అందుకే ఉగాది పచ్చడి తిని తీరాలి!
తీపి, కారం, పులుపు, వగరు, చేదు, ఉప్పు… ఈ షడ్రుచులు కలిసిన పదార్థమే ఉగాది రోజు చేసుకునే పచ్చడి. జీవితం కష్టసుఖాల సమ్మేళనం అనీ… వాటన్నింటినీ సమానంగా స్వీకరించాలనే సందేశం ఇందులో కనిపిస్తుంది. అంతేకాదు! కామ, క్రోథ, మోహాది అరిషడ్వర్గాలను సమానంగా నియంత్రించుకోవాలని చెప్పే సూచనా ఉంది. ఈ రుచుల కోసం వేపపువ్వు, మామిడికాయలు, అరటిపండ్లు, చెరుకు రసం, బెల్లం, చింతపండు లాంటి పదార్థాలను ఉపయోగిస్తారు.
రుతువు మారే ఈ కీలకమైన సమయంలో ఈ ఉగాది పచ్చడి ఓ ఔషధంగా ఉపయోగపడుతుందని నమ్మకం. అందుకే
శతాయుష్యం వజ్రదేహం దదాత్యర్థం సుఖానిచ
సర్వారిష్టవినాశంచ నింబకందళ భక్షణమ్॥
అని ఉగాది పచ్చడి గురించి చెబుతారు. వేపపువ్వుతో కూడిన ఈ ఉగాది పచ్చడిని తినడం వల్ల దేహం వజ్రమంత దృఢంగా మారుతుందట. సకల అరిష్టాలూ తీరిపోయి నిండు నూరేళ్లపాటు ఆరోగ్యంగా జీవిస్తారట.
ఇంతకీ… ఉగాది పచ్చడి పేరుతో వేపని ముఖ్యంగా తీసుకోవడానికి పెద్దలు ఎందుకింత ప్రాధాన్యత ఇచ్చారు? భారతీయులు దేవతా వృక్షాలుగా భావించే చెట్లలో వేప కూడా ఒకటి. ఊళ్లో ఒక్క వేపచెట్టయినా ఉండాలని చెబుతారు. ఆ వేపచెట్టు నీడ తగులుతూ ఉంటే, ఎలాంటి అనారోగ్యమూ దరిచేరదని ఆయుర్వేదం చెబుతోంది.
వైద్యశాస్త్రం అంతగా అందుబాటులో లేని రోజుల్లో అంటువ్యాధులకు వేపతోనే ఉపశమనం లభిస్తుందని నమ్మేవారు. ఇప్పటికీ గ్రామాల్లోని జాతరల్లో వేపమండల కొలుపే కీలకంగా కనిపిస్తుంది. గాలి ద్వారా సోకే (వైరల్) చికెన్ పాక్స్ లాంటి వ్యాధులు సోకినప్పుడు… అవి త్వరగా తగ్గేందుకు రోగి చుట్టూ వేపాకులను ఉంచుతారు. దీన్ని ఒకప్పుడు మూఢనమ్మకంలా కొట్టిపారేసేవాళ్లు. కానీ ఈమధ్యకాలంలో వేప వల్ల వైరస్ దూరం అయి తీరుతుందని నిరూపించే పరిశోధనలు వెలువడ్డాయి. కొలరాడో విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు… వేప బెరడుతో రూపొందించే మందులతో ఎలాంటి కరోనా వైరస్ ని అయినా ఎదుర్కోవచ్చుని నిరూపించారు.
మొత్తానికి వేపతో చేసే పచ్చడి… చేదు కూడా జీవితంలో ఓ భాగమే అని చెప్పే భావన, వేప పువ్వు వసంతానికి సూచన, ఆరోగ్యానికి ఆలంబన. మొత్తానికి మానసికంగా, శారీరికంగా, సామాజికంగా కూడా వేప పువ్వుతో చేసే పచ్చడి ఓ వినూత్నమైన సందేశాన్ని అందిస్తుంది.
- నిర్జర