భారతదేశంలో సంక్రాంతి పండుగను ఏ ప్రాంతంలో ఎలా జరుపుకుంటారో తెలుసా?
సంక్రాంతి పండుగ తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎంతో గొప్పగా జరుపుకునే పండుగ. ఈ పండుగ నాటికి రైతులు వేసిన పంటలు పండి ధాన్యం ఇంటికి చేరుతుంది. రైతన్నల కళ్లలో పంట చేతికి వచ్చిన ఆనందం వెల్లివిరుస్తుంది. రైతుల కష్టంలో తాము భాగమై పశువులు కూడా ఈ పండుగనాడు ప్రాముఖ్యత సంతరించుకుంటాయి. రైతులు తమ కుటుంబంలో భాగంగా చూసుకునే పశు సంపదను గొప్పగా అలంకరించి వాటికి కృతజ్ఞత తెలుపుకుంటారు. అయితే సంక్రాంతి కేవలం తెలుగు రాష్ట్రాలలోనే కాదు.. దేశం యావత్తు జరుపుకుంటారు. ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా జరుపుకుంటారు. ఈ విషయాలు తెలుసుకుంటే..
ఉత్తరభారతదేశం..
ఉత్తర భారతదేశంలో సంక్రాంతిని ఖిచ్డీ అని పిలుస్తారు. పండుగ సందర్బంగా జాతరలు నిర్వహిస్తారు. నువ్వులతో స్వీట్లు తయారుచేస్తారు. ఈ రోజున దానం చేస్తే అది ఎంతో గొప్ప పుణ్యాన్ని ఇస్తుందని నమ్ముతారు. అందుకే ఈ రోజున మినప్పప్పు, బియ్యం, నువ్వులు, నూలు బట్టలు దానం చేస్తారు.
దక్షిణ భారతదేశం..
దక్షిణ భారతదేశంలో ఈ పండుగ నాలుగు రోజుల పాటు ఉంటుంది. దీన్ని పొంగల్ అని పిలుస్తారు. పండుగ ముందు రోజు భోగి, భోగి సందర్బంగా భోగి మంటలు, పిల్లలకు భోగి పండ్లు పోస్తారు. పండుగ సందర్భంగా మట్టికుండలో పాలు, బియ్యం, బెల్లం, కొత్త చెరకు రసంతో పొయ్యి మీద పొంగలి వండుతారు. ప్రతి ఇంటి ముందు పెద్ద పెద్ద ముగ్గులు వేస్తారు. ముగ్గులను రంగులతో ఆకర్షణీయంగా మెరుగులు దిద్దుతారు. చెరకు గడలు, నాగలి, గుమ్మడి కాయలు ఈ పండుగలో ప్రధానంగా ఉంటాయి. ముఖ్యంగా పశువులను పూజించి, వాటిని తగిన గౌరవం కల్పిస్తారు.
పంజాబ్, హర్యానా..
పంజాబ్, హర్యానా రాష్ట్రాలలో సంక్రాంతి పండుగను మాఘి అని అంటారు. ఈ పండుగ పురస్కరించుకుని లోహ్రిని జరుపుకుంటారు. సంక్రాంతి పండుగ ముందు రోజు లోహ్రి జరుపుకుంటారు. ఈ రోజున ప్రజలందరూ ఒకచోట చేరి పెద్ద ఎత్తున భోగి మంటలు వెలిగించి దాని చుట్టూ తిరుగుతూ పూజలు చేస్తారు. ఈ సమయంలో నే భ్రాంగ్రా, గిద్దా నిర్వహిస్తారు.
రాజస్థాన్, గుజరాత్..
రాజస్థాన్, గుజరాత్ లలో మకరసంక్రాంతిని ఉత్తరాయణం అని అంటారు. గుజరాత్ లో దీన్ని చాలా వైభవంగా జరుపుకుంటారు. పండుగ రోజు గుజరాత్ లో గాలిపటాల పండుగ నిర్వహిస్తారు. జనవరి 14ను ఉత్తరాయణం అని, జనవరి 15ను వాసి-ఉత్తరాయణం అని అంటారు.
అస్సాం..
అస్సాంలో మకర సంక్రాంతిని మాగ్ బిహు అని పిలుస్తారు. దీనిని భోగాలి బిహు అని కూడా అంటారు. అస్సాంలో దీన్ని పంటల పండుగగా భావిస్తారు. ఇది మాఘ మాసంలో పంటల సీజన్ ముగింపును సూచిస్తుంది. ఈ సమయంలో అస్సాంలో బియ్యంతో వివిధ రకాల వంటకాలు తయారు చేస్తారు. కొబ్బరి, నువ్వులతో మిఠాయిలు చేస్తారు.
ఉత్తరాఖండ్..
ఉత్తరాఖండ్ లోని కుమావోన్ లో సంక్రాంతిని ఘుఘుటీ అని పిలుస్తారు. గర్వాల్ లో ఖచ్డీ సంక్రాంతి అంటారు. పిండి,బెల్లం కలిపి తీపి పదార్థాలు తయారుచేస్తారు. దీన్ని దానం చేస్తారు.
*నిశ్శబ్ద.