సత్రాజిత్తు కథ తెలుసా?

గాంధారి, మాద్రి వీళ్ళిద్దరూ క్రోష్టరాజుకు భార్యలు. గాంధారికి శత్రువిజయి అయిన అనమిత్రుడు పుత్రుడు. యుధాజిత్తు, దేవమీఢుడు మాద్రికి పుత్రులు. అనమిత్రుని కొడుకు నిఘ్నుడు. ఇతనికి ఇద్దరు పుత్రులు ప్రసేనుడు, సత్రాజిత్తు.  ప్రసేనుడు ద్వారకాపట్టణంలో ఉన్నపుడు సత్రాజిత్తు సముద్రంనుంచి శ్యమంతక మణిని పొందాడు. 


సూర్యుడికి మిత్రుడు సత్రాజిత్తు, ఒకనాడు చీకటితో స్నానాదు లను పూర్తిచేసి రథంమీద కూర్చొని సూర్యుని స్తోత్రం చెపుతూ సముద్రం ఒడ్డున ఉన్నాడు. సూర్యుడు అప్పుడు ఎదురుగా వచ్చి నిలిచాడు. అప్పుడు సత్రాజిత్తు "మహాత్మా! నేను నిత్యమూ నిన్ను చూస్తున్నాను. నీతో స్నేహం వల్ల నాకేం ప్రయోజనం కలిగింది?" అని అడిగాడు. సూర్యుడతని మాటవిని శ్యమంతకమణిని తన కంఠంనుంచి తీసి రహస్యంగా ఉంచాడు. సత్రాజిత్తు సూర్యుడితో కబుర్లు చెప్పి వెళ్ళేటప్పుడు "మహానుభావా! లోకాన్ని ప్రకాశింపచేసే మీ మణిని నాకివ్వండి" అని అడిగాడు. సూర్యుడు మణిని అతనికిచ్చాడు.


సత్రాజిత్తు ఆ మణిని ధరించి తన పట్టణానికి వచ్చాడు. పట్టణంలో ప్రజలు సూర్యుడే వస్తున్నాడని నలువైపులకూ పరుగెత్తారు. ఇలా ద్వారకానగరాన్ని ఆశ్చర్య పరుస్తూ తన ఇంటికి వెళ్ళాడు. తరువాత సత్రాజిత్తు ఆ మణిని తన సోదరుడైన ప్రసేనజిత్తుకి ఇచ్చాడు. అప్పటినుండి వృష్టి, అంధకవంశాల వారి ఇళ్ళల్లో బంగారం వర్షం కురవటం ప్రారంభించింది. కావలసినపుడు వర్షాలు కురిసేవి. మనోవ్యధలు, వ్యాధులు నశించాయి. తరువాత శ్రీకృష్ణుడు ఆ మణిని పొందాలనుకున్నాడు. కాని తీసుకోలేదు. 


ఒకనాడు ప్రసేనుడు ఆ మణిని ధరించి వేటకు వెళ్ళాడు. అక్కడ ఒక సింహం అతన్ని చంపింది. ఆ మణిని చేతపట్టుకొని పారి పోతుండగా పెద్ద ఎలుగుబంటు ఆ సింహాన్ని చంపి మణిని తీసుకొని తన గుహలోకి వెళ్ళింది. మణికోరి శ్రీకృష్ణుడే ప్రసేనుని చంపి ఉంటాడని వృష్టి అంధక వంశం వీరులు అనుకోవడం ప్రారంభించారు.


శ్రీకృష్ణుడు వారి అపోహను తొలగించడానికై మణిని వెదకటానికి ప్రతిజ్ఞ చేశాడు. ప్రసేనుని అడుగుల గుర్తులు చూస్తూ అడివికి వెళ్ళాడు. అతనితో సేవకులు కూడ చాలామంది వెళ్ళారు. చాలాచోట్ల వెతకగా చివరకు ఒకచోట ప్రసేనుడు గుర్రంతో పాటు చచ్చిపడి ఉన్నాడు. అతనివద్ద మణిలేదు. తరువాత దగ్గరలోనే ఒక సింహం చచ్చిపడి ఉంది. అక్కడ ఎలుగుబంటి అడుగుల గుర్తులు కనబడ్డాయి. అప్పుడు ఆ గుర్తులబట్టి శ్రీకృష్ణుడు గుహవద్దకు వెళ్ళాడు. గుహలోపల స్త్రీల మధురవాక్కు వినిపించింది. ఒకదాది ఎలుగుబంటి శిశువును ఆడిస్తోంది. పిల్లవాడు ఏడుస్తున్నాడు. అతన్ని ఓదార్చటానికి దారి చెపుతోంది. "సింహం ప్రసేనుణ్ణి చంపింది. సింహాన్ని జాంబవంతుడు చంపాడు. ఓ సుకుమార! ఏడవకు, నీదే "యీమణి" అని. 


ఈమాటలు విని శ్రీకృష్ణుడు, బలరాముడు మొదలగువారిని గుహ వెలుపల నుంచి తానొక్కడే గుహలో ప్రవేశించాడు. అక్కడ జాంబవంతుడు కృష్ణుని చూచి అతనితో యుద్ధానికి దిగాడు. ఇరవైయొక్క రోజులు వరకూ ఇద్దరికీ బాహుయుద్ధం జరిగింది. ఆలస్యం కావటంచేత బలరాముడు మొదలైన యాదవులు ద్వారకా నగరానికి తిరిగి వెళ్ళారు. కృష్ణుడు చచ్చిపోయాడని చాటింపు వేశారు. శ్రీకృష్ణుడు మహాబలవంతుడైన ఎలుగుబంటిని (జాంబవంతుని) ఓడించి శ్యమంతక మణిని, భల్లూకరాజు కూతురు జాంబవతిని స్వీకరించాడు. శ్రీకృష్ణుడ తన అపవాదును పోగొట్టుకొనుటకు ఆ మణిని సాత్వతవంశీయుల సమక్షంలో సత్రాజిత్తుకు ఇచ్చివేశాడు. సత్రాజిత్తుకు పదిమంది భార్యలు. కుమార్తెలు ముగ్గురు- స్త్రీరత్నమైన సత్యభామ, ప్రతిని, ప్రస్వాపిని. ఈ ముగ్గురినీ శ్రీకృష్ణుడికి భార్యలుగా ఇచ్చాడు. ఇదీ సత్రాజిత్తు కథ..


                                       ◆నిశ్శబ్ద.


More Purana Patralu - Mythological Stories