శిశుపాలుడు చేసిన వంద తప్పులేమిటి?

Shishupala and 100 Sins

 

శ్రీకృష్ణుని మేనత్త కొడుకు శిశుపాలుడు. చేది దేశపు రాజు. దగ్గరి చుట్టరికం ఉన్నప్పటికీ కృష్ణుడిమీద ప్రేమాభిమానాలనేవి లేవు. పైగా నిరంతరం కృష్ణుని ద్వేషిస్తూ ఉంటాడు. అవకాశం దొరికితే చాలు అవమానిస్తూ ఉంటాడు.

శిశుపాలుని ఆగడాలు చూసీచూసీ విసిగిపోసిన కృష్ణుడు ఒక సందర్భంలో దండించబోయాడు. అప్పుడు శిశుపాలుని తల్లి, కృష్ణుని మేనత్త అడ్డుపడి, "ఆగు కృష్ణా.. నా ముఖం చూసి అయినా శిశుపాలుని క్షమించు..'' అంది.

కృష్ణుడు కోపాన్ని తమాయించుకుని, ''అత్తా, నువ్వు చెప్పావు కనుక ఆగుతున్నాను.. నీమీది గౌరవంతో నీ కొడుకు తప్పులను నూరుసార్లు సహిస్తాను. ఆపైన మాత్రం సహించేది లేదు.. ఇక అతడు శిక్ష అనుభవించక తప్పదు'' అన్నాడు. అలా జరిగాక అయినా శిశుపాలుని వైఖరిలో మార్పు లేదు. తప్పులు చేస్తూనే ఉన్నాడు. సమయం సందర్భం లేకుండా శ్రీకృష్ణుని అవమానిస్తూనే ఉన్నాడు.

ధర్మరాజు తలపెట్టిన యాగం నిర్విఘ్నంగా పూర్తయింది. యజ్ఞశాల ఆకులు, పూవులు, దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకృతమైంది. ఎక్కడ చూసినా తీర్చిదిద్దిన ముగ్గులు, కళాకృతులతో ఉజ్వలంగా వెలిగిపోతోంది. పూవులు, సుగంధ ద్రవ్యాల పరిమళాలతో వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. వివిధ వాయిద్యాల సమ్మోహన స్వరాలూ, గాయనీగాయకుల మధుర గానామృతంతో సందడిగా,కోలాహలంగా ఉంది.

యాగం ముగిసింది కనుక తృప్తిగా దానధర్మాలు చేయాలనుకున్నారు. అంతకంటే ముందు భీష్మ పితామహుడు తొలి తాంబూలం శ్రీకృష్ణునికి ఇవ్వమని యుధిష్ఠిరునికి చెప్పాడు. ధర్మరాజు మనసులో ఉన్నది కూడా అదే ఆలోచన కనుక చిరునవ్వుతో తల పంకించి శ్రీకృష్ణునికి అర్ఘ్య పాద్యాదులు ఇచ్చి, అగ్రతాంబూలం సమర్పించాడు. అందుకు దేవతలు హర్షించారు. విరుల జల్లు కురిపించారు.

అయితే శ్రీకృష్ణునికి ధర్మజుడు అగ్రతాంబూలం ఇవ్వడం శిశుపాలునికి ఎంతమాత్రం రుచించలేదు. అసూయాద్వేషాలు మానసును దహింపచేయగా ''ఎందరో పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, వృద్దులు, త్యాగశీలురు, ధైర్యపరాక్రమాలకు మారుపేరైన క్షత్రియులు, మరెందరో ఉత్తములు ఉండగా ప్రథమ తాంబూలం ఇవ్వడానికి శ్రీకృష్ణుడే కనిపించాడా? కృష్ణుడు ఒక యాదవుడు, పశువుల కాపరి అని మర్చిపోయారా? ఇంతకంటే తెలివితక్కువ పని ఇంకొకటి ఉంటుందా? అగ్ర తాంబూలం ఇవ్వడానికి ఇంత అయోగ్యుడిని ఎంచుకుంటారా? ఇది తక్కినవారికి ఎంత అవమానం కలిగిస్తుందో అర్ధం చేసుకునేపాటి విచక్షణ కూడా లేదా?'' అంటూ ఆగ్రహావేశంతో చిందులు తొక్కాడు.

ధర్మరాజు శిశుపాలునికి నచ్చజెప్పేందుకు ఎంతగానో ప్రయత్నించాడు. కానీ శిశుపాలుడు ఆ మాటలు విని అర్ధం చేసుకునే స్థితిలో లేడు.

''భీష్మాచార్యుడు ముసలితనంతో మతి కోల్పోయాడు. ఆయనకు విచక్షణ నశించింది.. సరే, నీకు ఏమయింది? ఆయన ఔచిత్యం లేని పనికిమాలిన సలహా ఇస్తే.. దాన్ని నువ్వు అనాలోచితంగా పాటిస్తావా? కొంచెమైనా బుద్ధి ఉపయోగించి ఆలోచించవా? ధర్మరాజా నువ్వేదో ప్రశాంతంగా ఉంటావు.. తెలివిగా ఆలోచిస్తావు అనుకున్నాను.. కానీ, నువ్వు కూడా మతి లేకుండా ప్రవర్తిస్తావని ఇప్పుడే స్పష్టమైంది.. సరే, భీష్మాచార్యుడికి, నీకూ కూడా బుద్ధి మందగించింది.. ఏదో, తెలివితక్కువగా కృష్ణునికి అర్ఘ్యపాద్యాదులు ఇవ్వడానికి సిద్ధమయ్యారు.. కనీసం అనుడుకునేవాడికైనా బుద్ధి ఉండాలా? ఇందరు మహామహులు ఉండగా నేను అగ్ర తాంబూలం అందుకోవడం ఏమిటి? అంతకంటే అనౌచిత్యం ఇంకోటి ఉండదని వారించాలా? తగుదునమ్మా అంటూ పుచ్చుకుంటాడా?!'' అంటూ అందరి సమక్షంలో కురువృద్ధుడైన భీష్మ పితామహుడు, ధర్మరాజు, శ్రీకృష్ణుడు - ముగ్గుర్నీ నోటికొచ్చినట్లు తూలనాడాడు.

ఈ సంఘటనతో శిశుపాలుని నూరు తప్పులు పూర్తయ్యాయి. ఇది నూట ఒకటో తప్పు. ఇక కృష్ణుడు దయచూపలేదు. ముందే చెప్పినట్లుగాశిశుపాలుని శిక్షించేందుకు సమాయత్తమయ్యాడు. సుదర్శన చక్రంతో శిశుపాలుని తల ఖండించాడు

 

shishupala, shishupal vadh, shishupal vadh mahabharat, shishupal vadh book, shishupal vadh story, shri krishna shishupal vadh, shrikrishna shishupal story telugu


More Purana Patralu - Mythological Stories