ప్రార్థించే చేతులు
ఈ ప్రపంచంలోని ప్రతి జీవీ తనకి ప్రతిరూపమే అన్నది ఆస్తికుల నమ్మకం. అందుకే త్యాగం, దానం, కరుణ, జాలి వంటి గుణాలకే అన్ని మతాలలోనూ ప్రాధాన్యతని ఇచ్చారు. అలాంటి త్యాగానికి నిర్వచనంగా నిలిచే యదార్థ గాదే ఇది!
దాదాపు అయిదు వందల సంవత్సరాల క్రితం జర్మనీలోని న్యూరెంబర్గ్ అనే గ్రామంలో ఒక పెద్ద కుటుంబం ఉండేది. అది ఎంత పెద్ద కుటుంబం అంటే ఆ యజమానికి 18మంది పిల్లలు! అంతమందినీ పోషించేందుకు ఆ యజమాని రాత్రింబగళ్లూ కష్టపడాల్సి వచ్చేది. స్వతహాగా ఆయనది బంగారు ఆభరణాలు తయారుచేసే పని. కానీ దాంతోపాటు అదీ ఇదీ అని చూడకుండా ప్రతి కష్టమూ చేసి తన కుటుంబాన్ని సాకేవాడు. ఆ పిల్లల్లో ఆల్బెక్ట్, ఆల్బర్ట్ అనే ఇద్దరికి చిత్రలేఖనం అంటే మహా ఇష్టం. జీవితంలో ఎప్పటికైనా గొప్ప చిత్రకారులు కావాలని తెగ కలలు కనేవారు. కానీ ఎలా? దానికి సంబంధించిన సామాగ్రిని కొనుక్కోవడానికి కానీ, చదువులు చదువుకోవడానికి కానీ తమ తండ్రికి స్తోమత లేదన్న విషయం వారికి తెలుసు.
కానీ మనసులో ఆశ మాత్రం చావడం లేదయ్యే! ఏం చేసేది? అందుకని రాత్రింబగళ్లూ తెగ ఆలోచించిన మీదట చివరికి ఓ ఉపాయం తట్టింది. వాళ్లలో ఒకరు దగ్గరలో ఉన్న గనులకి పోయి కష్టపడాలి. అలా కష్టపడగా వచ్చిన సొమ్ముతో మరొకరు అకాడమీకి వెళ్లి చిత్రలేఖనంలో అన్ని మెలకువలూ నేర్చుకోవాలి. చదువు పూర్తికాగానే అతను రెండో వ్యక్తి కూడా చిత్రలేఖనంలో విద్యని అభ్యసించేందుకు సాయపడాలి. ఇదీ ఒప్పందం. కానీ ఇందులో ఎవరు ముందుగా వెళ్లాలి అని తేల్చుకునేందుకు బొమ్మాబొరుసు వేసుకున్నారు. అందులో ఆల్బెక్ట్ అకాడమీకి వెళ్లేట్లు, ఆల్బర్ట్ గనులలోకి వెళ్లేట్లు తేలింది. చూస్తూ చూస్తుండగా రోజులు గడిచిపోయాయి. ఆల్బెక్ట్ అకాడమీకి వెళ్లీ వెళ్లగానే గొప్ప చిత్రకారుడిగా పేరు తెచ్చుకున్నాడు. మరో పక్క ఆల్బర్ట్ గనులలోకి వెళ్లి పని చేస్తూ వచ్చిన సొమ్ముని వచ్చినట్లు ఆల్బెక్ట్ కోసం పంపించసాగాడు.
చూస్తూ చూస్తుండగానే నాలుగేళ్లు గిర్రున గడిచిపోయాయి. ఆల్బెక్ట్ దూరతీరాల నుంచీ విజయోత్సాహంతో ఇంటికి తిరిగి వచ్చాడు. అతని రాక సందర్భంగా ఇంటిల్లపాదీ ఒక గొప్ప వేడుకని ఏర్పాటు చేశారు. ‘ఆల్బర్ట్! ఇన్నాళ్లూ నీ త్యాగపు పునాది మీద నేను ఎదిగాను. ఇక నీ వంతు. నాకు ఇప్పడు కావల్సినంత పేరు వచ్చింది. నేను ఇప్పడు ఒక చిత్రాన్ని గీసి అమ్మితే చాలు లక్షలు చెల్లించేందుకు జనం సిద్ధంగా ఉన్నారు. అందుకని నువ్వు ఎంత గొప్ప అకాడెమీలో అయినా చదువుకోవచ్చు.’ అన్నాడు ఆల్బెక్ట్ సంతోషంగా. కానీ అతని మాటలకు అక్కడివారి మొహాలన్నీ వాడిపోయాయి. అప్పటిదాకా సందడిగా ఉన్న వేడుక కాస్తా నిశ్శబ్దంగా మారిపోయింది.
అందరిలోనూ కొట్టొచ్చినట్లు ఏదో బాధ! అలా కొన్ని నిమిషాలు భారంగా గడిచిన తరువాత ఆల్బర్ట్ ఇలా అన్నాడు ‘ప్రియమైన సోదరా! నేను గనిలోకి వెళ్లిన మొదటి నెలలోనే నాకు ఒక విషయం అర్థమైపోయింది. అక్కడ కొన్నాళ్లపాటు పని చేస్తే నా చేతులు ఎందుకూ పనికిరావని. అప్పుడే చిత్రాకారుడు కావాలన్న నా ఆశలని వదిలేసుకున్నాను. నేను సాధించలేని లక్ష్యాన్ని నువ్వు సాధిస్తావన్న తపనతోనే ఇన్నాళ్లూ కష్టపడ్డాను. భయపడినట్లుగానే నా చేతులు ఇప్పడు ఎందుకూ పనికి రాకుండా పోయాయి. నా పదివేళ్లలోని ప్రతి వేలూ ఏదో ఒక సందర్భంలో చితికిపోయింది.
కీళ్లవ్యాధితో నా వేళ్లు వంగలేని స్థితికి వచ్చాయి.’ అన్నాడు తన చేతులని ఎత్తి చూపుతూ!
గనిలో చాకిరీ చేసి చితికిపోయిన తన సోదరుడి వేళ్లను చూసి ఆల్బెక్ట్‌కి నోట మాట రాలేదు. ‘ఆల్బర్ట్! నువ్వు చిత్రకారుడివి కాలేకపోవచ్చు. కానీ నేను గీసే ప్రతి బొమ్మలోనూ నీ త్యాగం నిలిచి ఉంటుంది’ అన్నాడు కన్నీళ్లతో. అన్నాడే కానీ ఎన్ని చిత్రాలు గీసిన తన సోదరుడి త్యాగానికి గుర్తుగా ఇంకా ఏదో చేయాలన్న తపన తీరలేదు ఆల్బెక్ట్‌కి. ఎంతో ఆలోచించిన మీదట ఏదాది పాటు శ్రమించి ఆల్బర్ట్ చేతులని ఉన్నవి ఉన్నట్లుగా చిత్రించాడు. ఆ చిత్రాన్ని జనం ‘ప్రార్థించే చేతులు’ (praying hands) అన్న పేరుతో పిలవసాగారు. నిజమే మానవత్వం కంటే గొప్ప ప్రార్థన మరేముంటుంది!
- నిర్జర.