సంక్రాంతి రోజు ఈ పరిహారాలు పాటిస్తే ఐశ్వర్య ప్రాప్తి..!
.webp)
మకర సంక్రాంతి హిందువులకు చాలా ప్రముఖమైన పండుగ. ఈ పండుగను ఒక్కో రాష్ట్రంలో ఒక్కో పేరుతో పిలుస్తారు. ముఖ్యంగా ఈ పండుగ కాలమానంలో మార్పును స్పష్టంగా సూచిస్తుంది. సూర్యుడు ధనస్సు రాశి నుండి మకర రాశిలోకి ప్రవేశించడం ఈ పండుగలో కనిపించే ముఖ్యమైన మార్పు. ఇది మాత్రమే కాకుండా ఈ పండుగ సమయానికి రైతులకు పంట చేతికి వచ్చి వాటిని అమ్మి డబ్బు పోగు చేసుకోవడంతో కుటుంబం మొత్తం ఆనందాలతో నిండి ఉంటుంది. అదే విదంగా రైతులకు ఎంతగానో సహాయపడే పశు సంపదకు తగిన సత్కారం లభించేది కూడా సంక్రాంతి సందర్బంగా వచ్చే కనుమ రోజే. సంక్రాంతిని గాలి పటాల పండుగ అని కూడా అంటారు. ముఖ్యంగా సంక్రాంతి పండుగ రోజు కొన్ని పరిహారాలు పాటిస్తే ఐశ్వర్యం ప్రాప్తిస్తుందని చెబుతారు. ఆ పరిహారాలు ఏంటో తెలుసుకుంటే..
దాన దర్మాలు..
మకర సంక్రాంతి రోజు దాన దర్మాలు చేయడం చాలా మంచిదని చెబుతారు. కేవలం ఈరోజు మాత్రమే కాకుండా అన్ని రోజులలో దానానికి చాలా గొప్ప ప్రాధాన్యత ఉంది. కానీ సంక్రాంతి రోజు అయితే ఇది చాలా గొప్ప పుణ్యాన్ని కలిగిస్తుందని చెబుతారు. వీలైనంత వరకు పేదలకు, అవసరైమన వారికి, నిస్సహాయులకు దాన దర్మాలు చేయడం వల్ల లక్ష్మీ దేవి సంతోషిస్తుందని చెబుతారు.
నువ్వుల లడ్డు..
మకర సంక్రాంతి రోజు నువ్వుల లడ్డులను ప్రతి ఇంట్లో తయారుచేసి వాటిని ఇంట్లో లక్ష్మీ దేవికి నైవేద్యంగా పెట్టాలి. ఇది లక్ష్మీ దేవికి ఎంతో ప్రీతికరమైనవి.
లడ్డులు తయారు చేసేటప్పుడు ఆ లడ్డులలో రుపాయి లేదా రెండు రూపాయల నాణేలు ఉంచాలి. దీని వల్ల స్వయానా ఆ లక్ష్మీదేవిని ఆహ్వానించినట్టు అవుతుంది.
విరాళం..
కేవలం దానధర్మాలు, నువ్వుల లడ్డులు చేసుకోవడమే కాకాకుండా మకర సంక్రాంతి రోజు దేవాలయలకు విరాళం ఇవ్వడం కూడా చాలా మంచిదిగా పరిగణించబడుతుంది.
గోవులు..
లక్ష్మీ దేవి అనుగ్రహం కావాలంటే మకర సంక్రాంతి రోజు ముందుగా ఆవులకు స్నానం చేయించి , వాటికి పసుపు రాయాలి. అలాగే ఇంట్లో చిన్న గోవు బొమ్మ లేదా విగ్రహం వంటివి ఉన్నా వాటికి కూడా ఇలా చేయవచ్చు. ఇంట్లో గోవు విగ్రహాలు ఉంటే వాటికి పచ్చి పాలతో అభిషేకం చేసి, పసుపు రాసి లక్ష్మీ దేవి ముందు ఉంచాలి. ఇలా చేయడం వల్ల లక్ష్మీ దేవి సంతృప్తి చెందుతుంది.
దీపం..
మకర సంక్రాంతి రోజు లక్ష్మీ దేవి ముందు రెండు దీపాలు వెలిగించాలి. ఒక దీపాన్ని నువ్వుల నూనెతో, మరొక దీపాన్ని ఆవు నెయ్యితో వెలిగించాలి. ఇది ఐశ్వర్యాన్ని చేకూరుస్తుంది.
లక్ష్మీ గవ్వలు..
లక్ష్మీ గవ్వలను పూజించడం కూడా చాలా శ్రేష్టం. లక్ష్మీ గవ్వలను పచ్చి పాలతో అభిషేకం చేయించి వాటికి పసుపు రాసి లక్ష్మీ దేవి ముందు ఉంచాలి. దీని తరువాత ఇంటి గుమ్మం దగ్గర నువ్వుల నూనె దీపం వెలిగించాలి. పూజ అనంతరం లక్ష్మీ గవ్వలను భద్రపరచాలి.
నువ్వులు, బెల్లం..
సంక్రాంతి పండుగ రోజు చేసే దానాలలో నువ్వులు, బెల్లం తప్పక చేర్చడం ముఖ్యం. నువ్వులు, బెల్లాన్ని దానం చేయడం, దుప్పట్లను పేదవారికి దానం చేయడం వల్ల ఐశ్వర్యానికి మార్గం తెరచుకుంటుందని చెబుతారు.
గమనిక..
పైన పొందుపరిచిన విషయాలు జ్యోతిష్యులు వివిధ సందర్భాలలో పేర్కొన్నవి.
*రూపశ్రీ.



