మఘ, పూర్వఫల్గుని, ఉత్తరఫల్గుని 1వ పాదము (మ, మి, ము, మె, మో, ట, టి, టు,టే )
ఆదాయం : 11, వ్యయం : 11 - రాజపూజ్యం : 3, అవమానం : 6
వీరికి ఈ సంవత్సరమంతయు శని, సప్తమ అష్టమ రాశులయందు సంచరించుటచే అనూకూలుడు కాదు. కొన్ని ఇబ్బందులు కలుగవచ్చును. స్వజనవిరోధము, చోరాగ్ని బాధలు, ఆరోగ్యలోపములు, అకాల భోజనములు, ధనవ్యయము, ప్రమాదములు, అపనిందలు, గౌరవహాని కలుగును. చైత్రము మరియు వైశాఖ శుక్లమందు, కార్తికము మరియు మార్గశిర శుక్లమందు గురువు దశమ వ్యయరాశులయందు సంచరించుటచే, వృత్తి ఉద్యోగ వ్యాపారములయందు తరచుగ చిక్కులు, ఆస్తిని కోల్పోవుట, గౌరవభంగం, ధనవ్యయము కలుగును. మిగిలిన సమయమందు గురువు ఏకాదశమందు సంచరించుటచే పరిస్థితులు అనుకూలించును. సంతానవృద్ధి, నూతనముగా ఆరంభించిన కార్యములు.
నెరవేరుట, గౌరవము, చేసిన ప్రయత్నములు ఫలించుట కలుగుటచే, ఉత్సాహముగ నుండును. కీర్తివృద్ధి, బలము, తేజస్సు, విరోధినాశనము కలుగును. రాహువు సప్తమ అష్టమ రాశులలో, కేతువు ద్వితీయ జన్మరాశులలో సంచరించుటచే అకారణ కలహములు, అపనిందలు, చతుష్పాజ్జంతువుల వలన పీడ కలుగును. వృథా వ్యయములు, వృథా వైరములు కలుగును. తరచుగ ఇబ్బందులు, ఆరోగ్యలోపములు, కళత్రవర్గములో పేచీలు ఏర్పడును. మొదట ఆరు మాసములు కుజుడు వ్యయ జన్మ ద్వితీయరాశులయందు సంచరించుటచే జాగ్రత్త అవసరము. మఘ వారికి, సంవత్సరారంభమున, తిరిగి భాద్రపద బహుళం నుండి మాఘ పూర్వార్ధం వరకు నైధనతారయందు శని, సంవత్సరారంభం నుండి కార్తిక బహుళం వరకు నైధనతారయందు రాహువు సంచరించుదురు. పూర్వఫల్గుని వారికి, వైశాఖ బహుళం నుండి భాద్రపద బహుళం వరకు, తిరిగి మాఘ బహుళం నుండి సంవత్సరాంతం వరకు నైధనతారయందు శని, ఆషాఢ బహుళం నుండి సంవత్సరాంతం వరకు జన్మతారయందు కేతువు సంచరించుదురు. ఉత్తరఫల్గుని వారికి, సంవత్సర ప్రారంభం నుండి ఆషాఢ బహుళం వరకు జన్మతారయందు కేతువు సంచరించును. మొత్తము మీద వీరు ఈ సంవత్సరము శని రాహు కేతు కుజులకు శాంతియొనర్చిన మేలు. ఆదిత్యహృదయ పారాయణము, సప్తశతీ పారాయణము, సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారి పూజతో పాటు పరమేశ్వర ప్రీతిగ ప్రతినెల తమ జన్మనక్షత్రము నాడు, మాసశివరాత్రియందు ఏకాదశ రుద్రాభిషేకము చేయించిన సమస్యలు తొలగి శాంతి చేకూరును.
