధి అందుకు నిదర్శనం. ఉగాది నాటికి వేపచెట్లు ముమ్మరంగా పూతపూసి ఉంటాయి. వేప పువ్వు గుణవంతమైన ఔషధి. రక్తాన్ని శుద్ధి చేసి వృద్ధిపరిచే గుణం దానికి ఉంది. పైగా అది వసంత ఋతు సంబంధమైన పువ్వు. వైద్యానికి ఉపయోగించే వాటిలో వేప ఒకటి.

వేప సర్వాంగాలనూ మనవారు వైద్యంలో వాడతారు. మానవునికి ఆరోగ్యం కూర్చే వృక్షరాజాల్లో వేప ఒకటి. స్వర్గలోకంలోని ఆంబ్రోశియా వృక్షం అంశతో భూలోకంలో వేప చెట్టు పుట్టిందని మహారాష్ట్ర సంప్రదాయక విజ్ఞానం ద్వారా వెల్లడి అవుతోంది. పారశీక భాషలో వేప చెట్టుకు Azar Durachta అని పేరు. దాని అర్థం ఉత్తమ వృక్షం అని. ఈ పేరు వేపచెట్టు శ్రేష్ఠత్వాన్ని తెలియజేస్తుంది.

పూవ్వైనా.. ఆకైనా వేప చెట్టును సేవించడం ఉగాది పండుగ రోజు చేసే పనుల్లో ఒకటని మత గ్రంథాలు చెబుతున్నాయి. కాగా ఉగాది దినాలు వేరైనప్పటికీ ఆనాడు వేప సంబంధమైన పూవ్వునో, ఆకునో తినడం హిందూదేశంలోని వివిధ ప్రాంతాల్లో ఆచారం. వేపాకు, పూవు- ఈ రెండింటిలో దేని వాడకం మంచిది అనే ప్రశ్న ఈ సందర్భంలో పొడసూపడం సహజం.

ఆయుర్వేద వైద్యులు వాడే వేప పంచాంగాలలో ఆకు కూడా ఒకటి. చర్మవ్యాధుల్లో పచ్చి వేపాకు నలుగు పెట్టుకుంటారు. అమ్మవారి జబ్బుల్లో రోగులకు  ఆకులు దట్టంగా ఉండే పేపరొట్ట వాడుతారు. మశూచి రోగులు ఉండే ఇంటి ముంగిళ్ళలో వేపాకు తోరణాలు కడతారు. ఇలా వేపాకు ఉపయోగాలు ఎన్ని అయినా చెప్పవచ్చు.

అయితే ఉగాది నాడు వేపాకు కన్నా వేపపూత వాడడమే సమయోచితం. వేపచెట్టు అంగాల్లో వసంత ఋతువులో మాత్రమే దొరికేది పూవే. వసంత ఋతుసంబంధ పర్వమైన ఉగాది నాడు ఆ ఋతువులో మాత్రమే దొరికే వేపపూతను వాడడమే ప్రాప్తకాలజ్ఞత. అదే మన పెద్దల ఉద్దేశ్యమై ఉంటుంది. ఆ యా కాలాల్లో లభ్యమయ్యే ఫలపుష్పాదులను ఆ యా కాలాల్లోని పర్వదినాల్లో భగవంతునికి నివేదన చేసి స్వీకరించడం మన సంప్రదాయం!

                                 ◆నిశ్శబ్ద.


More Ugadi