కార్తీకమాసంలో సంకష్టహర చవితి వ్రతం అద్బుతమే!!
హిందూ పురాణాలలో గణపతికి ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు, ఏకదంతుడూ, విలక్షణమైన దేహం కలిగినవాడు అయిన మన గణేశుడు పిల్లల నుండి పెద్దల వరకు ఎంతో ఇష్టదైవం. సకల విఘ్నాలను తొలగించే మన గణేశుడి కోసం అందరూ జరుపుకునే పండుగ వినాయక చవితి, వేరే రాష్ట్రలలో గణేష్ నవరాత్రుల పేరుతో ఎంతో గొప్పగా దీన్ని జరుపుతారు కూడ. అయితే వినాయక చవితికి ఉన్నంత ప్రాముఖ్యత, దాన్ని చేసుకున్నంత వ్యాప్తంగా సంకష్టహర చవితి గురించి, ఆ వ్రతం గురించి ఎక్కువమందికి తెలియదని చెప్పవచ్చు.
సకల సమస్యలను తన చూపుతోనే తొలగించగల గణపతిని ప్రసన్నం చేసుకోవడానికి చేసేదే సంకష్టహర చతుర్థి వ్రతం. వినాయకుడికి చవితి అంటే ఎంత ఇష్టమో, ఈ సంకష్టహర చవితి వ్రతం కూడా అంతే ఇష్టం.
ముఖ్యంగా ప్రస్తుతం కార్తీకమాసంలో వస్తున్న సంకష్టహర చతుర్థి మరింత గొప్ప ఫలితాలను ఇస్తుంది.
పగలంతా ఉపవాసం చేసి, సాయంత్రం గణపతిని పూజించి, ఉండ్రాళ్ళు, మోదకములు మొదలైనవి నైవేద్యంగా పెట్టి, చంద్రోదయ సమయంలో గణపతికి, చంద్రునికి, చతుర్థీ దేవతకు అర్ఘ్యప్రదానం చేసిన తరువాత ప్రసాదాన్ని స్వీకరించాలి. ఈ విధంగా సంకష్టహర చతుర్థీ వ్రతాన్ని ఆచరించడం వల్ల పనుల్లో ఆటంకాలు తొలగడమే కాదు, సమస్యలు ఏవైనా తొలగిపోతాయి, ఎంతో వేదించే కష్టాలు కూడా మేఘాలు చెదిరినట్టు చేదిరిపోతాయి. ఇంకా కోరికలు తీరుతాయి.
ఆదిదంపతులైన ఆ పార్వతీ పరమేశ్వరుల కుమారుడైన వినాయకుడే విఘ్నాధిపతిగా అందరి పూజలు అందుకుంటాడు. మన జీవితంలో ఎదురవుతున్న ఎలాంటి అడ్డంకులనైనా తొలగించేందుకు, ఎలాంటి సమస్యనైనా పరిష్కరించేందుకు వినాయకుడి చల్లని చూపు తప్పనిసరిగా ఉండాలి. ఆ వినాయకుడిని ప్రసన్నం చేసుకునేందుకు అందరికీ ఉన్న మార్గమే సంకటహర చతుర్థి!
చవితి చతుర్థి రెండూ ఒకటే. చవితి రోజు వినాయకుని పూజిస్తే ఎలాంటి గ్రహదోషాలైనా తీరిపోతాయి. పెళ్లి కాకపోవడం, పిల్లలు లేకపోవడం లాంటి కష్టాలూ తొలగిపోతాయి. ఆర్థిక సమస్యలన్నీ దూరమైపోతాయి.
ఈ వ్రతాన్ని ఆచరించేవాళ్ళు సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి. తలస్నానం చేసి పూజగదిని శుభ్రం చేసుకోవాలి. ఆ రోజు మొత్తం ఉపవాసం ఉండాలి. పాలు, పండ్లు, పచ్చికూరలు మాత్రం తీసుకోవచ్చు. (అది కూడా ఆరోగ్య పరిస్థితిని బట్టి. సంపూర్ణ ఆరోగ్యం కలవారు పూర్తి ఉపవాసం ఉంటే మంచిది.) ఇక సాయంత్రం సూర్యాస్తమ సమయానికి అంటే సుమారు ఆరుగంటలకు వినాయకుడి పటానికి గరికతో చేసిన దండ వేసి, ఉండ్రాళ్లను నైవేద్యంగా పెట్టి, దీపం వెలిగించాలి. ఆ తర్వాత చంద్రుడిని లేదా నక్షత్రాలని చూశాక ఉపవాసాన్ని వదలాలి. ఇంట్లో పూజ ముగిసిన తర్వాత ఇంట్లోనూ మరియు వీలైతే దగ్గరలో ఉన్న వినాయకుడి గుడికి వెళ్లి 3, లేదా 11 లేదా 21 ప్రదక్షిణలు చేయాలి.
ఇలా సంకటహర చవితి వ్రతాన్ని చేసేవారు అన్ని సమస్యల నుండి గట్టెక్కుతారు. అంతేకాదు ఈ వ్రతం చేసిన వాళ్ళను ఆ వినాయకుడు స్వయంగా కాపాడుతుంటాడని నమ్మకం. ఇంకా ఈ వ్రతం చేయడం వల్ల వాళ్ళు వినాయకుడికి ఎంతో ఇష్టమైన భక్తులు అవుతారట. మరణం ఉంటారువత వినాయకుడి సమక్షంలో ఉండేలా ఆ వినాయకుడి సాన్నిధ్యం దొరుకుతుందని పురాణ కథనాలు కూడా ఉన్నాయి.
మరింకెందుకు ఆలస్యం విఘ్నరాజు వ్రతాన్ని వినయంగా చేసేసుకోండి.
◆ వెంకటేష్ పువ్వాడ