వృద్ధులు ఎలా ఉండాలో తెలుసా?

మనిషి జీవితాన్ని నాలుగు భాగాలుగా, వాటిని నాలుగు ఆశ్రమాలుగా రూపొందించింది మన ధర్మశాస్త్రం. అవే బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్న్యాస. ఏ ఆశ్రమానికి తగ్గ ధర్మాలు వాటికున్నాయి. 'ధర్మం' అన్నది ఒక కట్టుబాటు. కట్టుబాటును అతిక్రమిస్తే వచ్చేవి కష్టాలు. అన్ని బాధ్యతలు నెరవేర్చి వృద్ధాప్యం లోనూ గృహస్థ ధర్మాన్ని అంటిపెట్టుకొని ఉంటే అది కుటుంబంలో అశాంతికి దారి తీస్తుంది. కారణం వానప్రస్థాశ్రమ ధర్మాన్ని ఆచరించక పోవడమే! ముసలితనంలో 'అత్త పెత్తనం' మామగారి 'ఆధిపత్య ధోరణి' అధర్మాలు - అందుకే అశాంతి.

వానప్రస్థాశ్రమానికి ఉండాల్సిన మానసిక పరిపక్వత, సిద్ధత లేనపుడు వృద్ధాశ్రమాలలో చేరినా వృద్ధాప్యం అనివార్యమైన శారీరక ఫలితం ఉండదు. ఇది జీవితంలో వచ్చిన మొదటి మార్పుకాదు. ఇది జీవితంలో 'బాల్యం' నుంచి కానీ యవ్వనంలో వచ్చే మార్పులాగా ఉత్సాహాన్ని తీసుకురాదు. నిరుత్సాహం - నిరాశ వృద్ధాప్యానికి నేస్తాలు. ఉదయం- అస్తమయాల మధ్య ఎంత భేదం. ఒకటి వెలుగె బాట. ఇంకొకటి చీకటి కోట. ఈ చీకటిని ఛేదించాలి ? వృద్ధాప్యాన్ని ఎలా ఎదుర్కోవాలి??

శరీరం, మనసు - బొమ్మ బొరుసు లాంటివి. కానీ శరీరాన్ని పట్టించుకున్నంతగా మనసుని పట్టించుకోం. కాని మనసును నిరంతరం ఉత్సాహపరచుకుంటూ ఉండాలి. శరీరానికే వృద్ధాప్యం కాని మనసుకు కాదు. అది చంచలం. లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు చూపించే గుణం మనసుకుంది. జీవితానికి గమ్యం లేనపుడు మనసుపెట్టే కష్టాలు అన్నీ ఇన్నీ కావు. కోరికల వలతో మనిషిని బంధిస్తుంది ఈ మనసు. బంధ విముక్తుల్ని చేసేది కూడా ఈ మనసే!

అందుకే జీవితంలో ప్రతి దశలో అవి పరిచయం చేసేవాటిని ఉన్నదున్నట్టు అంగీకరించాలి. ఎప్పుడైతే అంగీకారం మనసులో పుడుతుందో అప్పుడు అహం, అధికార ధోరణి వెళ్లిపోతాయి. పెద్దవారు ఈ విషయాన్ని అర్థం చేసుకుంటే వారి వృద్ధాప్యం ఎంతో సజావుగా సాగిపోతుంది. చిన్నతనంలో చేసేపనులను కాస్త పెద్దయ్యాక వదిలిపెట్టి, ఆ పెద్దవయసులో అదేదో పెద్దరికం అనే పేరుతో ఎలాగైతే బాధ్యతగా ఉంటారో.. అలాగే వృద్ధాప్యంలో కూడా పెత్తనం అనే విషయాన్ని వదిలి ప్రశాంతమైన జీవితాన్ని గడపడానికి ప్రయత్నం చేయాలి.

మానవ జన్మ లక్ష్యం 'భగవంతుణ్ణి పొందడమే' అని నొక్కి వక్కాణించారు ఎంతోమంది ఆధ్యాత్మిక వేత్తలు. ఇదే జీవిత లక్ష్యం అయినప్పుడు వృద్ధాప్యం సమస్యగా అనిపించదు. శరీరానికి, మనసుకు ఉన్న అవినాభావ సంబంధాన్ని గుర్తుంచుకొని మనో నిబ్బరంతో వృద్ధాప్యాన్ని ఎదుర్కోవాలి. "శరీరమాద్యం ఖలు ధర్మ 'సాధనమ్' " అని ఎప్పటి మరిచిపోకూడదు. మన స్వ (ఆశ్రమ) ధర్మాన్ని' మనసా కాయా వాచా ఆచరించాలి. 'కలుపు మొక్కల' ఆలోచనల్ని' తీసేసి  సార్ధకత అనే 'జీవితం'ను దక్కించుకోవాలి. కార్యోన్ముఖులు కావాలి.

                                     ◆నిశ్శబ్ద.


More Subhashitaalu