సంక్రాంతి పండుగకు కొత్త అల్లుడిని ఎందుకు ఆహ్వానిస్తారంటే..!

సంక్రాంతి పండుగ సందర్భంగా తెలుగు రాష్ట్రాలలో కొత్త అల్లుడిని అంటే.. పెళ్లైన తరువాత వచ్చే మొదటి సంక్రాంతి పండుగకు తప్పకుండా కొత్త అల్లుడు ఇంటికి రావాలని చెబుతారు.  అసలు ఇది నిజంగా సంప్రదాయమేనా? దీని వెనుక ఉన్న కారణం ఏంటి? కూతురిని, అల్లుడిని  పిలవడం వెనుక ఉన్న అసలు నిజాలు ఏంటి?  తెలుసుకుంటే..

కొత్త అల్లుడికి ఆహ్వానం..

సంక్రాంతి పండుగ తర్వాత కొత్త అల్లుడిని పిలవడం వెనుక సామాజిక కారణాలు ఉన్నాయి. కొత్తగా పెళ్లైన తర్వాత కూతురు అత్తారింట్లో ఉంటుంది.  కూతురు తన పుట్టింటికి వచ్చి తల్లిదండ్రులతో సమయం గడపడానికి ఇది గొప్ప మార్గం అవుతుంది. అంతేకాదు.. అల్లుడు అత్తవారింటికి వచ్చి  పండుగలో పాల్గొనడం ద్వారా రెండు కుటుంబాల మధ్య, ముఖ్యంగా అత్తారింటితో అల్లుడి బందం బలపడుతుంది.  ఈ కారణంగా అల్లుడిని పిలుస్తారు.

అంతేకాదు.. సంక్రాంతి పండుగ సందర్భంగా అల్లుడికి బహుమానాలు ఇవ్వడం,  కొత్త బట్టలు పెట్టడం వంటివి కూడా చేస్తారు.  గోదావరి జిల్లాలలో కొత్త అల్లుడికి జరిగే మర్యాదలు,  వారి కోసం చేసే వంటలు చాలా గొప్పగా ఉంటాయి.  ఇవన్నీ అల్లుడితో తమకు బంధాన్ని బలపరిచేవే. పైగా సంక్రాంతి పండుగకు పంటలు చేతికి వచ్చి,  చేతిలో ధనంతో ఆర్థికంగా బాగుంటారు.  ఈ కారణంగా అల్లుడిని, కూతురిని పిలిచి వారితో సంతోషంగా గడిపే అవకాశం ఉంటుంది.

పురాణ కారణాలు..

సంక్రాంతికి అల్లుడు రావడం వెనుక ఆధ్యాత్మిక, పురాణ కారణాలు కనిపిస్తాయి. కానీ ఎక్కడా పురాణ కథనాలు మాత్రం లేవు.  సాధారణంగా అల్లుడిని లక్ష్మీనారాయణ స్వరూపంగా భావిస్తారు.  ఈ కారణంగానే కన్యాదానం చేసేటప్పుడు కూడా ఆడపిల్ల తన కూతురిని లక్ష్మీ దేవిగా భావించి, అల్లుడిని నారాయణ స్వరూపంగా భావించి  అల్లుడికి కాళ్లు కడిగి, కన్యాదానం చేసి అల్లుడికి కూతురిని అప్పగిస్తాడు.  దీని ప్రకారం చూస్తే.. అల్లుడు నారాయణ స్వరూపం.  అతను అత్తవారింటికి వస్తే సాక్షాత్తు నారాయణుడే తమ ఇంటికి వచ్చినట్టు భావించాలట.  

సంక్రాంతి పండుగ ఉత్తరాయణంలో వస్తుంది. ఉత్తరాయణం దేవతలకు పగటి కాలం. ఈ కాలంలో చేసే దానాలు,  సత్కారాలు,  వందరెట్లు ఫలితాలు ఇస్తాయని నమ్ముతారు.  అందుకే ఉత్తరాయణంలో వచ్చే తొలి పండుగ అయిన సంక్రాంతి రోజు విష్ణు స్వరూపుడు అయిన అల్లుడికి బట్టలు పెట్టడం ద్వారా వస్త్రదానం,  భోజన సత్కారం,  కానుకలు ఇవ్వడం ద్వారా సాక్షాత్తు ఆ నారాయణుడినే సత్కరించిన పుణ్యం కలుగుతుందట. అంతేకాదు.. పురాణ నమ్మకాల ప్రకారం కుమార్తెతో కలిసి అల్లుడు పుట్టింటికి వచ్చినప్పుడు అతడిని గౌరవించి, సత్కరించడం ద్వారా పితృదేవతలు సంతోషిస్తారట.  వంశానికి ఆయుష్షు,  సంపద కూడా కలుగుతాయట. ఇదీ అల్లుడు సంక్రాంతి వండుగకు అత్తవారింటికి రావడం వెనుక ఉన్న కారణాలు.

                           *రూపశ్రీ.


More Sankranti