సంక్రాంతే కాదు... కనుమ కూడా ముఖ్యమే!
సంక్రాంతి ఒక్కరోజులో ముగిసిపోయే పండుగ కాదు. నాలుగు కాలాలు గుర్తుండిపోయేలా, నాలుగురోజులపాటు జరుపుకొనే పండుగ. సంక్రాంతి తొలి రెండు రోజులూ మనకోసం నిర్వహించుకునే పండుగలా సాగితే, కనుమనాడు మాత్రం మన చుట్టూ ఉన్న పశుపక్ష్యాదులనీ, పితృదేవతలనీ స్మరించుకుంటారు.
పశువుల పండుగ
వ్యవసాయ ఆధారితమైన మన దేశంలో అన్నదాతలకు తోడుగా నిలిచే ఎడ్లను ఎంతగా తల్చుకున్నా తక్కవే! అందుకే తమ కృతజ్ఞతను తెలుపుకునేందుకు కనుమ రోజు ప్రయత్నిస్తారు. సంక్రాంతి నాటికి పొలం పనులన్నీ పూర్తయిపోయి ఉంటాయి కనుక, పశువులు కూడా అలసిపోయి ఉంటాయి. ఇలా నిస్త్రాణంగా ఉన్న పశువులకు కాస్త బలాన్ని చేకూర్చేందుకు ఉప్పుచెక్క పేరుతో వాటికి ఔషధులతో కూడిన పొట్టుని తినిపిస్తారు. మరోవైపు పశువులనీ, వాటి కొట్టాలనీ శుభ్రపరుస్తారు. కొట్టాలను గోమయంతోనూ, పూలదండలతోనూ అలంకరిస్తారు.
కనుమనాడు పశువులను అలంకరించే తీరు గురించైతే చెప్పనే అక్కర్లేదు. కొమ్ములకు ఇత్తడి తొడుగులు, మూపురాల మీద పట్టుబట్టలు, కాళ్లకి చిరుగంటల గజ్జలు, మెడలో దండలు.. ఇలా తమ తనివితీరా పశువులని అలంకరించుకుంటారు. కేవలం ఎడ్లనే కాదు, తమ ఇళ్లలో పెంచుకునే కోళ్లూ, గొర్రెలు, మేకల వంటి జీవులను కూడా ఇదే తీరున శ్రద్ధగా గమనించుకుంటారు. అసలు ఎడ్లపందాలు, కోళ్లపందాలు, పొట్టేలు పందాలు వంటి సంబరాలన్నీ కూడా వీటికి ఆటవిడుపుగా మొదలపెట్టి ఉంటారన్న వాదనా ఉంది. కాకపోతే క్రమేపీ ఇవి హింసాత్మకధోరణకి మారడం దురదృష్టకరం. ఇంట్లో జీవులనే కాదు... ఇంటినిండా ధాన్యపురాశులు నిండిన ఈ శుభవేళ, చిన్నచిన్న పక్షులను కూడా గమనించుకోవాలన్న ఆచారం కనిపిస్తుంది. అందుకే ధాన్యపుకంకులను ఇంటి చూర్లకు వేడాలడదీస్తారు. వాటితో చిన్నచిన్న పిట్టలు తమ కడుపుని నింపుకోవడం కనిపిస్తుంది.
పితృదేవతల పండుగ
కనుకమనాడు తమ చుట్టూ ఉన్న జీవుల పట్ల సామరస్యంగా మెలగడం ఒక అంశమైతే, తమని విడిచిపోయిన పితృదేవతలని కూడా స్మరించుకోవడం కనిపిస్తుంది. ఇందుకోసం తర్పణాలు విడిచే అలవాటు అందరికీ ఉండదు కాబట్టి అన్నంముద్దలుగా చేసి ఆరుబయట ఉంచడమో, పితృదేవతలను తల్చుకుంటూ గారెలను వండుకోవడమో చేస్తుంటారు. ఊళ్లో ఎటు చూసినా తనకు సమృద్ధిగా తిండి లభిస్తోంది కాబట్టి కాకి ఇక ఎటూ కదలాల్సిన అవసరం ఉండదు. అందుకే కాబోసు ‘కనుమరోజు కాకి కూడా కదలదు’ అన్న సామెత వచ్చి ఉంటుంది. భోగి, సంక్రాంతి సమయాలలో ఇంటికి వచ్చిన కూతురూ, అల్లుడూ మరొక్కరోజు ఉంటే బాగుంటుంది అన్న అభిప్రాయంతో ఈ సామెతను మనుషులకు కూడా వర్తింపచేస్తారు. అలా ఇంటికి వచ్చిన బంధువులు కనుమనాడు పొలిమేర దాటకూడదు అని వారిస్తుంటారు.
కనుమరోజు మినుములు తినాలి అన్న సామెత వెనుక కూడా అనేక అంతర్థాలు కనిపిస్తాయి. పితృదేవతలను తల్చుకుంటూ గారెలు వండుకోవాలన్న సూచన ఇందులో కనిపిస్తుంది. అలాగే సూర్యుడు ఉత్తరాయణంలోకి మారే ఈ సమయంలో క్రమేపీ వాతావరణంలోని ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉంటాయి కాబట్టి, మినుములు అందుకు అనుగుణంగా శరీరాన్ని సంసిద్ధం చేస్తాయి. మినుములు తింటే ఒంట్లో వేడి పుడుతుంది. రాబోయే పనులకు తగిన సత్తువ లభిస్తుంది. మాఘమాసంలో జరగబోయే శుభకార్యాలకు అంతా కళకళలాడుతూ ఉంటారు.
కనుమతో పాటుగా ఇన్ని విశేషాలు ఉన్నాయి కాబట్టే, చాలా ప్రాంతాలలో అసలు కనుమనే పెద్ద పండుగా భావించడమూ కనిపిస్తుంది.
- నిర్జర