యదురాజు దత్తాత్రేయుడిని అడిగిన ప్రశ్న ఏంటి?
దత్తాత్రేయుడు దైవ స్వరూపం అయినా ఆయన జీవించిన కాలానికి ఆయన గొప్ప అవధూతగా పరిగణింపబడ్డాడు. అవదూత దత్తాత్రేయునికి, యదువంశ రాజుకు మధ్య ఒక ఆసక్తికరమైన సంవాదం జరిగింది. దాని సారాంశం ఇలా ఉంది.
ఒకసారి ధర్మ మర్మజ్ఞుడైన యదు మహారాజు త్రికాలజ్ఞుడు తరుణ వయస్కుడు అవధూత అయిన బ్రాహ్మణుడు దేశ పర్యటన చేస్తుండగా ఆయనను చూసి ఇలా ప్రశ్న వేశాడు.
"హే! బ్రాహ్మణోత్తమా! అవధూతాగ్రణీ! తమరు ఏ విధమైన కార్యమూ చేస్తున్నట్లు లేదు. కానీ తమకు గల అత్యంత నైపుణ్యమైన బుద్ధి విశేషాన్ని గమనిస్తే ఆశ్చర్యం కల్గుతుంది. ఇంత సూక్ష్మబుద్ధి తమకు ఎలా లభ్యమయిందో! ఇంత మహా విద్వాంసులై కూడా పసిబాలుడి వలె ప్రపంచంలో స్వేచ్చగా విలాసంగా విహరిస్తున్నారంటే దీనికి ఆధారం ఆశ్రయం ఏదై ఉంటుందో కదా. లోకంలో సహజంగా ప్రతివాడు ఎక్కువ కాలం బ్రతకాలి అనో, కీర్తి సంపద పొందాలనో, మహా శ్రీమంతుడు కావాలి అనో, శరీర సౌందర్య కాంతులు ఎక్కువ కావాలి అనో, లేక మరో అభిలాషతోనో, ధర్మ అర్థ కామ్య కర్మలు చేస్తుంటాడు. తత్త్వ జిజ్ఞాస కూడా ఈ కోరికలతోనే మొదలు పెడతాడు. కారణం లేకుండా ఎవ్వడు ఏ కార్యం చేయడు. నేను నిన్ను పరికిస్తున్నాను. తమరు కార్య నిర్వాహణలో సర్వ సమర్ధులు. తమరు మహా విద్వాంసులు. అన్నింటిలోనూ గొప్ప నైపుణ్యం గల మహా కవీశ్వరులు. తమ అదృష్టం భాగ్యరేఖలు సౌందర్య ప్రభలు ప్రశంసనీయంగా విరాజిల్లుతున్నాయి.
తమ వాగ్విన్యాసం అమృత రసభరితంగా ఉంది. మరి ఇలాంటి వారు జడ ప్రాయంగానూ ఉన్మత్తుడి గానూ ఏదో గాలి సోకినట్టు, దయ్యం తగిలినట్లు సంచరిస్తూ ఉంటారు. ఏ పనిచేయరు. ఏదీ ఆపేక్షించరు. లోకంలో ఎక్కువ మంది జనం కామలోభ దావాగ్నిలో పడి మాడి మసి అవున్నది. తమరిని చూస్తే అక్షరాల ముక్త పురుషుల లాగా ఉన్నారు. కామలోభ దావాగ్ని తాపం తమవైపుకే రాలేదు అనిపిస్తుంది. పెద్ద మదగజం వనంలో దావాగ్ని సోకగానే పరుగున వెళ్ళి గంగాజలం మధ్యలో దిగి చల్లగా ఉన్నట్లుంది తమస్థితి.
బ్రాహ్మణ ప్రవరా! తమరు భార్యా పుత్ర సంపదలతో కలిసి సంసార స్పర్శను ముట్టినట్లు లేదు. సంసార తాపరహితులు తమరు. తమరు సదా సర్వదా స్వ స్వరూపస్థిత ప్రజ్ఞావంతులు. తమకు ఇంతటి అనిర్వచనీయ ఆత్మానంద అనుభవస్థితి ఎలా కలిగిందా! అని అడిగి తెలుసుకొందామని జిజ్ఞాసగా ఉంది. దయచేసి నాపై కృపవహించి వివరించ వలసిందిగా ప్రార్థిస్తున్నాను అనుగ్రహించండి" అని యదు రాజు అవదూత దత్తాత్రేయుడిని అడిగాడు.
యదురాజు బుద్ధి శుద్ధమైనది. ఆయనకు బ్రాహ్మణ భక్తి అధికం. ఆయన అవధూతను సత్కరించి ఈ ప్రశ్న అడిగి శిరస్సు వంచి చేతులు కట్టుకొని నిలబడ్డాడు. అవధూత అయిన బ్రహ్మవేత్త ఇలా అన్నాడు. యదురాజా! నేను నా బుద్ధి బలం ద్వారా చాలా మంది గురువులను ఆశ్రయించాను. వారి వారి నుండి విద్యా బుద్ధులు గ్రహించాను. ఆ ఫలితంగా ఇపుడు ఈ జగత్తులో ముక్త భావంతో స్వచ్ఛందంగా విహరించ గలుగుతున్నాను అని చెప్పాడు.
◆నిశ్శబ్ద.