అరిసెలు సంక్రాంతికే ఎందుకు చేసుకుంటారు?

 

 

పండుగలంటే పెద్దవాళ్లు పూజలతో బిజీ అయిపోతారు, పిల్లలు ఆటలకి సిద్ధమైపోతారు. కానీ సంక్రాంతికి మాత్రం చిన్నాపెద్దా తేడా లేకుండా అందరూ... అరిసెల చుట్టూ మూగుతారు. ఏ పండుగలోనూ కనిపించని అరిసెలు ఒక్క సంక్రాంతికి మాత్రమే ఎందుకు గుర్తొస్తాయి ?


సంక్రాంతి అంటే పంటల పండుగ అని తెలిసిందే! ఈ సమయంలోనే ధాన్యం చేతికొస్తుంది. కానీ చేతికొచ్చిన ధాన్యాన్ని వాడుకోవడం కుదరదు. ఎందుకంటే కొత్తబియ్యం ఓ పట్టాన జీర్ణం కాదు. దాన్ని తినడం వల్ల కడుపునొప్పి ఖాయం. ఇదే సమయంలో మార్కెట్లోకి వచ్చే బెల్లం పరిస్థితీ ఇంతే! అందుకే కొత్తబియ్యాన్ని దంచి, దానికి కొత్త బెల్లాన్ని జోడించి అరిసెలు చేసుకుంటారు. బియ్యాన్ని దంచడం వల్ల, బెల్లాన్ని ముదురుపాకం పట్టడం వల్లా... ఇవి తేడా చేయవు.


ఆంధ్రాలో బెల్లం, బియ్యం కలిపి అరిసెలు చేసుకుంటే... తెలంగాణలో కేవలం బియ్యపు పిండితోనే సకినాలు చేసుకుంటారు. అరిసెలైనా, సకినాలైనా... వీటిలో నువ్వులు కూడా ఉండాల్సిందే! దీనికీ ఓ కారణం లేకపోలేదు. సంక్రాంతికి చలి చాలా ఎక్కువగా ఉంటుంది. రథసప్తమి నుంచీ నిదానంగా, ఉక్కపోత మొదలవుతుంది. ఇలా మారుతున్న వాతావరణానికి తగినట్లు మన శరీరాన్ని సిద్ధం చేసేందుకు... నువ్వులు ఉపయోగపడతాయి. అందుకే సంక్రాంతి జరుపుకొనే బీహార్‌, గుజరాత్‌, మహారాష్ట్ర, ఒడిషా, రాజస్థాన్‌లలో కూడా నువ్వులతో చేసిన పిండివంటలనే తింటారు.


తమిళనాడులో సంక్రాంతికి కొత్త బియ్యం, బెల్లాన్ని కలిపి చక్కెర పొంగలిని చేసుకుంటారు. అక్కడ సంక్రాంతిని ‘పొంగల్‌’ అని పిలుచుకోవడానికి కారణం ఇదే! ఒడిషాలో కూడా కొత్తబియ్యంతో చౌలా అనే పిండివంటను చేసుకుంటేనే సంక్రాంతి పూర్తయినట్లు లెక్క. ఒకే పండుగని దేశంలో చాలా చోట్ల చేసుకుంటున్నా... ప్రతి ప్రాంతంలోనూ ఒకేరకమైన ఆహారాన్ని ఉపయోగించి వేర్వేరు పిండివంటలు చేసుకోవడం ఒక్క సంక్రాంతికే కనిపిస్తుంది. అంటే మన పెద్దలంతా ఒకేలా ఆలోచించేవారన్నమాట!


సంక్రాంతికి అరిసెలతో పాటు గారెలు కూడా చేసుకుంటారు. ఇలా గారెలు వండుకోవడం వెనుక కూడా ఓ కారణం కనిపిస్తుంది. మినుములతో చేసే గారెలు, సంక్రాంతి సమయంలో ఉండే చల్లదనాన్ని ఎదుర్కొనేందుకు సాయపడతాయి. సంక్రాంతి తర్వాత మాఘమాసంలో మొదలయ్యే పొలం పనులు, పెళ్లిపనులలో పాల్గొనేందుకు.... తగినంత శక్తిని అందిస్తాయి. ఇదీ సంక్రాంతి పిండివంటలు చేసుకోవడం వెనుక ఉన్న కారణం!


More Sankranti