ధ్యానాన్ని మించిన గొప్ప మార్గం ఇదే...


ఆధ్యాత్మికత గురించి స్పష్టంగా ఎవరికీ తెలియదు. తెలుసుకునే ప్రయత్నం ఎవరూ చేయరు. ధ్యానం చేయడం, ఆ దేవుడిని పూజించడం ఆధ్యాత్మికత అనే ఆలోచనలో చాలామంది ఉంటారు.  కానీ ఆధ్యాత్మిక జీవితం అంటే కోల్పోవడం. ఇక పోగొట్టుకోవడానికంటూ ఏమీ లేనంతవరకు అన్నింటినీ వదిలివేయడం. "కోల్పోవడం అలవరచుకోండి. లేకపోతే ప్రకృతే మీ మెడలు వంచి, సర్వస్వాన్ని సంగ్రహిస్తుంది. కాబట్టి ముందునుండే మనస్ఫూర్తిగా ఇవ్వడం నేర్చుకోండి" అని స్వామి వివేకానంద హెచ్చరిస్తారు.


మనలో గూడుకట్టుకొనే అశాంతికి మూలకారణం మన ఆశే! అంతులేని ఈ ఆశ మనల్ని అల్లకల్లోలపరిచి, అష్టకష్టాలు పెడుతుంది. కానీ దీనికి పూర్తి విరుద్ధమైంది - ధ్యానసిద్ధులైన వారి స్థితి. వారందరికీ నిరాశ సహజ స్వభావమైపోతుంది. వారి మనసునుండి 'నాది' అనే భావన తుడిచిపెట్టుకు పోతుంది. వారు లేనిదాన్ని ఆశించరు, ఉన్న వాటిపై 'మమ'కారానికి చోటివ్వరు. రేపటి చింతే వారి దరిచేరదు. నిన్నటి బెంగ వారి స్మృతి పథంలో నిలవదు. వారికి ఉన్నదంతా ఈ క్షణమే! ఆశ అంతుచూసిన వారు అందుకునే అత్యున్నత మనఃస్థితి అది. అష్టైశ్వర్యాలున్నా, ఆర్తుల్ని ఆదుకొనే లక్షణం లేని వారి జీవితం వేదనాభరితంగానే ఉంటుంది. మనస్తత్వ వేత్తలు ఈ విషయాన్ని నొక్కి వక్కాణిస్తారు.


ధ్యానంలో మనసును అన్ని వస్తువులు నుండి ఉపసంహరించాలి. కానీ ఎంతో మందికి ఇలాంటి మానసిక వైరాగ్యం అలవడేముందుగా ఆ వస్తువుల ఎడబాటును అనుభవించాలి. దీన్నే బాహ్య వైరాగ్యం అంటారు. ఈ సాధనను చిరకాలం పాటించిన వారికే మనో నిశ్చలత్వం లభిస్తుంది. అందుకే దానం, ఆధ్యాత్మిక అభివృద్ధికి దోహదం చేస్తూ మనతో పాటు మన చుట్టూ ఉండేవారికి కూడా అనందాన్ని ప్రసాదిస్తుందని అర్థమవుతుంది.


వ్యక్తులు నాలుగు విధాలుగా ఉంటారు. హింసించి ఆనందించేవారు, లాభసాటిగా ఉన్నప్పుడే సహాయం చేసేవారు. కొద్దిగా కష్టాన్ని భరించి అయినా ఇతరులకు మేలు చేసేవారు, సర్వస్వాన్ని పరహితానికే ధారపోసేవారు. వరుసగా రాక్షసులు, మానవులు, మంచివారు, మహాత్ములు అని వారిని వర్గీకరించవచ్చు. మన వ్యక్తిత్వం ఏ స్థాయిలో ఉందో నిస్పక్షపాతంగా అంచనా వేసుకోవాలి. అప్పుడే మనో వికాసానికి మన ముందున్న మార్గమేమిటో తెలుస్తుంది.


స్వామి వివేకానంద ఈ సందర్భంలో కొన్ని ఆసక్తి కరమైన విషయాలను వివరిస్తారు. మనసును బలాత్కరించైనా, నీకు ఏమాత్రం ఇష్టం లేకపోయినా, ఇతరులకు ఎంతో కొంత మంచిచేయి. ఆ ప్రయత్నాన్ని కొనసాగిస్తే, నీ మనసుకు శాంతి లభిస్తుంది అంటారు. కాబట్టి ఇతరులకు చేసే దానంకు మించి గొప్ప ధ్యానం కూడా ఎక్కడా ఉండదు.


                               ◆నిశ్శబ్ద.


More Subhashitaalu