అష్టావక్రుడు

నైమిషారణ్యం - 16

 



సకల విద్యావంతుడైన ఏకపాదునకు, సుజాతకు జన్మించిన వాడే అష్టావక్రుడు. ఏకపాదుడు గురుకులాన్ని నడుపుతూ, విద్యార్థులకు వేదవిద్య బోధించేవాడు. అయితే, విద్య బోధించే విషయంలో చాలా కఠినంగా ఉండేవాడు. ఈ విషయంలో నిద్రాహారాలు కూడా లెక్కచేసేవాడు కాదు. ఏకపాదునకు  వివాహమై చాలాకాలం వరకూ సంతానం కలుగలేదు. ఎన్నో నోముల ఫలితంగా సుజాత గర్భవతి అయింది. ఏకపాదుని ఆనందానికి అవధులు లేవు. సుజాతకు నెలలు నిండుతున్నాయి.

ఒకరోజు ఏకపాదుడు నిద్రాహారాలు కూడా లెక్కచేయకుండా తన శిష్యులచేత వేదాధ్యయనం చేయిస్తున్నాడు. విద్యార్థులు అలసిపోతున్నారు... అయినా గురువుకు భయపడి వేదాన్ని అభ్యసిస్తూనే ఉన్నారు. ఇది సుజాత గర్భంలో పెరుగుతున్న శిశువుకు బాధాకరంగా తోచింది. వెంటనే తన తండ్రితో ‘ తండ్రీ.., ఏమిటీ విద్యాబోదన ? శిష్యులు నిద్రాహారాలు లేక సొలసిపోతున్నారు. వారి ఆరోగ్యం పాడవుతోంది.ఈ విదమైన విద్యావిధానాన్ని మార్చుకో ’ అని గర్భంలోంచే సలహా ఇచ్చాడు. ‘తనకు పుట్టబోయే కుమారుడు.., తనకు సలహాయిచ్చేంత గొప్పవాడా’ అని ఏకపాదుడు అహంకరించి, ఆ గర్భస్థ శిశువును ఉద్దేశించి.. ‘నీ జన్మకు కారణభూతుడనైన తండ్రినే విమర్శించేంత ఘనుడవా నీవు ? వేదాధ్యయనమునకు వక్రముగా గురువునే విమర్శించిన పాపానికి ప్రతిఫలంగా నీవు ‘అష్టావక్రుడు’గా జన్మించు’ అని కోపంగా శపించాడు. ఆ గర్భస్థ శిశువు తన తండ్రి శాపాన్ని ఆనందంగా స్వీకరించాడు.

సుజాతకు తొమ్మిది నెలలు నిండాయి. ప్రసవ సమయం దగ్గర పడిందని., ఇక రెండు మూడు రోజులలో శిశు జననం జరుగుతుందని గ్రహించాడు ఏకపాదుడు. ప్రసవ సమయానికి అవసరమైన తిలలు, ఘృతము, ఇతర ధాన్యములు సంపాదించే నిమిత్తం ఏకపాదుడు జనకుని రాజ్యానికి వెళ్ళాడు. అక్కడ అనుకోని విధంగా వరుణుని కుమారుడైన వందితో వాదానికి దిగి ఓడిపోయాడు. పోటీ నియమానుసారం వంది.., ఏకపాదుని జల మధ్యంలో బంధించాడు. సరిగ్గా ఆ సమయంలోనే సుజాత., తన అన్న అయిన ఉద్దాలకుని ఇంట ఒక మగ శిశువును ప్రసవించింది. అయితే తండ్రి శాపానుసారం ఎనిమిది వంకరలు గల దేహంతో జన్మించాడు. అందుచేతనే అతనికి  ‘అష్టావక్రుడు’ అని పేరు వచ్చింది.

ఉద్దాలకుడు తన కుమారుడైన శ్వేతకేతునకు, అష్టావక్రునకు సమంగా వేదవిద్య నేర్పుతున్నాడు. ఒకరోజు అష్టావక్రుడు తన మేనమామ అయిన ఉద్దాలకుని తొడపైన కూర్చున్నాడు. అది చూసిన శ్వేతకేతువు గబగబా వచ్చి ‘నా తండ్రి తొడ మీద నేను కూర్చోవాలిగానీ., నువ్వెలా కూర్చుంటావు? వెళ్లి నీ తండ్రి తొడమీద కూర్చో.’ అని ఘర్షణకు దిగాడు. వెంటనే అష్టావక్రుడు తన తల్లి దగ్గరకు వెళ్లి ‘ అమ్మా..నా తండ్రి ఎక్కడ అని అడిగాడు’. ధన సంపాదనకై జనకుని సభకు వెళ్లారని చెప్పింది సుజాత. వెంటనే అష్టావక్రుడు జనకుని సభకు వెళ్లి., జరిగిన సంగతి తెలుసుకుని తన వాదనతో వందిని ఓడించి, తన తండ్రితో పాటు, గతంలో ఓడి బంధింపబడిన వారినందరినీ కూడా జలమధ్యం నుంచి విడిపించాడు. ఆ తర్వాత తన తండ్రిని తల్లికి అప్పగించి, తల్లికి ఆనందం కలిగించాడు.

అష్టావక్రునకు యుక్తవయస్సు వచ్చింది. వివాహం చేసుకో దలచి వదాన్యుని దగ్గరకు వెళ్లి అతని కుమార్తె అయిన ‘సుప్రధ’ను తనకు కన్యాదానంగా ఇమ్మని అర్థించాడు. వదాన్యుడు అతని శక్తిని పరీక్షింపగోరి ‘నీవు ఉత్తరదిశగా వెళ్లి, కుబేరుని పట్టణం దాటి, కైలాసగిరి చేరి, శివపార్వతులు సంచరించిన ప్రదేశం దాటి ముందుకు వెడితే ఒక స్త్రీ కనిపిస్తుంది. ఆమెను చూసి రా..అప్పుడు నా కుమార్తె ‘సుప్రధ’ నీకిచ్చి వివాహం జరిపిస్తాను’ అని పలికాడు.

అష్టావక్రుడు ఉత్తరదిశగా బయలుదేరాడు. ముందుగా కుబేర పట్టణం చేరాడు. కుబేరుడు అతనికి స్వాగతం పలికాడు. అష్టావక్రుడు, కుబేరుని ఇంట రంభ, ఊర్వసి, తిలోత్తమల నృత్యగానాలను ఆస్వాదిస్తూ ఒక సంవత్పరం అతిథిగా కాలం గడిపి, తిరిగి తన ప్రయాణం కొనసాగించి.. హిమాలయాలలో బంగారుమయమైన ఒక దివ్యభవనాన్ని చూసాడు. అక్కడ కొందరు సుందరీమణులు అష్టావక్రునకు స్వాగత మర్యాదలు జరిపి ఆ భవనంలోకి తీసుకుని వెళ్లారు. ఆ భవనంలోపల ఒక జగన్మోహిని చిరునవ్వుతో అష్టవక్రుని దగ్గకు వచ్చి ప్రేమగా అతనిని తన అభ్యంతర మందిరానికి తీసుకుని వెళ్లి, తన కోరిక తీర్చమని అర్థించింది. ‘తల్లీ.. నేను అస్ఖలిత బ్రహ్మచారిని. పరసతిని కూడుట ధర్మం కాదు. నన్ను విడిచిపెట్టు’ అని అర్థించాడు. ‘ఈ రాత్రికి మా ఆతిథ్యం స్వీకరించి వెళ్లండి’ అని కోరింది ఆ సుందరి.

అంగీకరించాడు అష్టావక్రుడు. తెల్లారింది. అష్టావక్రుడు ప్రయాణానికి సిద్ధమయ్యాడు. అప్పుడా జగన్మోహిని అతని దగ్గకు వచ్చి ‘ మహాత్మా...పరసతిని అనే కదా మీ అభ్యంతరం. నన్ను వివాహం చేసుకోండి. మీ సతిని అవుతాను. కాదనవద్దు.’ అని అర్థించింది. ‘అమ్మా...నీవు బాలవు. నీ వివాహ విషయంలో నీ తండ్రిగానీ, సోదరుడుగానీ నిర్ణయం తీసుకోవాలిగానీ.. నీకుగా నీవు స్వతంత్రించి నిర్ణయం తీసుకునే అధికారం నీకు లేదు. నిజం చెప్పు. నువ్వెవరు?’ అని ప్రశ్నించాడు అష్టవక్రుడు. ఆమె అతని దర్మనిష్ఠకు సంతసించి ‘మహామునీ..నేను ఉత్తరదిక్కాంతను. మిమ్ములను పరీక్షింపమని వదాన్యుడు నన్ను పంపాడు. ఈ    పరీక్షలో విజయాన్ని వరించారు. వెళ్లి సుప్రధను వివాహం చేసుకోండి.’ అని పలికింది. ఆ తర్వాత  సుప్రధ, అష్టావక్రుల వివాహం ఘనంగా జరిగింది.

- యం.వి.యస్.సుబ్రహ్మణ్యం 


More Purana Patralu - Mythological Stories