సాధనా చతుష్టయాల గురించి తెలుసా?
సాధన చతుష్టయాలైన సంతోషం, శమం, విచారణ, సాధు సంగమం అనేవి సంసార సాగరం నుంచి తరింపజేసే ఉపాయాలట. దీనికి సంబంధించిన శ్లోకం, దాని వివరణ ఇలా ఉంది..
శ్సంతోషః పరమోలాభః సత్సంగం పరమాగతిః ।
విచారః పరమః జ్ఞానం శమోహి పరమమ్ సుఖమ్||
'సంతోషమే పరమ లాభం. సత్సంగమే పరమగతి. విచారమే పరమ జ్ఞానం. శమమే పరమ సుఖం'.
ఈ నాలుగు రకాలైన ఉపాయాలనూ అభ్యసించేవారే ఘనీభూతమై ఉన్న ఈ మోహజాలాన్ని జయిస్తారు. వీటిలో ఏ ఒక్క దాన్నైనా సర్వశక్తి యుక్తులతో అభ్యసిస్తే, మిగతా మూడూ కూడా లభిస్తాయి.
స్వచ్ఛమైన శమం వల్ల హృదయం నిర్మలమైనప్పుడు అలాంటి వ్యక్తి వద్దకు మిగతా మూడూ వచ్చి చేరుతాయి. సంతోషం, విచారణ, సత్సంగం ఉన్నచోట 'జ్ఞానం' రూపు దిద్దుకుంటుంది, సుగుణాలన్నీ ఆశ్రయిస్తాయి, విజయలక్ష్మి వరిస్తుంది.
"స్వప్రయత్నం" అనే పురుషకారం చేత మనస్సును జయించి, ఈ నాల్గింటిలో ఏ ఒక్కదానినైనా నిరంతరం ప్రయత్నపూర్వకంగా అవలంబించాలి. “శ్రద్ధతో, ఓర్పుతో, నేర్పుతో ఒక్కటైనా దైనందికమైన అలవాటుగా మార్చుకోవాలి. ఈ నాల్గింటినీ కాస్త కాస్త ఆశ్రయిస్తూ పోగా, కొంతకాలానికి అంతా సుసాధ్యమే అవుతుంది. మొదట్లో కొంత పట్టుదలతో ఆ తరువాత ప్రయత్నం వీడకుండా ఉంటే సాధ్యం కానిదంటూ ఏదీ ఉండదు. అసలు ప్రయత్నమనేదే చేయకుండా, "మానవ మాత్రులం! మా వల్ల ఏమవుతుంది?" అని నిరుత్సాహ పడి, తుచ్ఛ విషయాలకై పరుగులు పెడితే అది మూర్ఖత్వమే కదా! ఎందుకంటే మనుషుల్లోనే అత్యంత మహనీయులు, ఆత్మజ్ఞులు... అత్యంత మూర్ఖులు కూడా ఉన్నారు. అందువల్ల సాధన చెయ్యాలి. అసలు రహస్యమంతా సాధనలోనే ఉంది కానీ దైవంలో కాదు.
ఈ మనస్సును పురుషకారంతో జయించి, ఈ నాల్గింటిలో ఒక్కదానినైనా వశం చేసుకుంటేనే 'ఉత్తమగతి'. అలా కాకుండా మనసుకు నచ్చినట్టు ఉండటం. ఇంద్రియ విషయాలను మాత్రమే ఆశ్రయించడం, కల్పిత వ్యవహారాలనే నమ్ముకొని ఉండడం... అది శుభప్రదం అవుతుందా? ఈ నాల్గింటి కోసం కష్టపడి ప్రయత్నించాలి.
చంచల మనస్సు గుణదోషాలనే ప్రీతిపూర్వకంగా ఆశ్రయిస్తోంది. ఆ గుణ దోషాలను మొట్టమొదట జాగ్రత్తగా గుర్తించాలి. అయితే ఈ గుణదోషాలు తొలగేదెలా? మంచి గుణాలను ఆశ్రయించడమే అందుకు ఉపాయం. ఏ మార్గం కావాలో బాల్యంలోనే నిర్ణయించుకోవాలి. చక్కగా ఆలోచించాలి, మార్గాన్ని అన్వేషించాలి. తరువాత దాన్ని అనుసరించాలి. . అంతేకానీ, బాధపడుతూ కూర్చుంటే ఎవరికీ ఏ లాభమూ ఉండదు.
*నిశ్శబ్ద.